నేటి యువతకు నేతాజీనే స్ఫూర్తి

నేతాజీ సుభాష్‌‌ చంద్రబోస్‌‌ 125వ జయంతి సందర్భంగా ఆయన జయంతి రోజైన జనవరి 23ను ‘పరాక్రమ దివస్’ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. 70 ఏండ్లుగా స్వతంత్ర భారత్ లో తగిన గౌరవం పొందలేకపోతున్న భరతమాత గర్వించే ముద్దుబిడ్డల్లో ఒకరైన మహాయోధుడికి ఇది నిజమైన నివాళి.

మనదేశం వెయ్యేళ్ల విదేశీ పాలన నుంచి విముక్తి పొంది స్వాతంత్ర్యం సాధించుకోవడంలో నిర్ణయాత్మక పాత్ర పోషించిన యోధుడు నేతాజీ సుభాష్​ చంద్రబోస్. విదేశీ గడ్డపై ‘నేషనల్​ ఆర్మీ’ని ఏర్పాటు చేసి బ్రిటిష్ పాలకులను తరిమికొట్టడానికి ఆయన జరిపిన వీరోచిత పోరాటం ఆంగ్లేయులకు వణుకు పుట్టించింది. మహాత్మా గాంధీ, నాటి కాంగ్రెస్ నాయకత్వం జరిపిన శాంతియుత ఉద్యమం కన్నా నేతాజీ పోరాటమే ఇండియాకు స్వాతంత్య్రం రావడంలో కీలక పాత్ర పోషించినట్లు అప్పటి బ్రిటన్​ ప్రధాని క్లెమెంట్ అట్లే స్పష్టం చేశారంటే బోస్​ గొప్పతనం తెలుస్తుంది. మనదేశం కోసమే కాదు ఆసియా- పసిఫిక్ ప్రాంతంలో దాదాపు 60 దేశాల స్వాతంత్ర్య పోరాటాలకు ఆయనే స్ఫూర్తి. 2007లో ఇండియాకు అధికారిక పర్యటనకు వచ్చిన అప్పటి జపాన్ ప్రధాని షింజో అబే ఇతర దేశాధినేతల మాదిరిగా ఢిల్లీలో గాంధీ సమాధి వద్ద నివాళి అర్పించకుండా కోల్​కతాకు వచ్చి నేతాజీ కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపడమే దీనికి నిదర్శనం. చాలా పరిమిత వనరులతో, ఆపదలను సైతం లెక్క చేయకుండా రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సుదూర ప్రయాణాలు చేసి జపాన్, జర్మనీ వంటి దేశాల మద్దతును వ్యూహాత్మకంగా సంపాదించడం, విదేశీ గడ్డపై మన దేశ స్వాతంత్ర్యం కోసం ‘నేషనల్​ ఆర్మీ’ని సిద్ధం చేయడం లాంటి సాహసాలను ప్రపంచ చరిత్రలో మరెవ్వరూ చేసి ఉండరు. బ్రిటిష్ వారితో బేరసారాలు కాకుండా, పోరాడి స్వాతంత్ర్యం సాధించుకోవడం పట్ల ఆయన చూపిన ధైర్యసాహసాలు ఆనాటి యువతలో ఉద్వేగాన్ని నింపాయి. బ్రిటిష్ నిఘాలో కూడా ఆయన దేశం వదిలి వెళ్లిన విధానం సైనిక నిపుణులను సైతం ఆశ్చర్యపరిచింది.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేతాజీ పట్ల అమిత గౌరవం చూపుతూ వస్తున్నారు. 2015లో నేతాజీ కుటుంబ సభ్యులు, బంధువులను ఢిల్లీకి ఆహ్వానించి వారితో కొంత సమయం గడిపారు. వారి కోరిక మేరకు ఎన్నో ఏండ్లుగా రహస్యంగా ఉంచుతూ వచ్చిన నేతాజీకి సంబంధించిన వందలాది ఫైళ్లను బయటపెట్టారు. అంతటి గొప్ప యోధుడి జయంతిని ‘పరాక్రమ దివస్’గా జరుపుకొంటూ నేతాజీని గుర్తుచేసుకోవడం యువతరానికి స్ఫూర్తిదాయకం. ఆ యోధుడి 125వ జయంతి సందర్భంగా ఏడాది పొడవునా దేశ, విదేశాల్లో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయం. ఈ కార్యక్రమాలను ప్రధాని మోడీ కోల్​కతాలో ప్రారంభిస్తున్నారు. ఆదే రోజు నేతాజీ పుట్టిన ఒడిశాలోని కటక్ లో కూడా ప్రత్యేక ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఐదు యూనివర్సిటీల్లో నేతాజీ పీఠాలను ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని విమానాలపై నేతాజీ చిత్రాలను ముద్రిస్తుండగా, ఒక రైలుకు నేతాజీ పేరు పెట్టనున్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం నేతాజీని గుర్తుచేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తాయి.-డా.తూడి ఇంద్రసేనారెడ్డి, సోషల్ యాక్టవిస్ట్.

ఇవి కూడా చదవండి..

కిలిమంజారో పర్వతమెక్కిన హైదరాబాద్ సీపీ

హోం ట్యూషన్లకు ఫుల్ డిమాండ్​.. నెలకు రూ. 3 నుంచి 15 వేలు

V6 న్యూస్ రేటింగ్​పై కుట్ర.. రేటింగ్​ పెరగకుండా ప్రయత్నాలు

Latest Updates