ఎన్ కౌంటర్ పై ఎన్​హెచ్​ఆర్సీ ఎంక్వైరీ పూర్తి

  • ప్రిలిమినరీ రిపోర్ట్‌‌ రెడీ.. నేడు ఢిల్లీకి కమిషన్‌‌​ సభ్యులు

హైదరాబాద్, వెలుగు: వెటర్నరీ డాక్టర్​ ‘దిశ’అత్యాచారం, హత్య కేసు నిందితుల ఎన్​కౌంటర్​పై నేషనల్​ హ్యూమన్ ​రైట్స్ ​కమిషన్(ఎన్ హెచ్ఆర్సీ) ఎంక్వైరీ ముగిసింది. నాలుగో రోజైన మంగళవారం షాద్ నగర్, శంషాబాద్, సైబరాబాద్​ పోలీసుల నుంచి ఎన్​హెచ్ఆర్సీ టీమ్​ కీలక వివరాలు రాబట్టింది. ‘దిశ’ కేసును మొదటి నుంచి దర్యాప్తు చేసిన షాద్ నగర్ ఇన్ స్పెక్టర్ శ్రీధర్ కుమార్, ఏసీపీ వి.సురేంద్ర కమిషన్ ముందు హాజరయ్యారు. నిందితుల డెడ్​బాడీలకు పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ల టీమ్ ను, రిమాండ్ కేస్ డైరీలో పేర్కొన్న సాక్షులు, శంషాబాద్, షాద్ నగర్ లో ఆ రోజు నైట్ పెట్రోలింగ్ లో ఉన్న పోలీస్ సిబ్బందిని, నిందితులకు పెట్రోల్ పోసిన బంక్ క్యాషియర్ ను కమిషన్ సభ్యులు విచారించారు. అందరి నుంచి తీసుకున్న వివరాల ఆధారంగా ప్రాథమిక నివేదికను రెడీ చేసినట్టు సమాచారం. నేడు ఢిల్లీ చేరుకోనున్న కమిషన్​ సభ్యులు.. అన్ని అంశాలను పరిశీలించి సైబరాబాద్​ సీపీ సజ్జనార్, శంషాబాద్​ డీసీపీ ప్రకాశ్​రెడ్డి, షాద్​నగర్​ ఏసీపీ సురేంద్ర నుంచి మరోసారి వివరణ కోరే అవకాశం ఉంది. ఢిల్లీ నుంచి వచ్చిన మరో నలుగురు సభ్యుల టీమ్​ నాలుగు రోజులుగా సేకరించిన వివరాలను పరిశీలించింది. కాగా, బుధవారం సుప్రీంకోర్టులో ఎన్​కౌంటర్​ కేసు విచారణ ఉన్నందున సైబరాబాద్​ సీపీ సజ్జనార్​ ఢిల్లీ వెళ్లారు.

కీలక ఆధారాల సేకరణ

రాష్ట్ర పోలీస్ అకాడమీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యాలయంలో షాద్ నగర్, శంషాబాద్, సైబరాబాద్​ పోలీసులను కమిషన్ సభ్యులు విచారించారు. ‘దిశ’అత్యాచారం, హత్యపై శంషాబాద్, షాద్ నగర్ పోలీస్ స్టేషన్లలో నమోదైన మిస్సింగ్, హత్య కేసుల దర్యాప్తుతోపాటు నిందితుల ఎన్​కౌంటర్​పై షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఎఫ్ఐఆర్ వివరాలను, ఇన్వెస్టిగేషన్ లో స్వాధీనం చేసుకున్న సీసీటీవీ ఫుటేజ్, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్, లారీ క్యాబిన్ లో సేకరించిన బ్లడ్ శాంపిల్స్ నివేదికలను కమిషన్​ సభ్యులు స్టడీ చేశారు. నిందితులు మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు ‘దిశ’ను ట్రాప్ చేసిన డిజిటల్ ఎవిడెన్స్ తోపాటు సీన్ రీ కన్‌‌స్ట్రక్షన్‌‌లో సేకరించిన ఆధారాల డ్రాఫ్ట్ ను, అత్యాచారం జరిగిన రోజు నిందితుల మినిట్ టు మినిట్ మూవ్ మెంట్స్ పై రూపొందించిన కేస్ డాక్యుమెంట్లను పరిశీలించారు. ఈ ఎన్ కౌంటర్ లో 2014లో సుప్రీంకోర్టు రూపొందించిన 16 గైడ్​లైన్స్​ను పాటించలేదని ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలిసింది. ఎన్ కౌంటర్ లో చనిపోయిన నలుగురు నిందితులు కరడుగట్టిన నేరగాళ్లు అనడానికి.. వాళ్లపై ఉన్న కేసుల వివరాలు, వాటికి ఆధారాలు అడిగినట్లు సమాచారం. నిందితుల కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం అందరి వయసు 18 ఏండ్లే ఉంటుందని కమిషన్ సభ్యులు భావిస్తున్నట్టు తెలిసింది.

ముళ్లపొదల్లోకే ఎందుకు పారిపోయారు?

మంగళవారం ఎన్‌‌కౌంటర్ సీన్ ఆఫ్ అఫెన్స్​ను పరిశీలించిన కమిషన్ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేసినట్టు తెలిసింది. నిందితులు పారిపోయిన రూట్ అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించినట్టు సమాచారం. అండర్​ పాస్​ బ్రిడ్జికి పక్కనే ఉన్న వ్యవసాయ స్థలానికి ఇరువైపులా కిలోమీటర్ వరకు ఫెన్సింగ్ ఉండి బ్రిడ్జి వద్దే లేకపోవడంపై పోలీసుల నుంచి వివరాలు సేకరించినట్లు తెలిసింది. నిందితులు వెపన్స్ తో బెదిరిస్తూ రోడ్డు వైపు కాకుండా చెప్పులు లేకుండా 300 మీటర్లు ముళ్లపొదల్లోకి ఎందుకు పరుగెత్తారని ప్రశ్నించినట్లు సమాచారం. ఎస్సై, కానిస్టేబుల్ గాయాలు అనుమానాస్పదంగా ఉన్నట్లు కమిషన్​ సభ్యులు భావిస్తున్న తెలిసింది. రాళ్లు, కర్రల దాడిలో దెబ్బలు తగిలితే ఐసీయూ ట్రీట్ మెంట్ చేయాల్సిన అవసరం ఏమిటని డాక్టర్ల నుంచి వివరాలు సేకరించినట్లు సమాచారం. ఆరిఫ్, చిన్నకేశవులు చేతుల్లో గన్స్​అలాగే ఎందుకున్నాయి? అంత దూరం నుంచి కాల్చితే గన్స్​పడిపోవాలి కదా? అనే వివరాలు సేకరించినట్టు సమాచారం.

డెడ్బాడీల్లో బుల్లెట్ల గురించి ఆరా

ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశంలో పడి ఉన్న డెడ్ బాడీస్, మహబూబ్ నగర్ జిల్లా డాక్టర్లు అందించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా నిందితుల శరీరాల్లో నుంచి దూసుకుపోయిన బుల్లెట్ల గురించి కమిషన్​ సభ్యులు ఆరా తీసినట్లు సమాచారం. అందరికీ ఒకేలా కడుపు, ఛాతీ, శరీరంలోని ఎడమ, కుడివైపు భాగాల్లో బుల్లెట్లు దూసుకెళ్లిన తీరు, డెడ్​బాడీల్లో ఒక్క బుల్లెట్ కూడా లభించకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఎంత దూరం నుంచి షూట్ చేస్తే శరీర భాగాలను చీల్చుతూ బుల్లెట్లు బయటకు దూసుకువెళ్తాయో ఎఫ్ఎస్ఎల్ నివేదికల ఆధారంగా వివరాలు సేకరించినట్లు సమాచారం.

 

Latest Updates