ఇక 12 బోగీల ఎంఎంటిఎస్ రైళ్లు

New MMTS trains to be operated from today
  • నేటి నుంచి అందుబాటులోకి తేనున్న రైల్వే అధికారులు
  • ప్రయాణికుల భద్రతపై దృష్టి పెట్టా లన్న జీఎం గజానన్ మల్యా

ఎంఎంటీఎస్ ప్రయాణికులకు శుభవార్త. ఇప్పటి వరకు 9 బోగీలు ఉన్న ఎంఎంటీఎస్​రైళ్లు నేటి నుంచి 12 బోగీలుగా  దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తుంది. ప్రస్తుతం ఉన్న ప్రతి ఎంఎంటీఎస్ రైలుకు అదనంగా 3 బోగీలను జత చేసింది. దీంతో ప్రయాణికులకు మరింత మేలు జరగనుంది. దాదాపు దశాబ్ద కాలానికి పైగా ఎంఎంటీఎస్  రైళ్లలో రద్దీ అధికంగా ఉంటోంది. ఎంఎంటీఎస్ ను వినియోగించే వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. ఇందుకు తగిన విధంగా రైళ్ల సంఖ్య పెరగకపోవడంతో ఎంఎంటీఎస్ లలోనే కిక్కిరిసి ప్రయాణించే పరిస్థితి ఉంది. ఈ సమస్య గుర్తించిన దక్షిణ మధ్య రైల్వే అధికారులు బోగీల సంఖ్య పెంచడమే ఇందుకు సరైన పరిష్కారమని భావించి ఆ దిశగా చర్యలు తీసుకున్నారు.

ప్రస్తుతం  సికింద్రాబాద్–నాంపల్లి, సికింద్రాబాద్–ఫలక్ నుమా, సికింద్రాబాద్– లింగంపల్లి మార్గాల్లో మొత్తం 121 ఎంఎంటీఎస్ సర్వీసులు రోజు  రాకపోకలు సాగిస్తున్నాయి. వీటి ద్వారా లక్షా 80 వేల మంది ప్రయాణం చేస్తున్నారు. కొత్తగా  జత చేస్తున్న బోగీలతో మరో 50 వేల మంది రోజు అదనంగా ప్రయాణించే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎంఎంటీఎస్ రైళ్లలో టికెట్​ధర తక్కువ ఉండడంతో పాటు పొల్యూషన్ ఫ్రీ గా ఉన్న కారణంగా ఇటీవల కాలంలో ఎంఎంటీఎస్ లో ప్రయాణించే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి రూట్లో వెళ్లే ఎంఎంటీఎస్ రైళ్లలో రద్దీ అధికంగా ఉంటోంది. ఈ వైపు హైటెక్ సిటితో పాటు పలు ప్రైవేట్ ఆఫీస్​లు ఉండడంతో కొత్తగా జత చేసిన బోగీలు ఈ రూట్ లో వెళ్లే ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడతాయని రైల్వే అధికారులు భావిస్తున్నారు.

టైం, సెక్యూరిటీపై దృష్టి పెట్టండి

దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా

ఎంఎంటీఎస్ కు అదనంగా జత చేసిన బోగీలకు అనుగుణంగా ఫ్లాట్ ఫాం పొడుగు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఎంఎంటీఎస్ రైళ్లు నిలిచే స్టేషన్లలో ఇప్పటికే రైల్వే అధికారులు అధ్యయనం చేశారు. పలు స్టేషనల్లో ప్లాట్ ఫాం ల పొడవు పెంచారు. ఎంఎంటీఎస్ రైళ్లు -కచ్చితమైన సమయపాలన పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైలు నిలయంలో డిఆర్ఎంలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ఎంఎంటీఎస్ రైళ్ల ప్రస్తావన తీసుకువచ్చారు. ఇవాళ్టి నుంచి 12 బోగీల ఎంఎంటీఎస్ లు అందుబాటులోకి వస్తుండటంతో సమయపాలన, ప్రయాణికుల భద్రతపై దృష్టి పెట్టాలని కోరారు. ఎంఎంటీఎస్ ప్రయాణికుల అభిప్రాయాలు తీసుకునే విధంగా ప్రత్యేకంగా అధికారులను నియమించాలని కోరారు. ప్రయాణికుల అనుభవాలు, క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయాలని  హైదరాబాద్, సికింద్రాబాద్ డీఆర్ఎం ప్రత్యేకంగా సూచించారు.  ఎంఎంటీఎస్ ల సమయపాలన కు ఆటంకం కలిగించే ఓవర్ హెడ్ ఎక్విప్ మెంట్ నిర్వహణ, సిగ్నలింగ్ పరికరాలు, పట్టాల నిర్వహణ నిబంధనలపై ప్రత్యేకంగా చర్చించారు.

 

Latest Updates