కరోనా వైరస్​ పాముల నుంచి పాకిందట

  • గబ్బిలాల నుంచి కూడా.. వాటి జీన్స్​తో పోల్చి చూసిన సైంటిస్టులు
  • వుహాన్​, హువాంగాంగ్​ సిటీలకు రాకపోకలు బంద్​
  •  రైళ్లు, బస్సులు, విమానాలు స్టాప్​
  • సినిమా హాళ్లు, షాపింగ్​ మాళ్లు, ఎగ్జిబిషన్​ సెంటర్లు మూత
  • గ్లోవ్స్​, మాస్కులకు భారీగా పెరిగిన డిమాండ్​
  • 10 వేలకు పైనే కేసులంటున్న నిపుణులు
  • గ్లోబల్​ హెల్త్​ ఎమర్జెన్సీ కాదన్న డబ్ల్యూహెచ్​వో

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్​ పాముల నుంచి పాకిందట. అది కూడా ఆ వైరస్​కు మూలమైన చైనా సిటీ వుహాన్​ నుంచే మనుషుల్లోకి వచ్చిందట. చైనాలోని పెకింగ్​ యూనివర్సిటీ ఆఫ్​ హెల్త్​ సైన్స్​ సెంటర్​ స్టడీలో ఈ విషయం వెల్లడైంది. ‘‘వుహాన్​లోని మార్కెట్లలో చేపలు, పందులతో పాటు పాములను కూడా అమ్ముతారు. వాటిని జనం తినడం వల్లే వైరస్​ పాకింది’’ అని యూనివర్సిటీ రీసెర్చర్​ వీ జి చెప్పారు. కొత్త కరోనా వైరస్​ జీన్స్​ను పాత కరోనావైరస్​ జీన్స్​తో పోల్చి చూసిన సైంటిస్టులు ఈ నిర్ధారణకు వచ్చారు. ఆ వైరస్​ ఉండే భౌగోళిక ప్రాంతాలు, వాటికి హోస్టులుగా ఉండే జంతువులను పరీక్షించారు. గబ్బిలాల్లో ఉండే కరోనావైరస్​ జీన్స్​ కాంబినేషన్​తో ఈ కొత్త కరోనా పుట్టుకొచ్చిందని తేల్చారు. అంతేగాకుండా పాముల్లోని జీన్స్​తోనూ వాటిని పోల్చి చూసి, పాముల నుంచి వచ్చి ఉంటుందని చెబుతున్నారు. మనుషులకు సోకడానికి ముందు పాముల్లోనే ఎక్కువగా ఆ వైరస్​ ఉండి ఉంటుందని అనుమానిస్తున్నారు. ‘‘అన్ని ఫలితాలను పరిశీలించాక పాముల వల్లే ఈ కొత్త కరోనా వైరస్​ సోకి ఉంటుందని భావిస్తున్నాం’’ అని తమ రిపోర్టులో సైంటిస్టులు పేర్కొన్నారు. బీజింగ్​లోని చైనీస్​ అకాడమీ ఆఫ్​ సైన్సెస్​ చేసిన స్టడీలోనూ ఈ విషయమే వెల్లడైంది. కొత్త కరోనా వైరస్​కు పాములు, గబ్బిలాలే కారణమని ఆ స్టడీ తేల్చింది. అయితే, పాములు లేదా గబ్బిలాల నుంచి ఆ వైరస్​ మనుషులకు ఎలా సోకిందో మాత్రం రెండు స్టడీలూ తేల్చలేదు. నిపుణులు మాత్రం వుహాన్​ సిటీలో చాలా మంది పాము మాంసం తింటారని, వాటిని తినడం వల్లే వైరస్​ సోకి ఉంటుందని చెబుతున్నారు.

10 వేలకుపైనే కేసులు

జపాన్​, తైవాన్​, అమెరికా, హాంకాంగ్​, బ్రిటన్​, ఆస్ట్రేలియాకు పాకిన కొత్త వైరస్​, ఇప్పుడు మెక్సికో, కొలంబియాలకూ పాకింది. అక్కడ ఒక్కో వ్యక్తికి ఆ వైరస్​ సోకినట్టు గుర్తించారు. ఇక, వైరస్​ వల్ల ఇప్పటికే 17 మంది చనిపోయారు. 571 మంది దాకా దాని బారిన పడ్డారు. అయితే, వైద్యాధికారులు మాత్రం కేసులు పది వేలకు పైనే ఉంటాయని భావిస్తున్నారు. అంతేగాకుండా హెచ్​ఐవీ లాగానే ఈ కొత్త కరోనా వైరస్​కూ తన రూపాన్ని మార్చుకునే శక్తి ఉన్నట్టు అనుమానిస్తున్నారు.

ఇంటర్నేషనల్​ ఎమర్జెన్సీ కాదు

వైరస్​పై ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులతో సమావేశాలు నిర్వహిస్తోంది. గ్లోబల్​ ఎమర్జెన్సీగా ప్రకటించాలన్న అధికారుల వాదనను డబ్ల్యూహెచ్​వో కొట్టి పారేసింది. ‘‘ఇప్పటికిప్పుడు దీనిని గ్లోబల్​ హెల్త్​ ఎమర్జెన్సీగా ప్రకటించలేం. దానిపై మరింత సమాచారం కావాలి. దీనిపై ఎమర్జెన్సీ కమిటీ మరోసారి సమావేశమై డిసైడ్​ చేస్తే బాగుంటుంది’’ అని డబ్ల్యూహెచ్​వో చీఫ్​ టెడ్రోస్​ అధనోం ఘెబ్రియెసస్​ అన్నారు. చైనా తీసుకుంటున్న చర్యలతో వైరస్​ వ్యాప్తి చెందడం తగ్గుతుందన్నారు. వైరస్​ వ్యాప్తిని అడ్డుకునేందుకు చైనా గట్టి చర్యలే తీసుకుంటోందన్నారు. ఇక, వుహాన్​ నుంచి వచ్చిన ప్రజల కోసం స్పెషల్​గా క్వారెంటైన్​ జోన్లను ఏర్పాటు చేసింది.

వైరస్​కు వ్యాక్సిన్​!

కరోనా వైరస్​కు వ్యాక్సిన్​ను కనిపెట్టే పనిలో ఉన్నారు అమెరికా సైంటిస్టులు. బేలర్​ కాలేజ్​ ఆఫ్​ మెడిసిన్​కు చెందిన ట్రాపికల్​ మెడిసిన్​ రీసెర్చర్లు వ్యాక్సిన్​పై రీసెర్చ్​ చేస్తున్నారు. అయితే, ఇప్పుడప్పుడే వ్యాక్సిన్​ అందుబాటులోకి రాదని, మరో ఆరేళ్లయినా పడుతుందని ట్రాపికల్​ మెడిసిన్​ విభాగం డీన్​ డాక్టర్​ పీటర్​ హోటెజ్​ చెప్పారు. కరోనావైరస్​ సోకిన 2000వ సంవత్సరం నుంచే వ్యాక్సిన్​పై పరిశోధనలు మొదలయ్యాయని, వైరస్​ తీవ్రత తగ్గగానే ఇన్వెస్టర్లు వెనకడుగు వేశారని అన్నారు. ఇప్పుడు మళ్లీ కొత్త రకం వైరస్​ పుట్టుకురావడంతో రీసెర్చ్​ చేస్తున్నారని వివరించారు.

వుహాన్​లో సర్వం బంద్​

వైరస్​కు మూలకారణమైన వుహాన్​ సిటీకి రాకపోకలను చైనా బంద్​పెట్టింది. కోటి మందికిపైగా ఉండే వుహాన్​ నుంచి వేరే సిటీలు, దేశాలకు వెళ్లే ఫ్లైట్లు, వేరే సిటీల నుంచి అక్కడకు వచ్చే విమానాలన్నింటినీ రద్దు చేసేసింది. రైళ్లు, బస్సులనూ ఆపేసింది. దీంతో చివరి ఫ్లైట్​, చివరి ట్రైన్​ను అందుకునేందుకు ప్రయాణికులు అవస్థలు పడ్డారు. అన్నీ మూత పడ్డాక రైల్వేస్టేషన్లు, ఎయిర్​పోర్టులు ప్రయాణికులు లేక వెలవెలబోయాయి. ఇటు 70 లక్షల మంది దాకా ఉండే హువాంగాంగ్​ సిటీకీ రాకపోకలను చైనా ప్రభుత్వం బంద్​ చేసింది. ఆయా సిటీల నుంచి వైరస్​లు వేరే ప్రాంతాలకు వ్యాపించకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు. అంతేగాకుండా కేఫెలు, సినిమా థియేటర్లు, ఎగ్జిబిషన్​ సెంటర్లు, షాపింగ్​ మాళ్లన్నింటినీ మూసేశారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఏడుపు తప్ప ఇంకేం లేదని అక్కడి జనాలు వాపోతున్నారు. వైరస్​ నుంచి కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. హువాంగాంగ్​కు అతి దగ్గరలోనే ఉండే ఈజౌ సిటీలోనూ రైళ్లను ఆపేశారు. వైరస్​ నేపథ్యంలో చైనాలో సర్జికల్​ మాస్కులు, గ్లోవ్స్​కు డిమాండ్​ బాగా పెరిగింది. డిమాండ్​ పెరగడంతో కొన్ని చోట్ల వ్యాపారులు రేట్లు భారీగా పెంచేసి అమ్ముతున్నారు. రేట్లు పెంచితే  కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

New coronavirus may have 'jumped' to humans from snakes, study finds

Latest Updates