ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు గుడ్‌‌న్యూస్.. 91 వేల మంది ఫ్రెషర్స్‌కు చాన్స్

న్యూఢిల్లీ: ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు శుభవార్త. దేశంలో ఇంజనీరింగ్ చేసిన యువకులకు నాలుగు టాప్ ఐటీ కంపెనీలు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించనున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌‌సీఎల్‌‌తోపాటు విప్రో సంస్థలు కలిపి 91 వేల మంది ఫ్రెషర్స్‌ను తీసుకోవడానికి సిద్ధమవుతున్నాయి. లాక్‌‌డౌన్ తర్వాత పరిస్థితులు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుండటంతో కంపెనీలకు అదనపు ఉద్యోగుల అవసరం ఏర్పడింది.

ఈ విషయంపై సదరు ఐటీ కంపెనీల హెచ్‌ఆర్‌లు స్పందించారు. గత ఏడాది సమయంలో తమ సంస్థలో 40 వేల మంది ఫ్రెషర్స్‌‌ను తీసుకున్నామని.. ఈ ఏడాది కూడా అంతే సంఖ్యలో కొత్త వారిని తీసుకునే అవకాశాలు ఉన్నాయని టీసీఎస్ హెచ్‌‌ఆర్ హెడ్ మిలింద్ లక్కఢ్ తెలిపారు. ఈ సంవత్సరం భారత్‌‌లో 24 వేల మంది ఫ్రెషర్స్‌‌ను సెలెక్ట్ చేసుకుంటామని ఇన్ఫోసిస్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం తమ కంపెనీ అనుకున్న లక్ష్యం కంటే బాగా వృద్ధిలో ఉందని, కొత్త ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటామని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ హెచ్‌ఆర్ వి.వి.అప్పారావు చెప్పారు. ఈ ఏడాది ఆఖరులోపు 15 వేల మంది ఫ్రెషర్స్‌ను రిక్రూట్ చేసుకుంటామని పేర్కొన్నారు.

Latest Updates