ఆర్టీసీలో కొత్త స్కీం.. ఎంప్లాయ్ నేస్తం

 

 

కార్గోపార్సిల్కొరియర్ సర్వీసులువిస్తరించే ప్లాన్
బుకింగ్ చేస్తే డ్రైవర్లు, కండక్టర్లకు 15శాతం వరకు కమీషన్

హైదరాబాద్, వెలుగు: ఎంప్లాయ్ నేస్తం అనే కొత్త స్కీంను టీఎస్‌‌‌‌ఆర్టీసీ అమల్లోకి తీసుకొచ్చింది. కార్గో, పార్సిల్, కొరియర్ సర్వీసులను విస్తరించాలని, డ్రైవర్లు, కండక్టర్లను ప్రోత్సహించాలని నిర్ణయించింది. డ్రైవర్లు, కండక్టర్లు తమ విధులను నిర్వహిస్తూనే బుకింగ్ ఏజెంట్‌‌గా పనిచేసే వెసులుబాటు కల్పించింది. పార్సిల్స్, కొరియర్స్‌‌ను బుకింగ్ సెంటర్ నుంచి కస్టమర్లకు, కస్టమర్ల నుంచి బుకింగ్ సెంటర్ కు చేర్చేలా కొత్త విధానం తెచ్చింది. దీని ద్వారా పికప్ అండ్ డ్రాప్ చార్జీ వసూలు చేసుకునే అవకాశం ఉంది. బుకింగ్ చేయిస్తే స్పెషల్ కమీషన్ కూడా ఇవ్వనుంది.

ఆర్టీసీ నేస్తం తరహాలోనే..

గతంలో ఆర్టీసీ నేస్తం పేరుతో ఓ స్కీం నడిపించేవారు. దీని ద్వారా డ్రైవర్లు, కండక్టర్లకు కమీషన్ ఇచ్చేవారు. బస్సులను ఫంక్షన్లకు హైర్ ఇప్పించడం, క్యాట్ కార్డ్లాంటి బస్ పాస్ కార్డులను ఇప్పించడం తదితర పనులు చేయించేవారు. ఇటీవల కార్గో, పార్సిల్, కొరియర్ సర్వీసులను ప్రారంభించిన ఆర్టీసీ.. రాష్ట్రంలో 148 బుకింగ్ సెంటర్లను ఏర్పాటు చేసింది. డ్రైవర్లు, కండక్టర్ల సేవలను దీనికి వాడుకోవాలని నిర్ణయించింది. వీరు ముందు ఏజెంట్ గా ఎన్రోల్ చేసుకోవాలి. ఎలాంటి అడ్వాన్స్ చెల్లించాల్సిన పనిలేదు.

400 ప్రైవేట్ ఏజెన్సీలు..

సర్వీసుల విస్తరణలో ప్రైవేట్ ఏజెన్సీల సేవలు వాడుకోవాలని ఆర్టీసీ భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 148 బుకింగ్ సెంటర్లు ఉన్నాయి. ప్రధాన సెంటర్లలోనే ఈ సెంటర్లు ఉన్నాయి. ఒక్కో మండలానికి ఒక బుకింగ్ సెంటర్ ఉండేలా.. మరో 400 బుకింగ్ సెంటర్లు అందుబాటులోకి తీసుకురానున్నారు. వీటిని ప్రైవేట్ ఏజెంట్లతో నడిపించనున్నారు. అవసరం ఉన్న చోట ఏజెంట్ల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. బుకింగ్ సెంటర్లలో ఒక కంప్యూటర్, ప్రింటర్, కొద్ది మేర ఖాళీ ప్లేస్ ఉంటే ఏజెంట్ గా పర్మిషన్ ఇస్తారు. ఇందుకోసం రూ.20 వేల అడ్వాన్స్ పేమెంట్ చేయాలి. వీరు ఆర్డర్స్ రాగానే, దగ్గరలోని ఆర్టీసీ బుకింగ్ సెంటర్ కు వచ్చి పార్సిల్స్ అందిస్తారు. ఇందుకోసం ఆర్డర్ పై 15 శాతం కమీషన్ ఏజెంట్ కు ఇస్తారు.

అరకొర జీతాలకు ఆసరాగా..

ప్రస్తుతం ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు అరకొర జీతాలే ఉన్నాయి. సంస్థలో 70% వరకు రూ.25 వేలలోపు జీతగాళ్లే. కార్గో, పార్సిల్, కొరియర్ సర్వీస్ లో వీరు ఏజెంట్లుగా చేరడంతో వారికి కొన్ని డబ్బులు సంపాదించే చాన్స్‌ ఉంది. బుకింగ్‌కు 15 శాతం కమీషన్ ఇవ్వనున్నారు. డ్యూటీలకు వచ్చి, పోయేప్పుడు గూడ్స్ బుకింగ్ , కస్టమర్లను చేర్చడం ద్వారా చార్జీ ఇవ్వనున్నారు. చార్జీలను త్వరలో ప్రకటించనున్నారు.

 

 

Latest Updates