ఖర్చులకు పోవద్దంటున్న సీఎం కేసీఆర్..రూ.3కోట్లతో కాన్ఫరెన్స్ హాల్ నిర్మిస్తున్న అధికారులు

హైదరాబాద్​, వెలుగు: అనవసరమైన ఖర్చులకు పోవద్దు.. తగ్గించాలని సీఎం కేసీఆర్​ చెబుతున్నా, అధికారులు మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకోవట్లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బీఆర్​కే భవన్​లో ఉన్నతాధికారుల సమావేశాలు, వీడియో కాన్ఫరెన్సుల కోసం టెర్రేస్​పై దాదాపు రూ.3 కోట్లతో కాన్ఫరెన్స్​ హాల్​ కట్టిస్తున్నారు. అందులో సీఎస్​ కోసం ప్రత్యేక లాంజ్​, ఉన్నతాధికారులు సమావేశం అయ్యేందుకు రౌండ్​టేబుల్​తో మినీ హాల్​నూ ఏర్పాటు చేస్తున్నారు. ఇక, కాన్ఫరెన్స్​ హాల్​ పక్కనే ప్యాంట్రీ, వీఐపీ డైనింగ్​ రూంనూ కడుతున్నారు. పరిపాలన శాఖ అనుమతితతో ఉద్యోగులు వ్యక్తిగత ఫంక్షన్లనూ నిర్వహించుకునే అవకాశం కల్పిస్తారన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాన్ఫరెన్స్​ హాల్​ కట్టిన తర్వాత టెర్రేస్​ను 10వ అంతస్తుగా పరిగణించి ఓ హైస్పీడ్​ లిఫ్ట్​ను ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తోంది. జస్ట్​ 30 నుంచి 40 సెకన్లలోనే పైకి వెళ్లేలా లిఫ్టును ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. లిఫ్టు దిగే చోటే ఓ కేఫెటేరియా కూడా ఏర్పాటు చేయనున్నారని అధికారులు చెబుతున్నారు. మార్చి లోపు ఆ పనులన్నీ పూర్తి చేయాలని ముందుగా అనుకున్నా, జనవరిలోపే కట్టేయాలని టీఎస్​ఐఐసీకి జీఏడీ అధికారులు ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది. జనవరిలో కేసీఆర్​ చేతుల మీదుగా దానిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

వెల్లువెత్తుతున్న విమర్శలు

అయితే, దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్థిక మాంద్యం వల్ల ఖర్చులు తగ్గించుకోవాల్సిందిగా సీఎం కేసీఆర్​ చెబుతున్నా, అధికారులు మాత్రం ఆ మాటలు వినట్లేదని కొందరు అధికారులు అంటున్నారు. కేవలం రెండేళ్ల పాటు ఉండే సచివాలయం కోసం ఇప్పటికే రూ.10 కోట్లదాకా ఖర్చు చేశారని, ఇప్పుడు ఒక్క కాన్ఫరెన్స్​ హాల్​ కోసం రూ.3 కోట్లు ఖర్చు పెట్టడం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. అంతేగాకుండా రెండు నెలల క్రితమే ఓ ఉన్నతాధికారి చాంబర్​ను రెనోవేషన్​ చేశారని, ఇప్పుడు వాస్తు బాగాలేదని మళ్లీ కోటి రూపాయలు పెట్టి రెనోవేషన్​ చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే నిధుల కొరత, ఆర్థిక మాంద్యం వల్ల కొన్ని సంక్షేమ పథకాలకు నిధులు ఆగిపోయాయని, ఈ టైంలో కాన్ఫరెన్స్​ హాల్​ కోసం అంత ఖర్చు ఎందుకని కీలక శాఖకు చెందిన ఓ అధికారి ప్రశ్నించారు. సీఎం ఆదేశాలను అధికారులు పట్టించుకోవట్లేదని, నిధుల కొరత ఉన్నప్పుడు దుబారా ఖర్చు ఎందుకని మరో శాఖకు చెందిన ఇంకో అధికారి విమర్శించారు.