ప్రైవేట్ హాస్పిటళ్ల కొత్త షరతు.. సగం బెడ్లు మీ ఇష్టం సగం మా ఇష్టం

  • సర్కారుకిచ్చే సగం బెడ్లలో బీపీఎల్ వాళ్లనే రిఫర్ చేయాలని ప్రతిపాదన
  •  మిగతా సగం బెడ్లలో తమకు గిట్టు బాటయ్యే చార్జీలకు డిమాండ్
  • సర్కారు ఇచ్చిన ప్యాకేజీ జీవోలో మార్పులు చేయాలని ఒత్తిడి
  • హాస్పిటళ్ల యాజమాన్యాలతో పబ్లి క్ హెల్త్ డైరెక్టర్ సమావేశం
  • కొలిక్కిరాని చర్చలు.. సోమవారం మరోసారి సమావేశం

సగం బెడ్లుఇచ్చే విషయంలో సర్కారుకే రివర్స్  షరతులు పెడుతున్నాయి కార్పొరేట్,  ప్రైవేట్ ఆస్పత్రులు. ఇన్నాళ్లూ కరోనా పేషెంట్లనుంచి విచ్చలవిడిగా చార్జీలను వసూలు చేసిన ఆ హాస్పిటళ్లను కంట్రోల్ చేయలేకపో యిన సర్కార్ కు.. తమ డిమాండ్లను అంగీకరిస్తేనే ప్రభుత్వ ప్యాకేజీలను అమలు చేస్తామని చెబుతున్నాయి. సగం బెడ్లలో సర్కార్ ప్యాకేజీలు అమలు చేయాలంటే.. మిగతా సగం బెడ్లలో తమ రేట్ల ప్రకారమే చార్జీలు వసూలు చేసుకుంటామని తేల్చి చెబుతున్నాయి

సగం బెడ్లు ఇచ్చేందుకు ప్రైవేట్ ఆస్పత్రులు ఒప్పుకున్నాయని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన విధివిధానాల ను ఖరారు చేసేందుకు ఆస్పత్రుల ప్రతినిధులతో పబ్లిక్ హెల్త్ డైరెక్టర్  డాక్టర్  శ్రీనివాసరావు, డైరెక్ట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) రమేశ్ రెడ్డి శుక్రవారం సమావేశమయ్యారు. సగం బెడ్లు ఇవ్వడమంటే ఆ బెడ్లవరకే ప్రభుత్వ ప్యాకేజీలను అమలు చేయడం మాత్రమేనని ప్రైవేట్ మేనేజ్ మెంట్లు స్పష్టం చేశాయి. మిగతా సగం బెడ్లలో తమకు గిట్టుబాటయ్యే చార్జీలు  వసూలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరాయి. అందుకు తగ్గట్టు జీవోలో మార్పులు చేయాల్సిందిగా ప్రైవేట్ ఆస్పత్రుల ప్రతినిధులు అడిగినట్టు ఓ ఉన్నతాధికారి చెప్పారు. సర్కారుకిచ్చే బెడ్లలో కేవలం బీపీఎల్ కుటుంబాలకే ప్యాకేజీ వర్తింపజేస్తామని, అలాంటి వాళ్ళనే  రిఫర్ చేయాలని కోరినట్టు తెలుస్తోంది. చర్చలు ఓ కొలిక్కి రాకపోవడంతో సోమవారం మరోసారి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. తమ డిమాండ్లకు సర్కారుకు ఒప్పుకుంటేనే సగం బెడ్లపాలసీకి ఓకే చెప్పాలని ప్రైవేటు యాజమాన్యాలు నిర్ణయించుకున్నాయి.

పెద్ద ఆస్పత్రుల్లో సాధ్యమేనా?

ప్రస్తుతం 118 ప్రైవేట్ హాస్పిటళ్లు కరోనా ట్రీట్ మెంట్ను అందిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 68, రంగారెడ్డి(నాన్ జీహెచ్ఎంసీ) లో 28, మేడ్చల్(నాన్జీహెచ్ఎంసీ)లో 9 హాస్పి టల్స్ ఉండగా, మిగిలిన 13 హాస్పిటళ్లు కరీంనగర్ (3), మంచిర్యాల (1), నిజామాబాద్ (2), సంగారెడ్డి (1), వరంగల్ అర్బన్ (6) జిల్లాల్లో ఉన్నాయి. మొత్తం ఆస్పత్రుల్లో కరోనా పేషెంట్ల కోసం 7,879 బెడ్లు కేటాయించారు. ఇందులో 3,196 ఐసోలేషన్ బెడ్లు , 3,150 ఐసీయూ బెడ్లు, 1,533 వెంటిలేటర్ బెడ్లున్నాయి. అయితే, కొన్ని ఆస్పత్రుల్లో వందల సంఖ్యలో బెడ్లుండగా, కొన్నింట్లో పదుల సంఖ్యలో మాత్రమే ఉన్నాయి. ఉదాహరణకు సికింద్రాబాద్ యశోదలో 356, కిమ్స్ లో 357 బెడ్లు ఉండగా.. సికింద్రాబాద్ అపోలోలో కేవలం 65, నాంపల్లి కేర్ హాస్పిటల్ లో కేవలం 49 బెడ్లేఉన్నాయి. ఈ లెక్కన యశోద, కిమ్స్ లో 175 బెడ్ల చొప్పున ప్రభుత్వానికి ఇవ్వా ల్సి వస్తుంది. అదే అపోలో, కేర్‌లో 25 నుంచి 30 చొప్పున మాత్రమే సర్కార్‌కు ఇస్తే సరిపో తుంది. ఈ నేపథ్యంలో అన్ని హాస్పిటళ్లలో సగం చొప్పున తీసుకుంటారా లేదంటే హాస్పిటల్ కెపాసిటీని బట్టి కొన్ని బెడ్లు మాత్రమే తీసుకుంటారా అన్నదానిపైనా స్పష్టత రావాల్సి ఉంది.

1,100 ఫిర్యాదులు

ప్రభుత్వం పెట్టిన ప్యాకేజీల ప్రకారం ఐసోలేషన్ బెడ్ కు రోజూ రూ.4 వేలు, ఐసీయూకు రూ.7,500, వెంటిలేటర్ పెడితే రూ.9 వేలు మాత్రమే చార్జ్ చేయాలి. డాక్టర్ ఫీజు, నర్సింగ్ చార్జీలు,  ఈసీజీ, 2డీ ఇకో సహా కొన్ని టెస్టులు, పేషెంట్కు అందించే ఫుడ్ వంటి వాటన్నింటినీ ఆ చార్జీల్లోనే కలపాలి. కానీ, ఏ ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఆ జీవోను, అందులోని విషయాలను లెక్క చేయట్లేదు. డాక్టర్  ఫీజుల రూపంలోనే లక్షల్లో బిల్లు వేస్తున్నాయి. పీపీఈ కిట్లు, డిస్పోజబుల్స్, మెడిసిన్ అంటూ అడ్డగోలుగా దోచుకుంటున్నాయి. ఇన్సూరెన్స్నూ ఒప్పుకోవట్లేదు. ఈ దోపిడీపై ఆరోగ్య శాఖకు దాదాపు 1,100 దాకా ఫిర్యాదులు వచ్చాయి. హైదరాబాద్లోని అన్ని ఆస్పత్రులపైనా ఫిర్యాదులు వచ్చాయని, ఆస్పత్రుల తీరు మానవత్వానికే మచ్చ తెచ్చేలా ఉందని ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కఠిన చర్యలు తీసుకుంటామని పదే పదే హెచ్చరించారే తప్ప.. ఇప్పటివరకు ఆ చర్యలు తీసుకునే ధైర్యం మాత్రం చేయలేదు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో డెక్కన్, విరించి ఆస్పత్రులకు కరోనా ట్రీట్మెంట్ అనుమతులను రద్దుచేశారు. అయినా ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ మాత్రం ఆగలేదు. ఏదో ఒకటి చేయకపోతే ప్రజల్లో మరింత వ్యతిరేకత పెరిగే అవకాశం ఉండడంతో ఇటు ప్రభుత్వం, అటు ప్రైవేటు యాజమాన్యాలు సగం బెడ్లు సర్కారుకేనన్న కొత్త చర్చకు తెరలేపాయి.

Latest Updates