ఆసీస్‌-కివీస్‌ సిరీస్‌ రద్దు

మెల్‌బోర్న్‌: కరోనా దెబ్బకు న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌ కూడా రద్దు అయ్యింది. మూడు మ్యాచ్‌ల చాపెల్‌–హ్యాడ్లీ వన్డే సిరీస్‌ను రద్దు చేస్తున్నట్టు క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) శనివారం ప్రకటించింది. కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న నేపథ్యంలో న్యూజిలాండ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లే సిరీస్‌ను రద్దు చేయాల్సి వచ్చిందని  సీఏ తెలిపింది. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు కివీస్‌ ప్రభుత్వం తమ దేశ సరిహద్దుల వద్ద నిబంధనలను కఠినతరం చేసింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి కొత్త రూల్స్‌ అమలులోకి రానున్నాయి. వాటి ప్రకారం న్యూజిలాండ్‌లో అడుగుపెట్టాలనుకునే వారు తప్పనిసరిగా 14 రోజలు సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉండి తీరాలి. దీంతో కివీస్‌ క్రికెటర్లు ఆసీస్‌ నుంచి హుటాహుటిన స్వదేశానికి వెళ్లిపోయారు. సిరీస్‌లో మిగిలిన రెండు వన్డేలను రద్దు చేసుకున్నారు. ఇందుకు ఇరుదేశాల బోర్డులు అంగీకరించగా.. భవిష్యత్‌లో ఈ సిరీస్‌ను నిర్వహిస్తామని తెలిపాయి. సిరీస్‌లో భాగంగా ఖాళీ స్టాండ్స్‌ మధ్య జరిగిన ఫస్ట్‌ వన్డేలో ఆసీస్‌ ఘన విజయం సాధించింది.

ఇక, న్యూజిలాండ్‌‌ పేసర్‌‌ లూకీ ఫెర్గుసన్‌‌ కరోనా బారిన పడలేదని తేలింది. ఆసీస్‌‌తో ఫస్ట్‌‌ వన్డే తర్వాత గొంతులో మంటగా ఉందంటూ ఫెర్గుసన్‌‌ తమ మెడికిల్‌‌ టీమ్‌‌కు చెప్పాడు. దీంతో ఫెర్గుసన్‌‌ను ఐసోలేషన్‌‌లో ఉంచి శనివారం  వైద్య పరీక్షలు నిర్వహించారు.  ఫెర్గుసన్‌‌కు చేసిన కొవిడ్‌‌–19 టెస్టుల్లో నెగెటివ్‌‌ రిజల్ట్‌‌ రావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.  ఫెర్గుసన్‌‌ కొవిడ్‌‌ బారినపడలేదని, అతని విమాన ప్రయాణానికి క్లియరెన్స్‌‌ వచ్చిందని.. ఆదివారం స్వదేశానికి వస్తాడని న్యూజిలాండ్‌‌ బోర్డు ట్వీట్‌‌ చేసింది. అంతకముందు ఫస్ట్‌‌ వన్డేకు దూరమైన ఆస్ట్రేలియా పేసర్‌‌ కేన్‌‌ రిచర్డ్‌‌సన్‌‌కు శుక్రవారం కొవిడ్‌‌–19 టెస్ట్‌‌లు నిర్వహించారు. టెస్ట్‌‌ రిజల్ట్‌‌ నెగెటివ్‌‌ రావడంతో ఆ మ్యాచ్‌‌ చివర్లో రిచర్డ్‌‌సన్‌‌ స్టేడియానికి వచ్చాడు. రిచర్డ్‌‌సన్‌‌ కూడా గొంతులో మంట అనే ఫిర్యాదు చేశాడు.

Latest Updates