నేడు న్యూజిలాండ్‌‌తో మూడో వన్డే

ఒత్తిడిలో టీమిండియా
క్లీన్‌ స్వీప్‌పై కివీస్‌ గురి

క్రికెట్‌‌లో అంతే..! క్షణాల్లో ఫలితాలు తారుమారు అవుతుంటాయి..! వారాల్లో అదృష్టాలు మారిపోతుంటాయి..! గెలిచిన చోటే.. పరువు కాపాడుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతుంటాయి..! సరిగ్గా వారం కిందట.. న్యూజిలాండ్‌‌పై టీ20 సిరీస్‌‌ను 5-0తో వైట్‌ వాష్‌ చేసింది టీమిండియా..! కానీ ఇప్పుడు.. ఎదురే ఉండదనుకున్న వన్డే సిరీస్‌‌లో ఏకంగా వైట్‌ వాష్‌ అంచుల్లోకి పడిపోయింది..! ఇందులో విశేషమేమిటంటే.. ఎక్కడైతే క్లీన్ స్వీప్​ చేశామో.. మళ్లీ అదే వేదికపై.. పరువు కాపాడుకోవాల్సిన స్థితిలో విరాట్‌ సేన
నిలుచుంది..! మరి నేడు కివీస్‌‌తో జరిగే ఆఖరి వన్డేలోనైనా ఇండియా గెలుస్తుందా? టెస్ట్‌‌ సిరీస్‌‌కు ముందు కొంతైనా అత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంటుందా? లేక హోమ్‌ టీమ్‌ సిరీస్‌‌ను క్లీన్‌‌స్వీప్‌ చేస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది..!!

మౌంట్‌ మాంగనుయ్‌: హాట్‌ ఫేవరెట్‌‌గా వన్డే సిరీస్‌‌ను మొదలుపెట్టిన ఇండియా.. ఇప్పుడు పరువు కోసం పాకులాడుతోంది. స్వదేశీ, విదేశీ అన్న తేడా లేకుండా ఆడిన ప్రతీ సిరీస్‌‌ను సొంతం చేసుకున్న టీమిండియా.. ఇప్పుడు ఆత్మ రక్షణ ధోరణిలో పడింది. తమకున్న బలాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అని లెక్కలేసిన స్థాయి నుంచి ఇప్పుడు ఎదురవుతున్న బలహీనతలను ఎలా అధిగమించాలో తెలియక తలలు పట్టుకుంటున్న స్థితికి పడిపోయింది. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగే ఆఖరిదైన మూడో వన్డేలో న్యూజిలాండ్‌‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. చెత్త బౌలింగ్‌, ఫీల్డింగ్‌ వైఫల్యంతో సిరీస్‌‌లో 0–2తో వెనుకబడ్డ విరాట్‌ సేన.. కనీసం ఈ మ్యాచ్‌‌లోనైనా గెలిచి ఊరట చెందాలని భావిస్తోంది. మరోవైపు గతేడాది 1–4తో సిరీస్‌‌ను కోల్పోయిన కివీస్‌ .. ఈసారి క్లీన్‌ స్వీప్‌‌తో లెక్క సరి చేయాలని పట్టుదలగా ఎదురుచూస్తోంది.

టాప్‌ వైఫల్యంతోనే..
రోహిత్‌ , ధవన్‌ గాయాలతో దూరం కావడం, కోహ్లీ భారీ ఇన్నింగ్స్‌ ఆడకపోవడం, రాహుల్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌‌లో లేటుగా వస్తుండటంతో.. టీమిండియాలో ఉండే ట్రెడిషినల్‌ వన్డే స్ట్రెంత్‌ న్యూట్రలైజ్‌ అయ్యింది. దీంతో కివీస్‌ పెద్దగా కష్టపడకుండానే ఇండియాను కట్టడి చేస్తోంది. ఓపెనర్లు పృథ్వీ, మయాంక్‌ అప్పుడప్పుడూ మెరుస్తున్నా.. నిలకడలేమితో ఇబ్బందులు పడుతున్నారు. టీమిండియా సిరీస్‌ చేజార్చుకోవడానికి మరో మేజర్‌ కారణం రోహిత్‌ లేకపోవడం. గత 12 నెలల్లో ఈ ముంబైకర్‌ 57.30 సగటుతో పరుగుల వరద పారించాడు. హిట్‌ మ్యాన్‌ గైర్హాజరీతో ఇప్పుడు రన్స్‌ చేసే భారం మొత్తం కోహ్లీపై పడింది. ఈ ఒత్తిడిలో కెప్టెన్‌ .. రెండు మ్యాచ్‌ల్లో కలిపి 66 రన్స్‌ మాత్రమే చేశాడు. అంటే టాపార్డర్‌ అనుకున్న స్థాయిలో రాణించకపోవడంతో ఈ ఫార్మాట్‌‌లో ఇండియా అదృష్టం రివర్స్‌ అయ్యింది. కనీసం ఈ మ్యాచ్‌‌లోనైనా ‘టాప్‌ ’ లేపుతారా? చూడాలి.

పంత్‌‌కు చాన్స్‌!
రెండు మ్యాచ్‌‌ల టెస్ట్‌‌ సిరీస్‌‌ను దృష్టిలో పెట్టుకుని రెగ్యులర్‌ వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌‌కు చాన్స్‌ ఇవ్వాలని మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. సోమవారం జరిగిన ఆప్షనల్‌ ప్రాక్టీస్‌‌కు రాహుల్‌, పృథ్వీ, శ్రేయస్‌, కేదార్‌, చహల్‌ దూరంగా ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్‌‌లో బెంచ్‌కూ అవకాశాలు ఇచ్చేలా సంకేతాలు వచ్చాయి. ముందుగా నెట్‌ ప్రాక్టీస్‌‌కు వచ్చిన కోహ్లీ .. పేస్‌, స్పిన్‌‌ను ఎదుర్కొన్నాడు. తర్వాత మనీష్‌ పాండే, రిషబ్‌ పంత్‌ సుదీర్ఘంగా ప్రాక్టీస్‌ చేశారు. ఆస్ట్రేలియాపై చివరి మ్యాచ్‌ ఆడిన పంత్‌‌ను ఎక్కువ రోజులు వైట్‌ బాల్‌ క్రికెట్‌‌కు దూరంగా ఉంచడం కూడా సరైంది కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ పంత్‌ వస్తే రాహుల్‌ ఓపెనింగ్‌
చేసే చాన్స్‌ కూడా ఉంది. అప్పుడు పృథ్వీ బెంచ్‌‌కు పరిమితం కానున్నాడు. మిడిలార్డర్‌‌లో శ్రేయస్‌ చెలరేగుతున్నా.. చివరి వరకు ఇన్నింగ్స్‌ కొనసాగేలా చూసుకోవాలి. ఫినిషింగ్‌‌లో అతను ఉండటం వల్ల భారీ షాట్లు ఆడేందుకు జడేజా, సైనీకి మంచి చాన్స్‌ ఉంటుంది. కేదార్‌ ఏ రోల్‌‌లో ఆకట్టుకోవడం లేదు. ఈ మ్యాచ్‌‌లో అతని చోటు కష్టమే కాబట్టి స్పెషలిస్ట్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌గా మనీష్‌ లేదా ఆల్‌ రౌండర్‌‌గా దూబేను తీసుకుంటారో చూడాలి.

బుమ్రాకు ఏమైంది?
ఇండియా పేస్‌ అటాక్‌ అంటేనే ఠక్కున బుమ్రా గుర్తొస్తాడు. పిచ్‌ ఎలా ఉన్నా తొలి 10 ఓవర్లలో వికెట్‌ తీస్తాడనే నమ్మకం. కానీ గత రెండు మ్యాచ్‌ల్లో ఇది జరగలేదు. బుమ్రా బౌలింగ్‌‌ను కివీస్‌ బ్యాట్స్‌‌మన్‌ పూర్తిగా అర్థం చేసుకున్నారు. కాబట్టి కొత్త అస్త్రాలను బయటకు తీయాల్సిందే. బుమ్రా ఎంత త్వరగా గాడిలో పడితే ఇండియాకు అంత అనుకూలం. బ్యాట్‌ , బాల్‌‌తో సైనీ రాణిస్తుండటం శుభపరిణామం. కుల్దీప్‌ బౌలింగ్‌, ఫీల్డింగ్‌‌లోనూ నిరాశపరుస్తున్నాడు. కాబట్టి చహల్‌కే ఎక్కువ చాన్సెస్‌ ఉన్నాయి. షమీ ప్రాక్టీస్‌‌కు రాకపోవడంతో ఠాకూర్‌‌కు లైన్‌ క్లియర్‌ అయినట్లే. ఈ మ్యాచ్‌‌లో ఇండియా నెగ్గాలంటే ముందుగా రాస్‌టేలర్‌‌ను కట్టడి చేయాలి. ఇది జరగాలంటే పేసర్లు శ్రమించాలి. ఫీల్డింగ్‌ లోనూ టీమిండియా మరింత దిగజారింది. సులువైన క్యాచ్‌‌లు నేలపాలు చేయడం ప్రతికూలాంశం. ఇందులో మెరుగుపడకపోతే అంతే.

విలియమ్సన్‌‌ ఆగయా..
భుజం గాయం నుంచి కోలుకున్న కెప్టెన్‌ విలియమ్సన్‌ ఫైనల్‌ ఎలెవన్‌‌లో ఆడనున్నాడు. నాలుగో టీ20 నుంచి ఆటకు దూరంగా ఉన్న అతను ఫిట్‌ నెస్‌ పరీక్షలో పాసయ్యాడు. ఈ మ్యాచ్‌ కోసం లెగ్‌ స్పిన్నర్‌ సోధీ, పేసర్‌ బ్లేయిర్‌ టిక్నర్‌ను కూడా టీమ్‌లోకి తీసుకున్నారు. కడుపు నొప్పితో సౌథీ, శాంట్నర్‌, వైరల్‌ ఫీవర్‌తో కుగెలిన్‌ ఈ మ్యాచ్‌లో ఆడటంపై సందిగ్ధత నెలకొంది. విలియమ్సన్‌ రాకతో బ్యాటింగ్‌ మరింత బలోపేతం అయ్యింది. గప్టిల్‌, నికోల్స్‌ ఓపెనింగ్‌లో చెలరేగితే.. మిడిలార్డర్‌ భారాన్ని మోసేందుకు టేలర్‌
సిద్ధంగా ఉన్నాడు. లాథమ్‌, నీషమ్‌, గ్రాండ్‌ హోమ్‌ కొంత సహకారం ఇచ్చినా చాలు. బౌలింగ్‌లో ఇబ్బందులున్నా.. జెమీసన్‌ , బెనెట్‌, సోధీ కవర్‌ చేస్తారని భావిస్తున్నారు.

Latest Updates