హైకోర్టుకు కొత్త బిల్డింగ్: 70 ఎకరాల్లో నిర్మాణం

సెక్రటేరియెట్, అసెంబ్లీ కొత్త భవనాలకు భూమిపూజలు జరిగాయి. ఇక సీఎం జాబితాలో హైకోర్టుకు కొత్త భవనం నిర్మించే ఆలోచన ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. హైకోర్టు కోసం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలోని బుద్వేల్ లో అధునాతన బిల్డింగ్ నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజనకు ముందే ఈ ప్రాంతంలో హైకోర్టు నిర్మా ణానికి అప్పటి సర్కారు 70 ఎకరాలు ఇచ్చింది. తెలంగాణ ఉద్యమం కారణంగా అది అలాగే ఉండిపోయింది.  ప్రస్తుతం ఆ భూమి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అధీనంలో ఉంది.

సీఎస్‌తో హైకోర్టు అధికారుల చర్చలు

కొత్త బిల్డింగ్ నిర్మాణం కోసం రెండు వారాల క్రితం హైకోర్టు అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషితో చర్చలు జరిపినట్లు తెలిసింది. ప్రస్తుత బిల్డింగ్ నగర నడిబొడ్డున ఉండటం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు వస్తున్నాయని, బుద్వేల్ లో నిర్మిస్తే ఆ సమస్య ఉండదని, ఎయిర్ పోర్ట్ కనెక్టివిటీ కూడా ఉంటుందని చెప్పినట్లు తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో కేటాయించిన 70 ఎకరాలను తమకు ఇవ్వాలని వారు కోరినట్లు న్యాయశాఖ వర్గాలు చెప్పాయి. హైకోర్టు కొత్త బిల్డింగ్ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి కూడా సుముఖంగా ఉన్నట్టు అధికారులు చెప్పారు.సెక్రటేరియెట్ కొత్త భవనం నిర్మాణం మొదలు కాగానే హైకోర్టు బిల్డింగ్ పై సీఎం దృష్టి పెడతారని అధికార వర్గాలు చెబుతున్నాయి.

మ్యూజియంగా ప్రస్తుత బిల్డింగ్

ప్రస్తుత హైకోర్టు బిల్డింగ్ ను మూసి నది ఒడ్డున ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిర్మించారు. 1915 ఏప్రిల్15న మొదలైన పనులు నాలుగేళ్లపాటు కొనసాగాయి. 1920 ఏప్రిల్ 20న భవనాన్ని ప్రారంభించారు. నిజాం పాలన పూర్తయ్యే వరకు ఈ భవనంలోనే హైకోర్టు కార్యాకలాపాలు కొనసాగాయి. ఉమ్మడి ఏపీకి ఇక్కడి నుంచే న్యాయసేవలు అందాయి. కొత్త బిల్డింగ్ నిర్మిస్తే ప్రస్తుత  బిల్డింగ్ ను మ్యూజియంగా మార్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

Latest Updates