పుట్టినప్పుడు తక్కువ బరువుంటే.. మగవాళ్లకు సంతానం కష్టమే!

గర్భం దాల్చినప్పుడు మహిళలు జాగ్రత్తలు పాటించాలంటున్న శాస్త్రవేత్తలు

నేటి తరంలో సంతాన లేమి ఒక పెద్ద సమస్యగా మారుతోంది. పెళ్లి తర్వాత ఏళ్లు గడుస్తున్నా కొన్ని జంటలకు పిల్లలు పుట్టడం లేదు. ఆస్పత్రులు, ఫర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరిగాక.. కొంత మందికి సంతానం కలుగుతోంది. మరికొంత మందికి అప్పటికీ పిల్లలు పుట్టక, లోపం ఏంటో తెలియక దిగులులో ఉండిపోతున్నారు. అయితే సంతాన లేమిపై పరిశోధన చేసిన డెన్మార్క్ శాస్త్రవేత్తలు సంతాన లేమికి మగవాళ్లలో ఓ కొత్త కారణాన్ని గుర్తించారు. వాళ్లు పుట్టినప్పటి బరువుకు, సంతానలేమి సమస్యకు మధ్య లింక్ ఉందని తేల్చారు. మూడు కిలోల కంటే తక్కువ బరువుతో పుట్టిన 8.3 శాతం మగవాళ్లకు పిల్లలు పుట్టడం కష్టమని చెబుతున్నారు.
మహిళల్లో బరువు సమస్య లేదు
డెన్మార్క్ లోని అర్హస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సుదీర్ఘకాలం పాటు 5500 మంది మగవాళ్లు, 5300 మంది ఆడవాళ్లపై అధ్యయనం చేశారు. 1984 నుంచి 1987 మధ్య పుట్టిన వారికి 32 – 35 ఏళ్ల వయసు వచ్చే వరకు ఫాలోఅప్ చేస్తూ వచ్చారు.
వారిలో 12.5 శాతం జంటలకు సంతానలేమి సమస్యలు వచ్చాయి. మూడింట ఒక భాగం మగవాళ్లలోనే ప్రాబ్లమ్ వల్లే పిల్లలు పుట్టడం లేదని గుర్తించారు. ఇందులో మూడు కిలోలు, అంతకంటే ఎక్కువ బరువుతో ఉన్న 5.7 శాతం మగవాళ్లలో సంతానలేమి సమస్య ఉండగా, 8.3 శాతం మగవాళ్లు పుట్టినప్పుడు తక్కువ బరువు ఉన్నవాళ్లేనని తేలింది. అమ్మ గర్భంలో ఉన్నప్పుడు సరైన ఎదుగుదల లేకపోవడంతో పెద్దయ్యాక వీర్యం ఉత్పత్తితో పాటు జననాంగాల పెరుగుతలలోనూ తేడాలు ఉన్నట్లు గుర్తించారు శాస్త్రవేత్తలు. అయితే మహిళల్లో సంతానలేమికీ పుట్టినప్పటి బరువుకు ఏ సంబంధం లేదని వారి పరిశోధనలో తెలిసందని డాక్టర్ ఆనా చెప్పారు.
కారణాలు..
గర్భం దాల్చిన సమయంలో మహిళలు సరిగా నిద్రపోకపోయినా, మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోకపోయినా పిల్లలు తక్కువ బరువుతో పుట్టే చాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. మహిళలు 40 ఏళ్లు దాటాక సంతానం కోసం ప్రయత్నించడం వల్ల కూడా తక్కువ బరువుతో పిల్లలు పుట్టే ప్రమాదం ఉందని తెలిపారు. అలాగే గర్భిణిగా ఉన్న మహిళకు స్మోకింగ్, లిక్కర్ తాగే అలవాటు ఉన్న వాళ్ల పిల్లలు తక్కువ బరువుతో పుడుతారని చెబుతున్నారు. అయితే వారి భర్తలకు సిగరెట్ తాగే అలవాటు ఉండి, ఆ మహిళ పాసివ్ స్మోకింగ్ చేసినా పిల్లల్లో డిఫెక్స్ వచ్చే అవకాశం ఉందన్నారు. షుగర్, బీపీ లాంటి సమస్యలు ఉన్నా గర్భంలో పిల్లల ఎదుగుదల సరిగా ఉండదు.

గర్భం దాల్చిన సమయంలో వీలైనంతగా స్మోకింగ్, స్మోక్ చేసేవారికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. గర్భాశయంపై ప్రభావం పడి కడుపులో పిల్లలు ఎదగాల్సినంతగా ఎదగరని, దాని వల్ల మగపిల్లల్లో హైపోస్పాడియా (జననాంగం, బ్లాడర్ కనెక్ట్ అయ్యే ప్రాంతంలో సమస్య), క్రిప్టోర్కిడిజమ్ (వృషణాల్లో సమస్య) లాంటి కండిషన్స్ బారిన పడతారని గుర్తించారు. దీని వల్లే పెద్దయ్యాక సంతానలేమి సమస్య వస్తోందని డాక్టర్ ఆనా చెప్పారు. పుట్టుకతో తక్కువ బరువు ఉంటే మగవాళ్లకు సంతానలేమి సమస్యలు వస్తాయని గతంలోనూ యూకేలోని షెఫీల్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనలోనూ తేలింది.

గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • మంచి ఆరోగ్యకరమైన జీవన శైలి
  • పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం
  • మంచిగా నిద్రపోవడం
  • పొగకు దూరంగా ఉండడం
  • మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.

Latest Updates