దేశంలోనే మొదటిసారి.. తల్లికి కరోనా నెగిటివ్.. అప్పుడే పుట్టిన బిడ్డకు పాజిటివ్

కరోనావైరస్ ఎవరికి ఎలా సోకుతుందో కూడా తెలియకుండానే అందరినీ అంటుకుంటుంది. శాస్త్రవేత్తలు గతంలో చేసిన పరిశోధనల ద్వారా.. తల్లి నుంచి పుట్టిన బిడ్డకు కరోనా సోకుతుందని తెలిపారు. కానీ ఇప్పుడు తల్లికి కరోనా తగ్గినా.. తల్లి కడుపులోని బిడ్డకు మాత్రం కరోనా తగ్గడం లేదని తేలింది. ఢిల్లీలోని నాంగ్లోయికి చెందిన 25 ఏళ్ల గర్భిణీ మహిళ జూన్ 11న రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో కరోనాతో చేరింది. ఆమె నుంచి భర్తకు కూడా సోకడంతో ఆయన కూడా అదే ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. ఆ మహిళకు జూన్ 25న మరోసారి పరీక్ష చేయగా.. మళ్లీ పాజిటివ్ వచ్చింది. దాంతో మరికొన్ని రోజులు ఆగి.. జూలై 7న మరోసారి ఆర్టీపీసీఆర్ పరీక్ష ద్వారా కరోనా టెస్ట్ చేశారు. అప్పుడు కరోనా నెగిటివ్ వచ్చింది. కరోనా ఫలితాలు వచ్చిన మరుసటి రోజే ఆ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

అయితే బిడ్డ పుట్టిన ఆరు గంటల తర్వాత.. కరోనా టెస్ట్ కోసం వైద్యులు బిడ్డ నుంచి శాంపిల్ తీసుకున్నారు. ఆ శాంపిల్ లో బిడ్డకు కరోనా పాజిటివ్ గా తేలింది. దాంతో వైద్యులు ఆశ్చర్యపోయారు. తల్లికి కరోనా నెగిటివ్ వచ్చిన తర్వాతే బిడ్డ పుట్టింది.. అటువంటిది బిడ్డకు పాజిటివ్ ఎలా వచ్చిందని ఆలోచనలో పడ్డారు. పిల్లలకి బొడ్డు తాడు ద్వారా కూడా కరోనా సోకుతుందని చైనాలో జరిపిన పరిశోధనలలో తేలింది. కానీ, దానికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు ఇప్పటికైతే లేవు.

లోహియా హాస్పిటల్ లో నియోనాటల్ వ్యాధుల విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ రాహుల్ చౌదరి మాట్లాడుతూ.. ‘కరోనావైరస్ వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత మహిళ తన బిడ్డకు జన్మనిచ్చింది. డెలివరీ తర్వాత కూడా తల్లికి నెగిటివ్ వచ్చింది, కానీ బిడ్డకు మాత్రం పాజిటివ్ వచ్చింది. దీన్ని బట్టి కరోనా ఇన్ఫెక్షన్ తల్లి బొడ్డు తాడు నుండి కూడా శిశువుకు వ్యాపిస్తుందని తెలుస్తుంది. ఇలా జరగడం దేశంలో ఇదే మొదటిసారి’ అని ఆయన అన్నారు.

లోహియా ఆస్పత్రి మైక్రోబయాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కీర్తి మాట్లాడుతూ.. శిశువులో కరోనావైరస్ అధిక వైరల్ లోడ్ తో ఉన్నట్లు తెలిపారు. శిశువుకు ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నట్లు ఆమె తెలిపారు.

For More News..

మార్కెట్లోకి డైమండ్ మాస్కులు.. ఆర్డరిచ్చి మరీ చేయించుకుంటున్న కొత్త జంటలు

కరోనా తీవత్రను తగ్గించేందుకు మరో డ్రగ్

38 ఏళ్ల కింద మర్డర్.. ఇప్పుడు అరెస్ట్

యూపీలో రాత్రికి రాత్రే మొదలైన లాక్డౌన్

Latest Updates