ఓపెనర్లు ఎవరు

టీ20 సిరీస్‌‌ గెలిచి.. వన్డే సిరీస్‌‌ను అప్పగించి.. లెక్కలు సరి చేసుకున్న ఇండియా.. కివీస్‌‌ గడ్డపై ఇప్పుడు అసలు సిసలు పోరాటానికి సిద్ధమవుతోంది..! చల్లని వాతావరణంలో.. శీతలగాలుల మధ్య.. సూపర్ ఫాస్ట్‌‌ పిచ్‌‌లపై.. రెండువైపులా స్వింగ్‌‌తో, కత్తుల్లా దూసుకొచ్చే బౌన్సర్లను ఎదుర్కొనేందుకు రెడీ అవుతోంది..! ఈ నేపథ్యంలో రెండు టెస్ట్‌‌ల సిరీస్‌‌కు సన్నాహకంగా నేటి నుంచి కివీస్‌‌ ఎలెవన్‌‌తో జరిగే ప్రాక్టీస్‌‌ మ్యాచ్‌‌పై విరాట్‌‌సేన దృష్టిపెట్టింది..! దీంతో గాయాల కారణంగా గైర్హాజరైన సీనియర్ల స్థానంలో టీమిండియా భారాన్ని మోస్తున్న కుర్రాళ్లు.. ఈ మ్యాచ్‌‌లో కుదురుకుంటారా? బౌలింగ్‌‌ అస్త్రాలను సరి చూసుకునేందుకు దక్కిన ఏకైక అవకాశాన్ని కోహ్లీ సేన సద్వినియోగం చేసుకుంటుందా?

హామిల్టన్‌‌:

రోహిత్‌‌, ధవన్‌‌ లేకపోవడంతో ఓపెనర్లతో కొత్త సమస్య..? స్పిన్‌‌ పిచ్‌‌లు కాకపోవడంతో ఫైనల్‌‌ ఎలెవన్‌‌లో జడేజా, అశ్విన్‌‌లో ఎవర్ని ఆడించాలి..? బుమ్రా గాడిలో పడతాడా..? మిడిలార్డర్‌‌ సమస్య తీరుతుందా..? ఇలాంటి సందేహాల నడుమ ఇండియా టీమ్‌‌.. న్యూజిలాండ్‌‌ ఎలెవన్‌‌తో మూడు రోజుల ప్రాక్టీస్‌‌ మ్యాచ్‌‌కు సిద్ధమైంది. వన్డే సిరీస్‌‌తో బహిర్గతమైన లోపాలను అధిగమించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న టీమిండియా.. టీమ్‌‌ బ్యాలెన్స్‌‌ను కూడా చెక్‌‌ చేసుకోవాలని భావిస్తోంది. కివీస్‌‌ టీమ్‌‌లో సీనియర్‌‌, ‘ఎ’ జట్టుకు సంబంధించిన ప్రధాన ప్లేయర్లే ఆడుతుండటంతో ఈ ప్రాక్టీస్‌‌ మ్యాచ్‌‌ను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని మేనేజ్‌‌మెంట్‌‌ ప్లాన్స్‌‌ వేస్తోంది.

కుర్రాళ్లకు చాన్స్‌‌..!

వన్డేల్లో ఓపెనింగ్‌‌ చేసిన పృథ్వీ షాతో పాటు మయాంక్‌‌, తెలుగు కుర్రాడు హనుమ విహారి, శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ ఓపెనర్ల రేస్‌‌లో ఉన్నారు. మయాంక్‌‌తో కలిసి ఇన్నింగ్స్‌‌ మొదలుపెట్టిన అనుభవం  విహారికి ఉన్నా.. చాన్స్‌‌ దక్కుతుందో లేదో చూడాలి. గిల్‌‌ అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నాడు. ఓవరాల్‌‌గా తొలి టెస్ట్‌‌ టీమ్‌‌లో చోటు దక్కించుకోవడానికి ఈ నలుగురికి ఇదో గోల్డెన్‌‌ చాన్స్‌‌. మిడిలార్డర్‌‌లోనూ ఒకటి, రెండు ఖాళీలు ఉంటాయి కాబట్టి.. విహారి, గిల్‌‌ ఆకట్టుకుంటే చోటును ఆశించొచ్చు. ఇక కివీస్‌‌ గడ్డపై ఇద్దరు స్పిన్నర్ల వ్యూహం పెద్దగా వర్కౌట్‌‌ అయ్యే చాన్సు లేకపోవడంతో అశ్విన్‌‌, జడేజా మధ్య పోటీ నెలకొంది. ఇద్దరూ ఆల్‌‌రౌండర్లుగా రాణిస్తుండటంతో  వామప్‌‌ మ్యాచ్‌‌లో బాగా ఆడిన వారి వైపే కోహ్లీ మొగ్గు చూపే చాన్సుంది. ప్రాక్టీస్‌‌ మ్యాచ్‌‌ జరిగే సెడాన్‌‌ పార్క్‌‌లో పిచ్‌‌ ఫ్లాట్‌‌గా ఉంది. దీంతో స్పిన్నర్లకు కఠిన పరీక్ష తప్పకపోవచ్చు. ఈ టెస్ట్‌‌లో పాసయ్యేది ఎవరు? పుజారా, రహానె, కోహ్లీ కూడా మెరుగైన ఇన్నింగ్స్‌‌ ఆడాలని ఆశిస్తున్నారు. వికెట్‌‌ కీపర్‌‌గా సాహాకు ఇది లిట్మస్‌‌ టెస్టే. బౌలింగ్‌‌లో బుమ్రా, షమీ, ఉమేశ్‌‌పైనే భారం ఎక్కువగా ఉంది.

బలంగానే కివీస్‌‌..

కివీస్‌‌ కూడా మెయిన్‌‌ ప్లేయర్లను దించుతోంది కాబట్టి పోటీ కచ్చితంగా ఉంటుంది. సోధీ, సీఫర్ట్‌‌, కుగెలిన్‌‌, బ్రూస్‌‌, నీషమ్‌‌ ఇందులో ఉన్నారు. మిచెల్‌‌ సారథ్యం కూడా వీళ్లకు ప్లస్‌‌ కానుంది. ఇండియా–ఏ తో జరిగిన సిరీస్‌‌లో వరుసగా 196, 53 రన్స్‌‌ చేసిన డేన్‌‌ క్లీవర్‌‌ కూడా బరిలోకి దిగుతున్నాడు. సీనియర్‌‌ టీమ్‌‌లో చోటే లక్ష్యంగా అతను ఆడుతున్నాడు కాబట్టి టీమిండియా బౌలర్లకు సవాలే. సొంతగడ్డపై కివీస్‌‌ బౌలింగ్‌‌ లైనప్‌‌ కూడా మరింత ప్రమాదకరం కానుంది.

అందరికీ చాన్స్‌‌..

ఫస్ట్‌‌ క్లాస్‌‌ అర్హత ఉన్నప్పటికీ.. జట్టులో ప్రతి ఒక్కరికీ చాన్స్‌‌ ఇవ్వడమే లక్ష్యంగా వామప్‌‌ మ్యాచ్‌‌లు జరుగుతుంటాయి. టూర్‌‌కు వచ్చిన జట్లు మెయిన్‌‌ మ్యాచ్‌‌లకు ముందు తమ బలాన్ని, బలగాన్ని పరీక్షించుకోవడానికి వామప్‌‌లను వేదికగా వాడుకుంటాయి. దీంతో జట్టులో ప్రతి ఒక్కరికీ కనీసం 50 నుంచి 100 బాల్స్‌‌ ఎదుర్కొనే అవకాశం దొరుకుతుంది. అదే విధంగా బౌలర్లకు ఒకట్రెండు స్పెల్స్‌‌ వేసే చాన్స్‌‌ కూడా ఉంటుంది. సాధారణంగా వామప్‌‌ మ్యాచ్‌‌ల్లో తొలి రోజు అంతా ఆతిధ్య జట్టు బ్యాటింగ్‌‌ చేస్తుంది. ఇంకో రోజు పర్యాటక టీమ్‌‌ ఆడుతుంది. మరి ఈ మ్యాచ్‌‌లో ఏం జరుగుతుందో చూడాలి.

విరుష్క చెట్టాపట్టాల్‌‌!

వన్డే సిరీస్‌‌ ఓటమితో నెలకొన్న స్తబ్ధతను తొలగించుకునేందుకు టీమిండియా ప్లేయర్లు లోకల్‌‌గా ఓ మంచి ట్రిప్‌‌ వేశారు. పచ్చని చెట్ల మధ్య.. జలజల పారుతున్న సెలయేర్ల మధ్య సేద తీరుతూ ప్రకృతితో మమేకమయ్యారు. కివీస్‌‌లోని ప్యుటరూరి ప్రాంతంలో ఉన్న ‘బ్లూ స్ప్రింగ్స్‌‌ వాటర్‌‌ఫ్రంట్‌‌’లో గురువారమంతా క్రికెటర్లు సందడి చేశారు. దాదాపు ఏడు, ఎనిమిది కిలోమీటర్లు వాకింగ్‌‌ చేస్తూ అక్కడ ఉన్న అందమైన ప్రాంతాలను తిలకించారు. భార్య అనుష్క శర్మతో కలిసి కెప్టెన్‌‌ కోహ్లీ కూడా సహచరులతో పాటు నేచర్‌‌ను ఎంజాయ్‌‌ చేశాడు. వాలెంటైన్స్‌‌ డే రోజు మ్యాచ్‌‌ ఆడాల్సి రావడంతో విరాట్‌‌ వీలైనంత ఎక్కువసేపు అనుష్కతో గడిపాడు. అయితే ఎప్పుడూ బీసీసీఐ మైక్‌‌తో సహచర ప్లేయర్ల ఇంటర్వ్యూ  చేసే చహల్‌‌ ఈ ట్రిప్‌‌లో లేకపోవడంతో ఈసారి షమీ ఆ బాధ్యత తీసుకున్నాడు. మీ ఎక్స్‌‌పీరియెన్స్‌‌ ఎలా ఉందంటూ పుజారాను ఇంటర్వ్యూ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బీసీసీఐ ట్విట్టర్‌‌లో పోస్ట్‌‌ చేసింది.

న్యూజిలాండ్‌‌ ఎలెవెన్‌‌ : డారెల్‌‌ మిచెల్‌‌ (కెప్టెన్‌‌), ఫిన్‌‌ అలెన్‌‌, టామ్‌‌ బ్రూస్‌‌, డేన్‌‌ క్లీవర్‌‌, హెన్రీ కూపర్‌‌, స్కాట్‌‌ కుగెలిన్‌‌, జేమ్స్‌‌ నీషమ్‌‌, రచిన్‌‌ రవీంద్ర, టిమ్‌‌ సీఫర్ట్‌‌, ఇష్‌‌ సోధీ, బ్లెయిర్‌‌ టిక్నర్‌‌, విల్‌‌ యంగ్‌‌, జాక్‌‌ గిబ్సన్‌‌, స్కాట్‌‌ జాన్సటన్‌‌.

Latest Updates