మే 1 నుంచి మారిన ఈ రూల్స్‌ మీకు తెలుసా?

  • రైళ్లు, ఎయిర్‌‌లైన్స్‌, బ్యాంకుల్లో మార్పులు

న్యూఢిల్లీ: దేశంలోని బ్యాంకులు, ఏటీఎంలు, రైల్వే, ఎయిర్‌‌లైన్స్‌లో మే 1 నుంచి కొన్ని రూల్స్‌ మారనున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా రైళ్లు, విమానాలు నడవనప్పటికీ రూల్స్‌ని మాత్రం ఇంప్లిమెంట్‌ చేస్తామని అధికారులు చెప్పారు.

ఎస్‌బీఐ సేవింగ్స్‌ అకౌంట్స్‌పై కొత్త వడ్డీ రేటు

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సేవింగ్స్‌ డిపాజిటర్లకు షాక్‌ ఇచ్చింది. సేవింగ్స్‌ అకౌంట్స్‌పై చెల్లించే ఇంట్రస్ట్‌ రేట్లను తగ్గించింది. లక్షకుపైగా బ్యాలెన్స్‌ ఉన్న వారికి 3.25 శాతం, లక్ష వరకు బ్యాలెన్స్‌ ఉన్న వారికి 3.50శాతం మాత్రమే చెల్లిస్తున్నట్లు ప్రకటించింది. ఇది రెపో రేటు కంటే చాలా తక్కువ. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రెపో రేట్‌ తగ్గించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చెప్పిన రూల్స్‌ ప్రకారం ఇంట్రస్ట్‌ తగ్గించిన మొదటి బ్యాంక్‌ ఎస్‌బీఐ. మే 1 నుంచి ఈ రూల్స్‌ అమల్లోకి రానున్నాయి.

పీఎన్‌బీ కిట్టీ వాలెట్‌ బంద్‌

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ తమకు సంబంధించిన డిజిట్‌ వాలెట్‌ పీఎన్‌బీ కిట్టీ సేవలు బంద్‌ చేసింది. దాంట్లో ఉన్న అమౌంట్‌ను ఐఎంపీఎస్‌ ద్వారా వేరే బ్యాంక్‌ అకౌంట్‌కు పంపించుకోవాలని కస్టమర్లను కోరింది. కస్టమర్‌‌ తన ఫోన్‌ నంబర్‌‌ను మార్చుకోవాలనుకుంటే వాలెట్‌ జీరో చేస్తేనే మార్చేలా కొత్త రూల్‌ తెచ్చింది.

రోజుకు రెండుసార్లు ఏటీఎంలు సాఫ్‌

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో దేశంలోని అన్ని ఏటీఎంలను రోజుకు రెండు సార్లు క్లీన్‌ చేస్తారు. ఇప్పటికే చెన్నై, ఘజియాబాద్‌లో ఆ సిస్టం ప్రవేశపెట్టగా ఇక నుంచి దేశంలోని అన్ని ఏటీఎంలు శానిటైజ్‌ చేస్తారని, అలా చేయని ఏటీఎంలను సీజ్‌ చేస్తామని అధికారులు చెప్పారు.

రైల్వేలోనూ మార్పులు

మే 1 నుంచి అమలయ్యే కొత్త రూల్‌ ప్రకారం రిజర్వేషన్‌ చార్ట్‌ తయారయ్యే కంటే నాలుగు గంటల ముందు ప్యాసింజర్‌‌ తన బోర్డింగ్‌ స్టేషన్‌ను మార్చుకోవచ్చు. అయితే ప్యాసింజర్‌‌ బోర్డింగ్‌ పాయింట్‌ మార్చుకున్న తర్వాత టికెట్‌ క్యాన్సిల్‌ చేసుకుంటే డబ్బులు రిఫండ్‌ రాదు. గతంలో 24 గంటల ముందు వరకే ఈ సదుపాయం ఉండేది.

ఎయిర్‌‌ఇండియాలో నో క్యాన్సిలేషన్‌ చార్జ్‌

ఎయిర్‌‌ ఇండియాలో ఇక నుంచి ప్యాసింజర్లు బుక్‌ చేసుకున్న టికెట్లను క్యాన్సిల్‌ చేసుకుంటే ఎలాంటి క్యాన్సిలేషన్‌ చార్జీలు విధించదు. టికెట్‌ బుక్‌ చేసుకున్న 24 గంటల్లోపు మాత్రమే ఇది వర్తిస్తుంది.

Latest Updates