పెళ్లయిన 19 రోజులకే.. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

కామారెడ్డి, వెలుగు: పెళ్లయిన 19 రోజులకే పెళ్లికొడుకు రోడ్డుప్రమాదంలో చనిపోయాడు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ మాకులపేట గ్రామాల బుధవారం రాత్రి మధ్య కల్వర్టును ఢీకొని కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కామారెడ్డి జిల్లాకేంద్రంలోని శివాజీరోడ్డుకు చెందిన గంటా భాస్కర్​ (28) చనిపోయాడు. కామారెడ్డి ప్రాంతానికే చెందిన యువతితో భాస్కర్​కు ఇటీవలే పెళ్లయ్యింది. ఎలక్ర్టిషియన్​గా పని చేసే భాస్కర్ లాక్​డౌన్​, పెళ్లి పనుల వల్ల చాలాకాలంగా బయటకు వెళ్లలేదు. బుధవారం ఉదయం భాస్కర్​ స్నేహితులతో కలిసి కారులో మంచిర్యాల జిల్లాకు వెళ్లారు. ఒక ఫ్రెండ్​ను దింపేందుకు ఖానాపూర్​ వెళ్తుండగా మార్గమధ్యంలో కారు ప్రమాదానికి గురైంది. కారును డ్రైవర్​ క్రిష్ణ అతి వేగంగా నడుపగా ఇరుకు వంతెనకు డీకొట్టి ఫల్టీలు కొట్టిందని ఎస్సై శ్రీకాంత్​ తెలిపారు. ఐదుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రికి తరలిస్తుండగానే భాస్కర్​ చనిపోయాడు. అతని స్నేహితులు బింగి నరేశ్​, చందు, క్రిష్ణ, ఆనంత్​ చికిత్స పొందుతున్నారు. ఇటివలనే పెళ్లి జరిగిన యువకుడు రోడ్డు ప్రమాదంతో చనిపోవటంతో రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.

Latest Updates