ఆన్ లైన్ క్లాసులతో కొత్త సమస్యలు

ఇంటి చదువు మెదడుకి బరువు

లాక్ డౌన్ 1.0  స్టార్ట్ అయినప్పటి నుంచి స్టూడెంట్స్  మూవ్ మెంట్ రిస్ర్టిక్ట్ అయింది. ఇంటి పట్టునే ఉండాలె, ఇంట్లోనే చదవాలె. ఎటూ పోకుండా, ఎవరినీ కలవకుండా ఇంట్లోనే వంద రోజుల నుంచి ఉంటున్నరు. ఫ్రెండ్షిప్ లేదు, సరదా మాటలు లేవు. ఆటలు అసలే లేవు. లైఫ్ అంతా బోర్. ఆన్లైన్ క్లాసులు, చదువులతో పేరెంట్స్ ఒత్తిడి పెంచుతున్నారు. కరోనా భయం, ఫ్యూచర్ ఎలా ఉంటుందోనన్న ఆందోళనతో పిల్లలు నలిగిపోతున్నరు. ఆ చికాకుల్లోంచి మనసును బయట పడేయకపోతే అనుకున్న గోల్ సాధించలేరు. పేరెంట్స్ కలలు పండించలేరు.

లాక్డౌన్ 1.0  వల్ల స్టూడెంట్స్ క్లాస్ రూమ్ కు దూరమయ్యారు. అది చదువులకే కాదు, స్నేహాలు, ఆట పాటలు, కలలు, కబుర్లు, నవ్వులు.. అన్నీ దొరికే ప్రపంచం అది. వాటన్నింటికీ ఆపోజిట్ గా తోస్తుంది ఇల్లు. పిల్లలు ఒంటరిగా ఉంటున్నారు. ఎక్కడికైనా పోవాలంటే కరోనా భయం. లేదా పేరెంట్స్ తిడతారని భయం. ఏది పట్టుకోవాలన్నా, ఎవరితో మాట్లాడాలన్నా కరోనా సోకుతుందేమోనని భయం. ఇన్ని భయాల మధ్య నాలుగు గోడలకే పరిమితమై ఉంటేనే బెటరని పిల్లలు కూడా అనుకుంటున్నారు.

భయం.. భయం.. భయం

పిల్లలకు ఎన్నో భయాలు అనుభవంలోకి తెచ్చింది కరోనా.. అర్థం కాని సమస్య ఒత్తిడి. అంత తొందరగా బయటపడదు. బయటపడేలోగానే దాన్నుంచి బయటపడలేనంత నష్టం జరిగిపోతుంది. పిల్లల ఆరోగ్యం కోసం మంచి వంటలు వండినట్లే పిల్లల ఆనందం కోసం పేరెంట్స్ ఏదో ఒకటి చేయాల్సిందే.

కొత్త చదువుతో కోటి చిక్కులు

లేవు లేవంటూనే ఆన్ లైన్ క్లాసులు స్టార్ట్ అయ్యాయి. క్లోజ్ ఫ్రెండ్స్ దూరమయ్యారు. ఇప్పుడు వాళ్లను పలకరించాలంటే మొబైల్ ఒక్కటే. ఆ మొబైల్ వాడకంలోనూ రిస్ర్టిక్షన్స్. పిల్లలు ఫోన్ ఎక్కువసేపు వాడటానికి పేరెంట్స్ అనుమతించరు. ఒకవేళ ఒప్పుకున్నా వాళ్లేది మాట్లాడినా ఇంట్లో వాళ్లకు వినబడుతుందని పిల్లలు చాలా మాటల్ని స్నేహితులతో పంచుకోరు. మనసులోనే పెట్టుకుంటారు. ఇంట్లో వాళ్లు ఏమనుకుంటారో అని చెప్పకుండా దాచుకుంటే మనసులో ఇంకా  బరువు పెరుగుతుంది. కొంతకాలం ఆ బరువును దాస్తే అది బాధపెడుతుంది. చిన్న ఇంట్లో ఉండే పిల్లలకు ఈ సమస్య మరీ ఎక్కువ. ఇంట్లో ఉన్నప్పుడు సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు. ఈ పరిస్థితులు వాళ్ల మనసుని చికాకు పరుస్తాయి.

అమ్మో ఆన్ లైన్

ఆన్ లైన్ ఎడ్యుకేషన్ అవసరమే. కానీ, ఈ పద్ధతిలో స్టూడెంట్స్  ఎక్కువగా ఒత్తిడి ఉంటుంది. క్లాస్‌‌లో ఉన్నప్పుడు ఫ్రీడమ్ ఉంటుంది. ఆన్ లైన్  క్లాస్ లో మొబైల్ లేదా కంప్యూటర్ మీద ఫోకస్ చేయాలి. అనుకూల వాతావరణం లేనప్పుడు చదువు మీదే ఆసక్తి ఉండదు. ఆన్ లైన్ క్లాస్ అలవాటు కానేలేదు. ఇప్పుడే అన్ని సబ్జెక్టులు చెబుతున్నారు. టెస్టులు కండక్ట్ చేస్తున్నారు. ఒక్కసారిగా.. ఎక్కువ టైమ్  స్క్రీన్ మీద దృష్లి పెట్టడం వల్ల కళ్లనొప్పి, మెడనొప్పిబ్యాక్ పెయిన్స్‌‌  వస్తాయి. ప్రతి చప్పుడు డిస్టర్బ్ చేస్తుంది. డౌట్ వస్తే అడగడంలో ఇబ్బంది ఉంటుంది. ఆడియో వస్తే వీడియో రాదు, వీడియో వస్తే ఆడియో రాదు. రెండూ వస్తే ఇంటర్నెట్ స్లోగా ఉంటుంది. డౌట్ వస్తే ఎలా అడగాలనే సందేహం వస్తుంది. ఓ ఆలోచన వచ్చేలోగా క్లాస్ టైమ్ అయిపోతుంది. డౌట్ తీరకుండానే మిగిలిపోతుంది. కానీ చదవాలనే ఒత్తిడి, టెస్టులు మాత్రం వెంటాడుతూనే ఉంటాయి. ఎక్కువ టైమ్ స్ర్కీన్ మీద దృష్టి పెడితే, చదువుపై ఆసక్తి పోతుంది. స్టూడెంట్స్పై ఒత్తిడి పెరుగుతుంది. తర్వాత యాంగ్జయిటీ, డిప్రెషన్లోకి పోతారు.

హ్యాపీగా ఉంచాలి

క్లాస్ రూమ్ కి, ఫ్రెండ్స్ కి దూరం కావడం వల్ల స్టూడెంట్‌‌ లైఫ్.. మొనాటనస్‌‌గా.. అంటే సంతోషం, ఫన్ లేకపోవడం వల్ల ఫ్యూచర్ మీద ఆసక్తి లేక, ఏ ఆలోచనా లేకుండా మనసు నిస్సారంగా మారిపోతుంది. లోన్లీనెస్ ఫీలింగ్ వాళ్లలో రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇంటిపట్టున ఉండి ఇప్పటికే 100 రోజులైంది. క్లాసులో ఉన్నప్పుడు పాఠాలతో పాటు  సంతోషం, ఆలోచనలు పంచుకోవడం, ఆటలు కూడా ఉంటాయి.   ఇప్పుడివన్నీ మిస్ అవుతున్నారు. ఒకేసారి ఇన్ని కోల్పోవడం, ఇంట్లో మరో ఆల్టర్నేట్ లేకపోవడంతో పిల్లలు మానసికంగా కుంగిపోతున్నారు. ఉత్సాహం లేనప్పుడు నేర్చుకోవడం కష్టంగా ఉంటుంది. వాళ్లను పేరెంట్స్ పట్టించుకుని ముచ్చటిస్తూ, ఆడిస్తూ ఉత్సాహపరచాలి. పిల్లల్లో యాంగ్జయిటీని తగ్గించేందుకు వాళ్లను ఇంటి పనుల్లో దించాలని సైకాలజిస్టులు చెప్పింది పాటిస్తున్నారు. కానీ, బలవంతంగా పని చేయించడం వల్ల యాంగ్జయిటీ పెరుగుతోంది. కరోనా భయంతో పని మనుషులను వద్దనడంతో పని భారాన్ని పిల్లలపై కూడా మోపుతున్నారు. ఐసోలేటడ్ లైఫ్ లో వాళ్లకు హ్యాపీనెస్ పూర్తిగా దూరమవుతోంది. సమస్య తీవ్రంగా మారకముందే పేరెంట్స్ తప్పకుండా వాళ్లకు సమయం కేటాయించడం, మాట్లాడటం, వాళ్లతో సరదాగా గడపడం, ఇంట్లోనే చిన్న చిన్న ఆటలాడించడం చేయాలి. ఫ్రెండ్స్ తో మాట్లాడటానికి ఫోన్ ఇవ్వడంతోపాటు ప్రైవసీ కూడా కల్పించాలి.

-నాగవర్ధన్ రాయల

అమ్మానాన్నలే అన్నీ మార్చాలి

లాక్ డౌన్ ఎఫెక్ట్ తో  అన్ని ఇళ్లలో ఆర్థిక సమస్యలు పెరుగుతున్నాయి. డబ్బులు, ఉద్యోగాల విషయంలో రేపు ఏమిటో తెలియని పరిస్థితి ఉంది. పేరెంట్స్ భయం పిల్లల్ని ఆందోళనలో పడేస్తోది. ఆఫీస్ నుంచి వచ్చిన పేరెంట్స్ స్నానం, శానిటైజ్ అయ్యేంత వరకు పిల్లల్ని దగ్గరకు తీసుకోరు. ఇలా దూరంగా పెట్టడం వాళ్లను ఇబ్బంది పెడుతుంది.  దగ్గు, గొంతులో నొప్పి, తుమ్ములు వస్తే విపరీతమైన ఆందోళనకు గురవుతున్నారు. పేరెంట్స్ ఆందోళన పిల్లల్ని ఇబ్బంది పెడుతోంది. ఇంట్లో ఎక్కువసేపు కలిసి ఉండటం వల్ల పేరెంట్స్ తో ఎప్పుడో జరిగిన విషయాలు తప్పనిసరిగా మాట్లాడాల్సి రావడం వల్ల చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి. ఇది ఒక తప్పనిసరి పరిస్థితి. ఉన్న పరిస్థితులను అర్థం చేసుకుని, తల్లిదండ్రులు పిల్లలకు ఉన్న ఇబ్బందుల్ని సానుకూల వాతావరణంలో చర్చించాలి. ఫ్యామిలీ స్తోమత గురించి వాళ్లకు అర్థం అయ్యేలా చెప్పగలిగితే చాలా వరకు ఒత్తిడిని అధిగమిస్తారు.

– సీ వీరేందర్, సైకాలజిస్ట్

నిద్రలో ఆన్లైన్ క్లాస్!

సతీష్ కి ఆన్ లైన్ క్లాసులు స్టార్ట్ అయ్యాయి. పదో తరగతిలో 10 జీపీఏ తెచ్చుకోవాలని టార్గెట్ పెట్టుకున్నడు. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే దాక ఒకటే చదువు. అది తప్ప వేరే పని లేదు. ఆలోచనా లేదు. ఒక్కోసారి నిద్రపోకుండా నోట్స్ రాస్తూనే ఉన్నాడు. నిద్రలో పాఠాల గురించే కలవరిస్తున్నాడు. ఆన్ లైన్ లో చెప్పిన పాఠం, చెప్పని పాఠం అన్నీ తిరగేస్తున్నడు. వీనికి ఏదో అయిందని పేరెంట్స్ గాబరపడ్డారు. ఫ్యూచర్ని ఎలాగైనా అనుకున్నట్టు మార్చుకోవాలనే ఆలోచన యాంగ్జయిటీ కలిగించింది.  యాంటీ యాంగ్జయిటీ మెడిసిన్ ఇచ్చి, బ్రెయిన్ ఎక్సర్సైజ్, రిలాక్సేషన్ థెరపీతో దారికి తెచ్చే పనిపెట్టుకున్నారు ఇప్పుడు పేరెంట్స్.

చదువు వద్దంటున్న క్లవర్..

టెన్త్ క్లాస్ లో స్వాతికి 10 జీపీఏ వచ్చాయి. తను చాలా క్లవర్ స్టూడెంట్. ఎందుకో మరి! స్టడీస్ మీద ఆసక్తి లేదంటున్నది. ఇంటర్మీడియట్ క్లాసులు ఆన్ లైన్ లో స్టార్ట్ అయ్యాయి. క్లాసులు వినదు. చదవదు. ‘చిన్నప్పటి నుంచి బాగా చదివాను. టెన్త్ లో అందరికీ నాతో సమానంగా పాయింట్స్ వచ్చాయి. చదవని వాళ్లకు కూడా నాతో సమానంగా స్కోర్ వచ్చింది. ఇక ఎందుకు చదవాలి? ఎగ్జామ్స్ కు ముందు పుస్తకాలు తిరగేస్తే చాలు. కష్టపడి చదవడం దండగ. ఇంటర్ ఎగ్జామ్స్ కు కూడా కరోనా అడ్డొస్తుంది. అందర్నీ పాస్ చేస్తారు’ అని పేరెంట్స్ తో అంటున్నది. ఇన్నేళ్లు ఫ్రెండ్స్ తో కాకుండా పుస్తకాలతో ఉన్నా. ఇప్పుడన్నా పుస్తకాలు వదిలేసి కాస్త ఫ్రెండ్స్ తో గడిపేస్తాను అంటోంది. దీనంతటికి కారణం ఒత్తిడి. ఒత్తిడి.. ఈ మూడు నెలల్లో స్వాతి మైండ్‌‌ని గందరగోళంలోకి నెట్టింది.

ఫ్రెండ్స్ లేకపోతే..

కుటుంబంలో ఉన్న ఒత్తిడిని స్నేహితులతో చెప్పుకోవడం వల్ల పిల్లలకు రిలీఫ్ ఉంటుంది.  స్కూల్‌‌కు వెళ్తే.. అక్కడ ఆలోచనల్ని పంచుకోవడం, నేర్చుకోవడం.. ఇవన్నీ ఉంటాయి.కానీ ఇప్పుడు ఐసోలేటెడ్ గా ఉండడం వల్ల అలాంటి అనుభవాలను మిస్ కావడం, రోజంతా పూర్తిగా ఇంట్లోనే ఉండటం, ఒకే రకమైన పరిసరాలు, ఒకేరకమైన మాటలు, తల్లిదండ్రులు నుంచి ఒత్తిళ్లు… ఇవన్నీ పిల్లలపైన అపరిమితమైన ఒత్తిడి కలగజేస్తాయి. జీవితం పట్ల ఆసక్తి లేకుండా చేస్తాయి.

కాలేజీ లేక.. ప్రియురాల రాక..

గౌతమ్ ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. ఒకమ్మాయి ప్రేమలో ఉన్నాడు. సడెన్ గా కాలేజీ బంద్ కావడం, హాస్టల్ మూతపడడంతో ఆ అమ్మాయి వాళ్ల ఊరికి పోయింది. ఇంట్లో ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడినా.. ఎవరు? ఏమిటని అడుగుతారు. అందుకే ఆమె మాటలు బంద్ చేసింది. కానీ అబ్బాయిలో మాత్రం యాంగ్జయిటీ పెరిగిపోయింది. ఆన్ లైన్ లో  క్లాసులు వినడం లేదు, ఇంట్లో చదవడమే లేదు. ఇంట్లో వాళ్లమీద ఊరికే కోపం పెంచుకోవడం, అరవడం చేస్తున్నాడు. సామాన్లు విసిరేస్తున్నాడు. తట్టుకోలేక సైక్రియాటిస్టు వద్దకు కౌన్సెలింగ్ తీసుకుపోతే.. అసలు సంగతి ఇంట్లో ఉండటం కాదు, తన గర్ల్ ఫ్రెండ్ మాటలకు దూరం కావడమని అర్థమైంది. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ చేస్తే మళ్లీ దారికొచ్చిండు.

భయంకరమైన శుభ్రత..

నరేంద్ర సెకండ్ ఇంటర్ చదువుతున్నడు. కరోనా వైరస్ గురించి అందరూ తెలుసుకున్నట్లే ఆయనా తెలుసుకున్నడు. కానీ, అందరి కంటే ఎక్కువ జాగ్రత్తగా ఉంటున్నడు. అందరూ గంటకోసారి, ఏదైనా ముట్టుకుంటే చేతులు సబ్బుతో కడుక్కుంటున్నరు. నరేంద్ర మాత్రం పది నిమిషాలకోసారి చేతులు కడుగుతనే ఉన్నాడు. ఆ అతి శుభ్రత చూసి వైరస్ భయంతో అట్ల చేస్తున్నాడని అనుకున్నరు. తను అన్నం తినాలంటే వడ్డించే వాళ్ల చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కుంటే సరిపోదు. టేబుల్, కుర్చీ కూడా శానిటైజ్ చేయాలి. రోజంతా ఈ శానిటైజేషన్ కే సరిపోతుంది. ఇక ఆన్ లైన్  క్లాసులు వినే తీరికే లేదు. ఈ భయం పోగొట్టాలని సైక్రియాటిస్టు వద్దకు కౌన్సెలింగ్ కు తీసుకపోతే అసలు సంగతి తెలిసింది. ఆ అబ్బాయికి అప్పటికే మైల్డ్ లెవెల్లో డిప్రెషన్ ఉంది. దాని వల్లనే ఇదంతా చేస్తున్నడని. వైరస్ ప్రభావంతో అతనిలో ఓసీడీ బాగా పెరిగిపోయింది.

 

Latest Updates