ఒత్తిడి నుండి రిలాక్స్ కోసం కొత్త కాన్సెప్ట్

ఖాళీగా ఉండుడే పని..!

వర్క్​ ఫ్రమ్​ హోమ్​ చేస్తున్న చాలామందికి వర్కింగ్​ అవర్స్​ పెరిగాయి. మునుపటి కంటే టార్గెట్లు ఎక్కువయ్యాయి. దాంతో పేరుకు ఇంట్లో ఉంటున్నారే తప్ప, పిల్లలతో గడపడానికి టైం ఉండట్లేదు. అంతేకాదు, భార్యాభర్తలిద్దరూ వర్క్​ ఫ్రమ్​ హోమ్​లో ఉంటే, ఆ ఇల్లు ఒక ఆఫీస్​ అయిపోతోంది. అమ్మానాన్నలు కంప్యూటర్ల ముందు కూర్చుంటే.. పిల్లలు మరో రూమ్​లో ఫోన్లలో ఆన్​లైన్​ క్లాసులు వింటున్నారు. అయితే ఇలాంటి బిజీ షెడ్యూల్​ నుంచి బయటికొచ్చి పిల్లలతో గడిపేందుకు వచ్చిన కాన్సెప్ట్​ ‘డూ నతింగ్’. అంటే ఏ పనీ చేయకుండా ఉండటం.

ఆఖరిసారిగా మీరు ఏ పనీ చేయకుండా ఉన్నదెప్పుడు? ఎప్పుడైనా ఖాళీగా ఉండి.. టైం​ వేస్ట్ కాలేదని అనుకున్నారా? ఎలాంటి ప్లాన్​ లేకుండా ఫ్యామిలీతో టైం​ స్పెండ్ చేశారా? ఇలాంటి ప్రశ్నలు  కొత్తగా ఉంటాయి. ‘పిల్లలతో రోడ్​ ట్రిప్స్​కి వెళ్తున్నాం’, ‘పార్క్​లో గేమ్స్​ ఆడుతున్నాం’, ‘ఆన్​లైన్​ క్లాసులప్పుడు హెల్ప్​ చేస్తున్నాం’..  ఇవన్నీ పిల్లల కోసమే కదా అంటారా? అయితే ఇవేవీ ‘డూ నతింగ్​’ కిందకు రావు. మరి ఏం చేయకుండా ఎలా ఉండాలో తెలుసుకుందాం.

పది నిమిషాలు చాలు

ఆఫీస్​ పని, ఇంట్లో పనులు రోజూ ఉండేవే. అయితే వాటికోసం ఇరవై నాలుగ్గంటలు కేటాయించనక్కర్లేదు. అలాగని డూ నతింగ్​ కోసం గంటల సమయం అవసరం లేదు. రోజు మొత్తంలో నాలుగు గంటలకోసారైనా ఐదు, పది నిమిషాలు కేటాయిస్తే చాలు.  ఆ పది నిమిషాలు ప్రపంచానికి పూర్తిగా డిస్కనెక్ట్​ అయ్యి ఫ్యామిలీతోనే ఉండాలి. కావాలంటే రోజులో ఎప్పుడెప్పుడు ఖాళీగా ఉండాలో ఒక షెడ్యూల్​ వేసుకోవచ్చు. మొదట్లో ఆ టైం పీరియడ్​లో ఏం చేయాలో తెలియకపోవచ్చు. కానీ, వారాలు గడుస్తున్న కొద్దీ డూ నతింగ్​ కాన్సెప్ట్​ని ఎవరికి వాళ్లు కొత్తగా ట్రై చేస్తారు. ఆఫీస్​ ఫోన్​ కాల్స్​ మధ్యలో పావుగంట గ్యాప్​ వచ్చినా, బాస్​తో అపాయింట్​మెంట్ కాన్సిల్​ అయినా.. ఆ టైంని డూ నతింగ్​కి ఉపయోగించుకోవచ్చు. అంతేతప్ప ఆ గ్యాప్​లో ఫోన్​ పట్టుకోవడం, సోషల్ మీడియాలో స్క్రోలింగ్​ చేయడం కాకుండా పిల్లలతో రిలాక్స్​ అవ్వాలి.

స్టార్ట్​ స్మాల్​

డూ నతింగ్​ అనేది అనుకున్నంత సులువు కాదు. ఎలాంటి ప్లాన్స్​, షెడ్యూల్స్​, ఎజెండా లేకుండా మైండ్​ని క్లియర్​గా ఉంచుకోవడమే ఈ కాన్సెప్ట్. పిల్లలైనా, పెద్దలైనా ఈ కాన్సెప్ట్ మొదలుపెట్టిన కొత్తలో ఎక్కువ సమయం ఖాళీగా ఉండటం కష్టం. అందువల్ల చిన్నచిన్న ఇంటర్వెల్స్​లో        డూ నతింగ్​ని సెట్ చేసుకోవాలి. ఆఫీస్​ వర్క్​లో ఉన్నప్పుడు మధ్యమధ్యలో ఐదు నిమిషాలు పిల్లలు, ఫ్యామిలీతో గడపొచ్చు. అలాగని వాళ్లతో బలవంతంగా బుక్​ రీడింగ్​, డ్రాయింగ్​ చేయించడం కాదు. ఎలాంటి ఆలోచన లేకుండా వాళ్లతో గడపడం ముఖ్యం.

గిల్టీ ఫీలింగ్​ వద్దు

ఇంతసేపు ఏమీ చేయకుండా టైం వేస్ట్ చేశామనే గిల్టీ ఫీలింగ్​ ఉండకూడదు.అందువల్ల ఎప్పటికప్పుడు మనసుకు గుర్తుచేసుకోవాల్సిన విషయం ఏంటంటే.. ‘మనం సంతోషంగా, ప్రశాంతంగా ఉండటానికి కావాలనే ఏం చేయొద్దనే కాన్సెప్ట్​ని ఎంచుకున్నాం’ అని. కాబట్టి ‘టైం వేస్ట్ అయింది.. బద్ధకంగా ఉన్నామా’ అనే అనుమానాలు పెట్టుకోవద్దు. ఫ్యామిలీ లైఫ్​తో పాటు ఆఫీస్​ వర్క్​లో ప్రొడక్టివిటీ పెరగాలంటే ఇలాంటి చిన్నచిన్న బ్రేక్స్​ చాలా అవసరం.

రూల్స్​ పెట్టొద్దు

ఎజెండా లేకుండా ఫ్యామిలీతో కూర్చుని టైం గడపడం ఎలా? అనే సందేహం అందరికీ వస్తుంది. తెలియకుండా ఒక గేమ్​ లేదా యాక్టివిటీ ప్లాన్​ని బ్రెయిన్​ సూచిస్తుంది. దాన్ని కంట్రోల్​ చేసుకుని అప్పటి ప్రజెంట్ మూమెంట్​ ని ఎంజాయ్​ చేయాలి. ఒక్కోసారి పిల్లలకు బోర్​ కొట్టే అవకాశం ఉంది కాబట్టి మాటలతో ఎంగేజ్​ చేయొచ్చు. పిల్లలకు ఆడుకోవాలని ఉంటే ఆడనివ్వాలి. కానీ ఆటలో పేరెంట్స్ ఏ రూల్స్ పెట్టొద్దు. ఇలా చేస్తున్న కొద్దీ పిల్లలతో పాటు పెద్దలూ క్రియేటివ్​గా టైంని స్పెండ్ చేస్తారు.

చుట్టు పక్కల తిరిగితే చాలు

డూ నతింగ్​ కోసం పార్కులు, దూర ప్రదేశాలకు వెళ్లడం కరెక్ట్ కాదు. చుట్టుపక్కల పరిసరాల్లోనే టైం స్పెండ్​ చేయాలి. ఫిట్​నెస్ గోల్స్​ని పక్కనబెట్టి, పిల్లలతో ఇంటిచుట్టూ నాలుగు రౌండ్లు వాకింగ్​ చేయొచ్చు. పువ్వులు, ఆకులు, మట్టిని చూపించి పిల్లలకు వాటి కలర్స్​ ఏంటో చెప్పొచ్చు. చల్లటి గాలులను ఎంజాయ్​ చేయొచ్చు. నడుస్తున్న అడుగుల చప్పుళ్లను అబ్జర్వ్​ చేయొచ్చు. ఇవన్నీ డూ నతింగ్​ టైం​లో చేస్తే, పిల్లలు పేరెంట్స్​తో పాటు నేచర్​కి కూడా కనెక్ట్ అవుతారు. అయితే ఉదాహరణకు చెప్పిన పనులను పనికట్టుకుని చేయొద్దు సుమీ.

అన్​ప్లగ్​  గ్యాడ్జెట్స్​

ఫిజికల్​గా.. మెంటల్​గా ఎప్పుడైనా డల్​ అయినప్పుడు చాలామంది చేసేపని ఫోన్​ పట్టుకోవడం లేదా టీవీ ఆన్​ చేయడం. అయితే ఈ రెండూ టైం, ఎనర్జీని వాడుకుంటాయే తప్ప బూస్ట్​ చేయలేవు. డూ నతింగ్ కాన్సెప్ట్​లో మైండ్​ అసలు ఎంగేజ్​లో ఉండకూడదు. ఫోన్​ పట్టుకున్నారంటే.. బ్రెయిన్ దాన్ని చూసే పనిలో ఉందని, అదే బ్రెయిన్​ నోటిఫికేషన్​ కోసం ఎదురు చూస్తూ ఎనర్జీని ఖర్చు చేస్తోందని అర్థం చేసుకోవాలంటాడు ఇంగ్లీష్​ రైటర్​ సెలెస్టే హెడ్లీ.​ అందువల్ల డూ నతింగ్​లో టైంని ఫోన్​, టీవీకి కాకుండా ఫ్యామిలీకి ఇవ్వాలి. ఖాళీ టైం​ దొరికినప్పుడు ఫోన్​ని ఫ్లైట్​ మోడ్​లో పెట్టుకోవాలి. లాప్​టాప్​ వంటి గ్యాడ్జెట్స్​ని ఆఫ్​ చేయాలి. ఆ టైంలో ​పిల్లల్ని  వీధుల్లో తిప్పుతూ ఆకాశంలో నెమ్మదిగా ప్రయాణిస్తున్న మేఘాలను చూస్తుండొచ్చు. కావాలంటే అలారం సెట్ చేసుకుని, మళ్లీ వర్క్​లో జాయిన్​ అవ్వచ్చు.

for more news…

Latest Updates