సత్తుపల్లి ఓపెన్‌కాస్ట్‌ మైనింగ్ కాలుష్యంపై ఎన్‌జీటీ విచార‌ణ‌

రాష్ట్రంలోని ఖ‌మ్మం జిల్లా సత్తుపల్లి లో ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల వల్ల ఉత్పన్నమయ్యే కాలుష్యం పై ఎన్‌జీటీ చెన్నై బెంచ్ మంగ‌ళ‌వారం విచారణ జరిపింది. సత్తుపల్లిలోని ఎన్.టి.ఆర్ కాలనీ వాసి బానోతు నందు నాయక్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని ద్విసభ్య బెంచ్ విచారించింది. నందు నాయక్ ఫిర్యాదు పై జిల్లా కలెక్టర్ గత ఏడాది జూన్ లో విచారణ జరిపించినా కమిటీ సిఫార్సులను అమలు చేయలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ వివరించారు.

సింగరేణి బొగ్గు గనుల్లో పేలుళ్ల వల్ల ఎన్టిఆర్ కాలనీ లో 700 ఇళ్లు దెబ్బతిన్నాయని.. వాయు, శబ్దం కాలుష్యం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని పేర్కొన్నారు. జలగం వెంగళరావు ఓపెన్ కాస్ట్ మైన్ లో కొంత భాగం బొగ్గు ఉత్పత్తి ఆపివేసినా.. మైన్ క్లోజింగ్ ప్లాన్ అమలు చేయలేదని వివరించారు.

పిటిషనర్ వాదన విన్న బెంచ్ కేంద్ర పర్యావరణ శాఖ, తెలంగాణ ప్రభుత్వం, సింగరేణి కాలరీస్ సంస్థ, ఖమ్మం జిల్లా కలెక్టర్లకు నోటీసు జారీ చేసింది. సత్తుపల్లి ఓపెన్ కాస్ట్ మైన్ లో ఉత్పన్నమయ్యే పరిస్థితులు తెలుసుకునేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో కేంద్ర పర్యావరణ శాఖ, తెలంగాణ పర్యావరణ శాఖ, తెలంగాణ గనుల శాఖ, డైరెక్టర్ ఆఫ్ ఎక్స్‌ప్లోసివ్స్ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారని తెలిపిన ఎన్‌జీటీ చెన్నై బెంచ్‌.. కమిటీ సమన్వయ బాధ్యతను కేంద్ర పర్యావరణ శాఖ చెన్నై ప్రాంతీయ అధికారికి అప్పగించింది. ఇందుకు సంబంధించిన నివేదికను నవంబర్ 9లోగా అందించాలని ఆదేశించించింది.

 

Latest Updates