మే 15 వ‌ర‌కు అన్ని విమాన స‌ర్వీసులు బ్యాన్‌.. ఆ దేశంలో కేసులు 49

హిమాల‌య దేశం నేపాల్ లోనూ డొమెస్టిక్, ఇంట‌ర్నేష‌న‌ల్ ఫ్లైట్స్ ఆప‌రేష‌న్లు మే 15 వ‌ర‌కు నిలిపేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. క‌రోనా క‌ట్ట‌డి కోసం ఏప్రిల్ 27 వ‌ర‌కు లాక్ డౌన్ విధించిన ఆ దేశం ఇప్పుడు విమాన ప్ర‌యాణాల‌పై నిషేధాన్ని మ‌రింత పొడిగించింది. ఒక ప్రాంతం నుంచి మ‌రో ప్రాంతానికి వైర‌స్ వ్యాప్తి జ‌ర‌గ‌కుండా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆ దేశ ప్రధాన మంత్రి కార్యాల‌య సెక్రెట‌రీ నారాయ‌న్ బిడారి ప్ర‌క‌టించారు. రెండు కోట్ల 80 ల‌క్ష‌ల మంది జ‌నాభా ఉన్న నేపాల్ లో ఇప్ప‌టి వ‌ర‌కు 49 క‌రోనా కేసులు న‌మోదయ్యాయి. అందులో 11 మంది డిశ్చార్జ్ అయ్యారు. అయితే లాక్ డౌన్ కూడా ఏప్రిల్ 27 నుంచి మ‌రికొన్నాళ్ల పాటు పొడిగించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

చైనాలోని వుహాన్ లో పుట్టిన క‌రోనా వైర‌స్ ప్ర‌పంచం మొత్తాన్ని క‌కావిక‌లం చేస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 28 ల‌క్ష‌ల మందికి పైగా ఈ మ‌హ‌మ్మారి బారిన‌ప‌డ్డారు. అందులో ల‌క్షా 90 వేల మంది ప్రాణాల‌ను కోల్పోయారు. దీనికి మందు లేక‌పోవ‌డం.. ఒక‌రి నుంచి మ‌రొక‌రికి వేగంగా వ్యాపిస్తుండడంతో అనేక దేశాలు లాక్ డౌన్ ప్ర‌క‌టించాయి. అన్ని ర‌కాల కార్య‌క‌ల‌పాలు నిలిచిపోయాయి. బ‌స్సులు, రైళ్ల‌తో పాటు విమాన ప్ర‌యాణాలు పూర్తిగా ఆగిపోయాయి. చాలా దేశాలు డొమెస్టిక్, ఇంట‌ర్నేష‌న‌ల్ ఫ్లైట్స్ ఆప‌రేష‌న్స్ బంద్ చేశాయి. భార‌త్ లోనూ మే 3 వ‌ర‌కు లాక్ డౌన్ ఉండ‌డంతో అప్ప‌టి వ‌ర‌కు విమానాల‌ను నిలిపేశాయి. అయితే ఆ త‌ర్వాత కూడా విమానాల బుకింగ్ ను చేప‌ట్టొద్ద‌ని ఎయిర్ లైన్స్ కంపెనీల‌కు కేంద్రం ప్ర‌భుత్వం ఆదేశించింది.

Latest Updates