ఇజ్జత్ దార్ యూత్ : ఫుడ్, ఆన్ లైన్ డెలివరీల్లో యువకులు

ఫుడ్, ఆన్ లైన్ డెలివరీల్లో యువకులు

రాష్ట్రం లో 25 వేల మందికి ఇదే ఉపాధి

చదువుకుంటూనే కష్టపడి సంపాదన

తమ కాళ్లపై తాము నిలబడాలన్న తపన

డిగ్నిటీ ఆఫ్ లేబర్ చూపిస్తున్న కొత్త తరం

హైదరాబాద్, వెలుగు: మొబైల్ యాప్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తే… ఇంటి కొచ్చి ఇచ్చే వ్యక్తి ఓ యువకుడు. ఆన్ లైన్ లో మొబైల్ బుక్ చేస్తే డెలివరీ చేసే మనిషి మరో యువకుడు. రోడ్డు మీద పోతూ ఉంటే ఎటు చూసినా, ఎక్కడ చూసినా రకరకాల పెద్ద బ్యాగులను బైక్ వెనుక భుజాలకు తగిలించుకొని పోయే వందలమంది యువకులు కనిపిస్తారు . వీళ్లంతా ఎవరు? ఎక్కడివారు? ఎందుకీ  పనిచేస్తున్నారు. వారిని అడిగితే తెలుస్తుంది… ఇప్పటి యూత్ ఏం చేస్తోందో.. ఎలా ఆలోచిస్తోందో.

పట్నం వెళ్లాలి.. బాగా చదివి మంచి కొలువు సంపాందించాలి.. కుటుంబాన్ని పోషించాలి.. ఇదే లక్ష్యంతో లక్షలాదిమంది యువత నగరానికి వస్తోంది. వారిలో మిడిస్ క్లాస్, అంతకంటే తక్కువ స్థోమత ఉన్నవాళ్లే ఎక్కువ. వీళ్లంతా ఇంటి నుంచి వచ్చే డబ్బును జాగ్రత్తగా వాడుకుంటూ చదువుకోవడమో, మంచి ఉద్యోగం వెతుక్కోవడమో చేస్తుంటారు. ఇప్పటి యువతరంలో చాలామంది అలాగే చాలీచాలని డబ్బుతో అమ్మనాన్నలపై ఆధారపడి ఉండాలని అనుకోవడం లేదు. తమ అవసరాలు తామే తీర్చుకోవడానికి రకరకాల పార్ట్ టైం ఉద్యోగాలను వెతుక్కుంటున్నారు. అందులో వేగంగా విస్తరిస్తున్న ఫుడ్ డెలివరీ రంగం వారికి గొప్ప అవకాశంగా మారింది.

కొన్నేళ్లుగా ఆన్ లైన్ సేల్స్ డెలివరీ యువతకు ఉపాధి కల్పిస్తుంటే దానికి ఇప్పుడు ఫుడ్ డెలివరీ తోడైంది. స్విగ్గీ, జొమాటో, ఫుడ్ పాండా, ఉబెర్ ఈట్స్ లాంటి కార్పొరేట్ సంస్థలు భారీ ఆఫర్లతో జనాన్ని ఆకర్షిస్తున్నాయి. వినియోగం ఎక్కువగా ఉండడంతో ఫుడ్ డెలివరీలోనే ఎక్కువగా యువత కనిపిస్తున్నారు. డెలివరీ బోయ్ లుగా వేలాదిమంది యువత ఉపాధి పొందుతున్నారు. వీరిలో బీటెక్ లు, డిగ్రీలు చేసే విద్యార్థులు, చదువు పూర్తిచేసి కొలువుల వేటలో ఉన్న నిరుద్యోగులే ఎక్కువమంది ఉంటున్నారు. వీళ్లంతా రోజూ ప్రముఖ రెస్టారెంట్ల ముం దు రకరకాల యూనిఫాంలు వేసుకొని ఆర్డర్ల కోసం ఎదురుచూస్తూ కనిపిస్తుంటారు. వారిని కదిలిస్తే ఒక్కొక్కరిది ఒక్కో కథ. డిగ్నిటీ ఆఫ్ లేబర్ తెలిసి, ఆత్మవిశ్వాసంతో తమకు తాముగా ఎదగాలనుకునే వందలాది మంది యువత వారిలో ఉన్నారు. అమ్మనాన్నల కష్టాన్ని గుర్తించి, వారికి తమ వంతుగా అండగా ఉండాలని ఆలోచించే బాధ్యత తెలిసిన కొత్తతరం వారిలో ఉంది.

తిరిగేద్దాం.. పనిచేద్దాం

చదువుకునే వయసులో ఖాళీ టైంలో సరదాగా ఎంజాయ్ చేద్దామని ఈతరం అనుకోవట్లేదు. హాయిగా ఊరంతా చుడుతూ తమ సరదానే సంపాదనగా మార్చుకుంటోం ది. కాలం, అవసరాలు వారి ఆలోచనలో మార్పు తెస్తే కొత్త అవకాశాలు వారికి ఉత్సాహాన్నిస్తున్నాయి. ఫుడ్ డెలివరిని ఉపయోగించుకునే జనం బాగా పెరుగుతుండడం డెలివరీ బోయ్ లకు మంచి డిమాండ్ తెచ్చిపెట్టింది. కష్టాన్ని బట్టి సంపాదన పెంచుకునే అవకాశం ఉండడం మరింత మంది యువతను ఆకర్షిస్తోంది. దీంతో చదువుకుంటూ పార్ట్ టైంగా ఫుడ్ డెలివరీ బోయ్ లు గా మారిపోయేవారు పెరుగుతున్నారు. ఊరి నుంచి తల్లిదండ్రులు పంపే డబ్బు సరిపోక కొందరు, అవసరాల కోసం మరికొందరు, కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇంకొందరు ఫుల్ టైమ్ బోయ్ లుగా కూడా పనిచేస్తున్నారు. నిరుద్యోగులకు కూడా వారికి నచ్చే ఉద్యోగం దొరికే వరకు సంపాదన కోసం ఇదే ఉపాధి కల్పిస్తోం ది. చదువుకునేవాళ్లు సాయంత్రం కాలేజీ తర్వాత యూనిఫాంలోకి మారిపోతున్నారు. డెలివరీల సంఖ్యను బట్టే సంపాదన ఉండడంతో తమ అవసరాన్ని బట్టి ఆదాయం పెంచుకుంటున్నారు కొత్తతరం బాచిలర్స్. ఆడుతూ పాడుతూ ఫుడ్ డెలివరీలు చేస్తూనే వేలల్లో సంపాదిస్తున్నారు.

చదువుకున్నవాళ్లకే అవకాశాలు

ఫుడ్ డెలివరీలో కనిపించేవారిలో చాలామంది పల్లెల నుం చి వచ్చినవారే. అనుకున్న ఉద్యోగం రాక, పెద్ద చదువులు చదివే అవకాశం లేక, డిగ్రీలు, పీజీలు చేశామన్న గొప్పలకు పోకుండా ఫుడ్ డెలివరీ బాయ్స్ గా పనిచేయడానికి సిద్ధపడుతున్నారు. చదవడానికి పట్నం వచ్చేవారు పాకెట్ మనీ కోసం కూడా అమ్మనాన్నలపై ఆధారపడొద్దని తమకు తాముగా సంపాదించుకుంటున్నారు. కొంతమంది పార్ట్‌ టైంగా పనిచేస్తుంటే, డబ్బు ఎక్కువగా వస్తుందని మరికొందరు ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ డెలివరీలు చేస్తుంటారు. మొదట్లో చదువు అర్హత లేకుండానే ఫుడ్ డెలివరీ కంపెనీలు బోయ్స్ ను నియమిం చుకునేవి. అయితే రకరకాల కారణాలతో వీరిపై వినియోగదారుల నుం చి ఫిర్యాదులు వస్తుండడంతో బోయ్స్ కు ఇంటర్ తప్పనిసరి అని నిబంధన పెట్టుకున్నారు. అలాగే ఆండ్రాయిడ్ మొబైల్ వాడడం తెలిసి ఉండడం కూడా తప్పనిసరి.

నియామకాల్లో ఏజెన్సీలదే హవా

సిటీలో ఫుడ్ డెలివరీల రంగం ఊపందుకోవడంతో ఇందులోనూ ఏజెన్సీలు అడుగుపెట్టాయి. కంపెనీలు బోయ్స్ ను నేరుగా రిక్రూట్ చేసుకోకుండా ఏజెన్సీల ద్వారానే తీసుకుంటున్నాయి. దీంతో థర్డ్ పార్టీ ఏజెన్సీల ద్వారానే ఇందులో చేరే అవకాశం ఉంది. ఇవి రిక్రూట్ మెంట్ ను బట్టి, రోజువారీ, శాలరీ బేస్డ్ గా కమిషన్ రూపంలో ఒక్కో బోయ్ నుంచి నెలకు రూ.1000 నుం చి రూ.3,500 వరకు వసూలు చేస్తున్నాయి. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఏజెన్సీల ద్వారానే చేరాల్సి వస్తోంది. అయితే ఈ విధానంలో శ్రామికులుగా వారికి ప్రయోజనాలు రాకుండా చేస్తున్నారన్న విమర్శ ఉంది.

సమస్యలున్నా పని తప్పదు

డెలివరీ చేస్తేనే డబ్బు వస్తుంది కాబట్టి ఆరోగ్యం బాలేకపోయినా పనిచేయాల్సిందే. డైలీ టార్గెట్లలో భాగంగా కొన్నిసార్లు కంపెనీలు ఆర్డర్లను నిలిపివేస్తే డెలివరీ బోయ్స్ ఇబ్బంది పడుంతుంటారు. ఒక్కో ఆర్డర్ కోసం గంటల కొద్దీ ఎదురుచూడడం, ఒక్కోసారి 5 గంటల పాటు పనిచేస్తేగానీ కనీస సంపాదన రాని సందర్భాలు కూడా ఉంటాయి. దీనికితోడు డెలివరీ త్వరగా చేస్తే రేటింగ్ ఆధారంగా కంపెనీలు ఇన్సెంటివ్స్ ఇస్తుంటాయి. వీటి కోసం ఒక్కోసారి బోయ్స్ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారన్న విమర్శలున్నాయి. పోలీసు జరిమానాలతో వచ్చిన సంపాదన కూడా పోగొట్టుకుంటున్నారు. ఇటీవల ఫుడ్‌ డెలివరీ కంపెనీలపై పోలీసుల పర్యవేక్షణ కారణంగా బోయ్స్‌ కు ఆరోగ్య, జీవిత, ప్రమాద బీమా కల్పిం చడంతో వారికి వెసులుబాటు కలిగింది. అదనపు జరిమానాలూ తగ్గాయి.

ఇక్కడా తప్పని మోసాలు

తక్కువ టైంలో మంచి సంపాదన అందుకునే వెసులుబాటు ఉండడంతో డెలివరీ బోయ్స్‌ గా చేరడానికి ముందుకొచ్చే యువకులు పెరుగుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని వారిని మోసం చేసే బోగస్ ఉద్యోగ ఏజెన్సీలు పుట్టుకొస్తున్నాయి. ఉద్యోగ అవకాశాలంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రకటనలతో యువతను ఆకర్షిస్తున్నాయి. ఇలాంటివారు ముందుగానే నామినల్ ఫీజు అంటూ రూ.1000 నుంచి 3వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇలాంటి వారిని నమ్మి వేలాదిమంది యువత మోసపోతున్నారు. దీంతో డబ్బు కట్టాలని అడిగేవారిని నమ్మొద్దని చెబుతున్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కంపెనీలకు కూడా ఇబ్బందిగానే మారుతోంది. దీంతో కొన్ని కంపెనీలు పరిమితంగా నేరుగా రిక్రూట్ మెంట్లు చేయడంపై ఆసక్తి చూపిస్తున్నాయి.

బీటెక్ అయ్యాక సిటీకి వచ్చాను. కొన్ని రోజులు కోచింగ్ ఇనిస్టిట్యూట్ ల చుట్టూ తిరిగాను. ఏడాది తర్వాత నాన్న కాల్ చేసి జాబ్ వచ్చిందా అని అడిగారు. రాలేదని చెప్పా. బీటెక్ అయి ఏడాదైనా ఇప్పటికీ ఖాళీగా ఉన్నావ్… ఇంక నీకు డబ్బులు పెట్టలేం అని నాన్న తిట్టారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక మా ఫ్రెండ్ బైక్ తో పార్ట్ టైం జాబ్ ట్రై చేశాను. మా ఏరియాలో కాకుండా వేరే ఏరియాలో జాబ్ లో చేరాను. నాకు వచ్చే డబ్బులతో ఇప్పుడు జాబ్స్ కి ప్రిపేర్ అవుతూ అమ్మకు కొంతమనీ పంపిస్తున్నా. నేను డెలివరీ బోయ్ గా చేస్తు న్న విషయం మా నాన్నకు ఇప్పటికీ తెలియదు.

-వినోద్, ఫుడ్ డెలివరీ బోయ్, మహబూబాబాద్

నేను జూపార్క్ దగ్గర కుటుంబంతో పాటు ఉంటున్నా. ఏసీ టెక్నీషియన్ గా చేసేవాణ్ణి. ఇప్పుడు ఫుడ్ డెలివరీ బోయ్ గా చేస్తున్నా. నాన్న ఆరోగ్యం బాగోదు. నేనే కుటుంబాన్ని చూసుకోవాలి. దీంతో ఇందులో చేరాను. మొదట్లో ఎవరు ఏమనుకుంటారో అనుకున్నా. కానీ నాలాంటివాళ్లు చాలామంది ఈ వృత్తిలో ఉన్నారు. రోజూ మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు డ్యూటీచేస్తా. రోజుకి రూ.500 వరకు వస్తుంది. మునుపటి ఉద్యోగానికి వెళ్లాలని లేదు. ఇందులోనే ఉంటా.

సయ్యద్ ఇర్ఫాన్, ఫుడ్ డెలివరీ బోయ్

Latest Updates