ధనాధన్ ఫటాఫట్!

ఆక్లాండ్‌‌:   గత రెండు టూర్లలో న్యూజిలాండ్‌‌పై టీ20 సిరీస్‌‌ నెగ్గలేకపోయిన ఇండియా ఈసారి అందుకు బలమైన అడుగు వేసింది. ఐదు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో భాగంగా శుక్రవారం జరిగిన ఫస్ట్ టీ20లో కోహ్లీసేన ఆరు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌‌ను చిత్తుగా ఓడించింది. మొదట బ్యాటింగ్‌‌ చేసిన కివీస్‌‌ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్‌‌ కొలిన్‌‌ మన్రో (42 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 59), రాస్‌‌ టేలర్ (27 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 నాటౌట్‌‌), కెప్టెన్‌‌ కేన్‌‌ విలియమ్సన్‌‌ (26 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 51) హాఫ్‌‌ సెంచరీతో మెరిశారు. అనంతరం అయ్యర్‌‌, రాహుల్‌‌ ధనాధన్‌‌ బ్యాటింగ్‌‌తో ఇండియా 19 ఓవర్లలోనే నాలుగు వికెట్లకు 204 రన్స్‌‌ చేసి ఈజీగా గెలిచింది. కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ (32బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌‌తో 45) కూడా  మెరుపులు మెరిపించాడు. శ్రేయస్‌‌ అయ్యర్‌‌కు మ్యాన్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య సెకండ్‌‌ టీ20 ఇదే వేదికపై ఆదివారం జరగనుంది.

హిట్‌‌మ్యాన్‌‌ ఫట్‌‌.. లోకేశ్‌‌, కోహ్లీ హిట్‌‌..

భారీ టార్గెట్‌‌ను ఇండియా అంత ఈజీగా ఛేజ్‌‌ చేసిందంటే కారణం లోకేశ్‌‌ రాహుల్‌‌, శ్రేయస్‌‌ అయ్యర్‌‌ సూపర్‌‌ బ్యాటింగ్‌‌ వల్లే. కెప్టెన్‌‌ కోహ్లీ ఇన్నింగ్స్‌‌ను కూడా తక్కువేం కాకపోయినా.. ఈ ఇద్దరూ ఫుల్‌‌ మార్కులు కొట్టేశారు. శాంట్నర్‌‌ వేసిన రెండో ఓవర్లోనే రోహిత్​ (7) ఔటవవడంతో ఇండియాకు షాక్​ తగిలింది. అయితే, అదే ఓవర్లో లోకేశ్‌‌ రెండు ఫోర్లు రాబట్టగా.. వన్‌‌డౌన్‌‌లో వచ్చిన కోహ్లీ కూడా దూకుడుగా బ్యాటింగ్‌‌ చేశాడు. ఇద్దరూ పోటీపడి ఫోర్లు, సిక్సర్లు బాదడంతో రన్‌‌రేట్‌‌ దూసుకెళ్లింది. ఈ క్రమంలో కోహ్లీ, లోకేశ్‌‌ అద్భుతమైన షాట్లతో ఫ్యాన్స్‌‌కు ట్రీట్‌‌ ఇచ్చారు. టిక్నర్‌‌ బౌలింగ్‌‌ (4వ ఓవర్)లో కోహ్లీ లాఫ్టెడ్‌‌ షాట్‌‌తో లాంగాఫ్‌‌ మీదుగా కొట్టిన సిక్సర్‌‌, తర్వాతి ఓవర్లో సౌథీ స్ట్రయిట్‌‌ లైన్‌‌పై వేసిన బాల్‌‌ను రాహుల్‌‌ రిస్ట్‌‌ యూజ్‌‌ చేస్తూ మిడ్‌‌ వికెట్‌‌ మీదుగా కొట్టిన సిక్సర్‌‌ను ఎంత పొడిగినా తక్కువే. ఇక, కివీస్‌‌ పేలవ ఫీల్డింగ్‌‌ కూడా ఇండియాకు కలిసొచ్చింది. ఆరో ఓవర్లోనే రెండు త్రోలు మిస్సవడంతో రాహుల్‌‌ రనౌటయ్యే ప్రమాదం తప్పించుకున్నాడు. టిక్నర్‌‌ వేసిన తొమ్మిదో ఓవర్లో ఇష్‌‌ సోధీ క్యాచ్‌‌ డ్రాప్‌‌ చేయడంతో కోహ్లీ ఊపిరిపీల్చుకున్నాడు. అదే ఓవర్లో లాంగాన్‌‌పై సిక్సర్‌‌ కొట్టి రాహుల్‌‌ 23 బాల్స్‌‌లోనే హాఫ్‌‌ సెంచరీ పూర్తి చేసుకోగా ఇండియా స్కోరు వంద దాటింది. కానీ,   ఇష్‌‌ సోధీ బౌలింగ్‌‌లో రాహుల్‌‌.. సౌథీకి క్యాచ్‌‌ ఇవ్వగా, టిక్నర్‌‌ ఓవర్లో లాంగాన్‌‌లో గప్టిల్‌‌ పట్టిన అద్భుతమైన క్యాచ్‌‌కు కోహ్లీ ఔటవడంతో హోమ్‌‌టీమ్‌‌ రేసులోకొచ్చింది.

అయ్యర్‌‌ సూపర్‌‌

ఆరు పరుగుల తేడాతో సెట్‌‌ బ్యాట్స్‌‌మెన్‌‌ను కోల్పోయిన ఇండియా కొద్దిసేపటికే ఆల్‌‌రౌండర్‌‌ శివమ్‌‌ దూబే (13) కూడా ఔటవడంతో కాస్త తడబడింది. శాంట్నర్‌‌ బౌలింగ్‌‌లో ఫోర్‌‌, సిక్సర్‌‌ బాది అయ్యర్‌‌తో నాలుగో వికెట్‌‌కు 21 రన్స్‌‌ జోడించిన దూబే.. సోధీ బౌలింగ్‌‌లో పెవిలియన్‌‌ చేరాడు. అప్పటికి చివరి ఆరు ఓవర్లలో ఇండియాకు 60 రన్స్‌‌ అవసరం అవగా.. రెండు జట్లకూ చాన్స్‌‌లు కనిపించాయి. ఈ దశలో చెలరేగిన శ్రేయస్‌‌ అయ్యర్‌‌ మ్యాచ్‌‌ను వన్‌‌సైడ్‌‌ చేశాడు. మనీశ్‌‌ పాండే (14 నాటౌట్‌‌) స్ట్రయిక్‌‌ రొటేట్‌‌ చేసే బాధ్యత తీసుకోగా.. అయ్యర్‌‌ పవర్‌‌ఫుల్‌‌ షాట్లతో విజృంభించాడు. టిమ్‌‌ సౌథీ లెంగ్త్‌‌ బాల్స్‌‌, బెనెట్‌‌ షార్ట్‌‌ డెలివరీలను బౌండ్రీకి చేర్చుతూ కివీస్‌‌ ఆశలపై నీళ్లు కుమ్మరించాడు. ఈ ఇద్దరు సీమర్ల బౌలింగ్‌‌లో 17 బాల్స్‌‌లోనే 40 రన్స్‌‌ రాబట్టాడంటే అతను ఏ రేంజ్‌‌లో రెచ్చిపోయాడో చెప్పొచ్చు. బెనెట్‌‌ వేసిన 18వ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాదిన శ్రేయస్‌‌.. సౌథీ బౌలింగ్‌‌లో 6, 4తో హాఫ్‌‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అదే ఓవర్‌‌ లాస్ట్‌‌ బాల్‌‌కు సిక్సర్‌‌తో  మ్యాచ్‌‌ను ముగించాడు.

కివీస్​లో ఆ ముగ్గురు

తొలుత టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన కివీస్‌‌కు ఓపెనర్లు గప్టిల్‌‌ (19 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌‌తో 30), కొలిన్‌‌ మన్రో మెరుపు ఆరంభం అందించారు. ఫస్ట్‌‌ స్పెల్‌‌లో బుమ్రా (1/31) కట్టుదిట్టంగా బౌలింగ్‌‌ చేసినా.. శార్దుల్‌‌ ఠాకూర్‌‌ (1/44), మహ్మద్‌‌ షమీ (0/53)లను టార్గెట్‌‌ చేస్తూ 8 ఓవర్లలోనే 80 రన్స్​ రాబట్టారు. దూబే బౌలింగ్​లో రోహిత్‌‌ పట్టిన క్యాచ్‌‌కు మన్రో ఔటైనా కేన్‌‌ విలియమ్సన్‌‌ రాకతో పరుగుల వేగం మరింత పెరిగింది. దూబే తర్వాతి ఓవర్లోనే కేన్‌‌ లాఫ్టెడ్‌‌ షాట్‌‌తో సిక్సర్‌‌ కొట్టగా.. చహల్‌‌ బౌలింగ్‌‌లో రెండు ఫోర్లు బాదిన మన్రో 36 బాల్స్‌‌లోనే హాఫ్‌‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే శార్దుల్​ అతణ్ణి ఔట్​ చేయగా, జడేజా బౌలింగ్‌‌లో గ్రాండ్‌‌హోమ్‌‌ (0) షార్ట్‌‌ ఫైన్‌‌ లెగ్‌‌లో దూబేకు చిక్కడంతో ఇండియాకు డబుల్‌‌ బ్రేక్‌‌ వచ్చింది. అప్పటికి కివీస్‌‌ స్కోరు 13 ఓవర్లలో 117/3. ఈ టైమ్‌‌లో కేన్‌‌కు రాస్‌‌ టేలర్‌‌ జతకలవడంతో స్కోరు వేగం డబులైంది. ఈ ఇద్దరు 28 బాల్స్‌‌లోనే 61 రన్స్‌‌ జోడించారు. జడేజా బౌలింగ్‌‌లో 4,6 కొట్టిన టేలర్‌‌.. తర్వాత షమీ వేసిన 16వ ఓవర్లో 4,6,6 తో రెచ్చిపోయాడు. ఆ ఓవర్లో ఏకంగా 22 రన్స్‌‌ వచ్చాయి. ఆపై, చహల్‌‌ బౌలింగ్‌‌లో మూడు ఫోర్లు బాది ఫిఫ్టీ పూర్తి చేసుకున్న కేన్‌‌.. కోహ్లీకి క్యాచ్‌‌ ఇచ్చి వెనుదిరిగాడు. అయినా మరో ఎండ్‌‌లో టేలర్‌‌ జోరు చూస్తుంటే కివీస్‌‌ 220–230 రన్స్‌‌ చేసేలా కనిపించింది. కానీ, లాస్ట్‌‌ స్పెల్‌‌ రెండు ఓవర్లలో ఓ వికెట్‌‌ తీసి 16 పరుగులే ఇచ్చిన బుమ్రామా ప్రత్యర్థిని  కట్టడి చేశాడు.

Latest Updates