నోట్ల రద్దు పేరు చెప్పి ఓట్లడిగే దమ్ముందా?.. మోడీకి ప్రియాంక సవాల్

న్యూఢిల్లీ: ‘‘ఒక బడి పోరగాడి ముచ్చటిది. ఇచ్చిన హోం వర్క్​ చేయలేదేందిరా?అని టీచర్​ అడిగితే, ‘జవహర్​లాల్​ నెహ్రూ నా వర్క్  గుంజుంగుకున్నడు, ఇందిరా గాంధీ నా నోట్స్​ చింపి పేపర్​ పడవలు చేసింది’అని బుకాయిస్తడట. మన ప్రధాని మోడీ తీరు కూడా ఈ స్టూడెంట్ లెక్కనే ఉన్నది. అధికారంలో ఉన్న ఐదేండ్లూ ఏం చేశారయ్యా అంటే చనిపోయిన మాజీ ప్రధానుల పేర్లెత్తుతున్నరు. అంతటితో ఆగకుండా, ‘రాజీవ్ ​గాంధీ పేరు చెప్పుకుని ఓట్లడిగే దమ్ము కాంగ్రెస్​కి ఉందా’ అనీ అడిగారు. అట్లైతే, ఓ ఢిల్లీ బిడ్డగా నేను ఆయనకో చాలెంజ్​ విసురుతున్నా.. మోడీజీ, మీకు దమ్ముంటే, చివరి రెండు దశల ఎన్నికల్లోనైనా నోట్ల రద్దు, జీఎస్టీ పేరుమీద జనాన్ని ఓట్లు అడగండి. ఉద్యోగాలు, విమెన్​ సేఫ్టీ విషయంలో మీరిచ్చిన హామీలపై మాట్లాడండి” అంటూ ప్రధాని మోడీని కాంగ్రెస్​ నేత ప్రియాంక గాంధీ నిలదీశారు.

నేను ఢిల్లీ బిడ్డని..

లోక్​సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలిసారి దేశరాజధాని ఢిల్లీలో పర్యటించిన ప్రియాంక, తనను తాను ‘ఢిల్లీ బిడ్డ’గా అభివర్ణించుకున్నారు. నార్త్​ఈస్ట్​ ఢిల్లీ, సౌత్​ ఢిల్లీలో  పార్లమెంట్​ నియోజకవర్గాల్లో బుధవారం రోడ్​ షోలు నిర్వహించిన ఆమె, ఆయా స్థానాల్లో కాంగ్రెస్​ క్యాండేట్లైన షీలా దీక్షిత్​, విజేందర్​ సింగ్​లను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘‘బీజేపీ వాళ్లలా జనాన్ని అవమానించేలా నేను మాట్లాడను. మోడీజీ ఢిల్లీకొచ్చి ఐదేండ్లే అయింది. అదే నేను, ఇక్కడే పుట్టి పెరిగా. ఢిల్లీ బిడ్డగా ఇక్కడి గల్లీలేకాదు జనాల మనసులు కూడా నాకు తెలుసు. ప్రస్తుతం ఢిల్లీ ఓటర్లు ఏమనుకుంటున్నారో మోడీకి వివరిస్తా. సరిహద్దులో సైనికుల్ని, దేశంలో మహిళల్ని కాపాడటంలో మోడీ ఫెయిలయ్యారు. అదేంటని ప్రశ్నిస్తే జవాబు చెప్పకుండా యారగెన్స్ ప్రదర్శిస్తున్నారు. సంస్థలతోపాటు మొత్తం దేశాన్ని నాశనం చేసిన మోడీకి ఓటుతో బుద్ది చెప్పడానికి ఢిల్లీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు”అని ప్రియాంక తెలిపారు. రోడ్​ షో   కిక్కిరిసిన జనం మధ్య సాగింది.

ప్రియాంక టైమే​ వేస్ట్​​: కేజ్రీవాల్

ఢిల్లీలో ఎన్నికల ప్రచారం చేస్తూ ప్రియాంక టైమ్​ వేస్ట్​ చేస్తున్నారని, మధ్యప్రదేశ్​కో, రాజస్థాన్​కో వెళ్లి బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే బాగుండేదని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్​ అన్నారు. ప్రియాంక ఢిల్లీలో ఆప్​కి వ్యతిరేకంగా, యూపీలో ఎస్పీ–బీఎస్పీ కూటమికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారే తప్ప బీజేపీని ఎందుకు ఢీకొట్టట్లేదని మండిపడ్డారు. ఆప్​ , కాంగ్రెస్​, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొన్న ఢిల్లీలో ఏడు లోక్​సభ స్థానాలకు మే 12న పోలింగ్​ జరగనుంది.

Latest Updates