క‌రోనిల్‌తో క‌రోనా త‌గ్గుతుంద‌ని మేం ఎప్పుడూ చెప్ప‌లేదు: ప‌తంజ‌లి సీఈవో

ప‌తంజ‌లి సంస్థ క‌రోనా ఔష‌ధం విష‌యంలో యూట‌ర్న్ తీసుకుంది. క‌రోనిల్ మందు ద్వారా క‌రోనా మ‌హ‌మ్మారిని కంట్రోల్ చేయొచ్చ‌ని గానీ, దీని బారిన‌ప‌డిన వారికి న‌యం చేయ‌వ‌చ్చ‌ని గానీ తాము ఎప్పుడూ చెప్ప‌లేద‌న్నారు ప‌తంజ‌లి సీఈవో ఆచార్య బాల‌కృష్ణ‌. తాము ప‌రిశోధ‌న‌ల ద్వారా మందును త‌యారు చేశామ‌ని, క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ చేసినప్పుడు పేషెంట్ల‌కు క‌రోనా త‌గ్గింద‌ని చెప్పామ‌న్నారు. ఇందులో ఎటువంటి క‌న్ఫ్యూజ‌న్ లేద‌ని తెలిపారు.

కాగా, జూన్ 23న ప‌తంజ‌లి సంస్థ‌ క‌రోనిల్ అనే ఆయుర్వేద ఔష‌ధాన్ని లాంచ్ చేసింది. ఈ సంద‌ర్భంగా క‌రోనాను వారంలో త‌గ్గించ‌గ‌ల‌ద‌ని, క‌రోనిల్‌పై త‌మ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌లో ఈ విష‌యం రుజువైంద‌ని ఆ రోజు ప్ర‌క‌టింంచారు ప‌తంజ‌లి సీఈవో. క‌రోనా రాకుండా ఇమ్యూనిటీ పెంచుకునేందుకు కూడా ఈ మందు ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు. క‌రోనిల్ కొద్ది రోజుల్లోనే దేశ వ్యాప్తంగా అన్ని ప‌తంజ‌లి స్టోర్స్‌లో అందుబాటులోకి వ‌స్తుంద‌ని చెప్పారు. అయితే దీనిపై అదే రోజు కేంద్ర ఆయుష్ శాఖ స్పందించి.. క‌రోనా ఔష‌ధ‌మ‌న్న ప్ర‌క‌ట‌న‌లు నిలుపుద‌ల చేయాల‌ని ఆదేశించింది. ఈ మందు త‌యారీకి జరిగిన ప‌రిశోధ‌న వివ‌రాలు, క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ శాంపిల్ సంఖ్య‌, ఫ‌లితాలు వంటి ప‌లు విష‌యాల‌పై నివేదిక ఇవ్వాల‌ని ప‌తంజ‌లి సంస్థ‌ను ఆదేశించింది. ప‌తంజ‌లి రీసెర్చ్ చేపట్టిన ల్యాబ్ ఉత్త‌రాఖండ్‌లో ఉంది. ఈ మందుకు సంబంధించి తొలుత ప‌ర్మిష‌న్లు తీసుకుంది ఆ రాష్ట్ర ఆయుర్వేద విభాగం నుంచే కావ‌డంతో క‌రోనిల్ వివాదాస్ప‌ద‌మైన నేప‌థ్యంలో ఆ రాష్ట్ర ఆయుర్వేద శాఖ లైసెన్స్ జారీ అధికారులు స్పందించారు. అస‌లు ప‌తంజ‌లి లైసెన్స్ అప్లికేష‌న్‌లో క‌రోనా మందు అని చెప్ప‌లేద‌ని, ద‌గ్గు, జ్వ‌రం, రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే ఔష‌ధ‌మ‌ని ధ‌ర‌ఖాస్తులో పేర్కొంద‌ని వెల్ల‌డించారు. ఆ సంస్థ నుంచి వివ‌ర‌ణ కోరుతూ నోటీసులు ఇచ్చిన‌ట్లు తెలిపారు. అలాగే రాజ‌స్థాన్‌లోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించ‌డంతో ఆ హాస్పిట‌ల్ ఎటువంటి ప‌ర్మిష‌న్ తీసుకోకపోవ‌డంపై యాజ‌మాన్యానికి నోటీసులు ఇచ్చింది రాజ‌స్థాన్ ఆరోగ్య శాఖ‌. అలాగే ప‌తంజ‌లి సంస్థ‌పై ప‌లు చోట్ల ఎఫ్ఐఆర్‌లు కూడా న‌మోద‌య్యాయి. ఇలా ప‌తంజ‌లి ఔష‌ధం క‌రోనిల్‌పై వివాదాలు చుట్టుముట్ట‌డంతో ప‌తంజ‌లి సీఈవో తామెప్పుడూ క‌రోనాకు మంద‌ని చెప్ప‌లేదంటూ వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.