రాంచి ఐఐఎంలో పాఠాలు చెబుతున్న వాచ్​మెన్​

రాంచి ఐఐఎంలో పాఠాలు చెబుతున్న వాచ్​మెన్​

రంజిత్​ రామచంద్రన్​ రాంచి ఐఐఎంలో అసిస్టెంట్​ ప్రొఫెసర్​ ఉద్యోగానికి ఈ మధ్యనే సెలక్ట్ అయ్యాడు. ఆ ఉద్యోగానికి సెలక్ట్ అయిన ఆనందంలో తను పడిన కష్టాలను గుర్తు చేసుకుంటూ సోషల్​ మీడియాలో 
ఒక పోస్ట్​ చేశాడు. ఆ పోస్ట్ చదివి ఎంతోమంది అయ్యో.. అనుకుంటూనే ‘శభాష’ని మెచ్చుకున్నారు కూడా. అక్కడితో ఆగకుండా ఆ పోస్ట్​ను చాలా మందికి షేర్​ చేశారు. ఇంతకూ రంజిత్​ చెప్పిన కథేమిటి? ఆయన పడ్డకష్టాలేమిటి? 
రంజిత్​ కాసర్​గఢ్​​ జిల్లాలోని పనతూర్​ అనే పల్లెటూళ్లో పుట్టి పెరిగాడు. ఆ ఊళ్లో ఇప్పటికీ ఒక చిన్న గుడిసెల ఉంటాడు. మట్టి, ఇటుకలతో కట్టి ప్లాస్టర్​ చేయని గోడలు.. వానొస్తే కురిసే కప్పుపై కప్పిన టార్పాలిన్​తో ఉన్న గుడిసె ఫొటోని కూడ ఫేస్​బుక్​లో షేర్​ చేశాడు. 

తమ్ముడు.. చెల్లి చదువుల కోసం

రంజిత్​ వాళ్ల నాన్న రామచంద్రన్​ టైలర్​. వాళ్లమ్మ బేబీ ‘జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ కూలి పనులకు పోయేది. ముగ్గురు పిల్లల్లో రంజిత్​ పెద్దవాడు. పెద్దవాడు కాబట్టి రంజిత్​ మీద ఇంటి బాధ్యతలు పడేవి. పెద్ద చదువులు చదవాలన్న కోరికతో ఉన్న రంజిత్​ ఆర్థిక సమస్యల వల్ల చదువుని మధ్యలోనే ఆపాల్సి వచ్చింది. స్కూల్​ ఎడ్యుకేషన్​ అయిపోయిన తర్వాత ఇంటిని నడిపే భారం మీదేసుకుని కొంతకాలం చిన్న చిన్న పనులు చేశాడు. తమ్ముడు, చెల్లెలి చదువుకు ఇబ్బంది లేకుండా ఉండాలని తాను నైట్​ వాచ్​మెన్​ జాబ్​లో చేరాడు. బీఎస్​ఎన్​ఎల్​ ఎక్స్ఛేంజ్ దగ్గర వాచ్​మెన్​ డ్యూటీ చేస్తే నెలకు నాలుగు వేల రూపాయలు ఇచ్చేవాళ్లు. కొన్నాళ్ల తర్వాత కాలేజీలో చేరాడు. ఆ కాలేజీ నుంచి వాళ్ల ఇంటికి పోకుండా నేరుగా బీఎస్​ఎన్​ఎల్​ టెలిఫోన్​ ఎక్స్ఛేంజ్ ఆఫీస్​కి పొయ్యి, ఆ రాత్రంతా అక్కడ డ్యూటీ చేసి తెల్లవారగానే ఇంటికిపోయేవాడు. ఇట్ల అయిదేళ్లు కష్టపడి పీజీ దాకా చదివిండు.
 
ఇంగ్లీష్​ రానప్పుడు...

రంజిత్​ పోస్ట్​ గ్రాడ్యుయేషన్​ని కాసరగఢ్​​లోని కేరళ సెంట్రల్​ యూనివర్సిటీలో చదివాడు. పీజీ అయిపోయినంక ఐఐటీ మద్రాస్​లో పీహెచ్​డీ చేయడానికి పోయిండు. తనకు ఇంగ్లీష్​ అంత బాగా రాదు. భాష సమస్యతో చదువు వదిలేసి మళ్లీ కాసరగఢ్​​కి పోవాలనుకున్నాడు.  ఆ టైమ్​లో తన గైడ్​ ప్రొఫెసర్​ సుభాష్​, ప్రొఫెసర్​ వైదేహి తనను ఎంకరేజ్​ చేసి, సపోర్ట్​చేశారు. వాళ్ల సాయంతో ఇంగ్లీష్​ నేర్చుకుంటూ, రీసెర్చి చేశాడు. ఏడాది క్రితం ఎకనామిక్స్​లో పీహెచ్​డీ పూర్తి చేసిండు. ఆ డిగ్రీ సాధించిన 90 రోజుల్లోనే ఐఐఎం రాంచిలో అసిస్టెంట్​ ప్రొఫెసర్​ జాబ్​ వచ్చింది. ఈ మధ్య కాలంలో బెంగళూరులోని ‘క్రిస్టీ యూనివర్సిటీ’లో రెండు నెలలపాటు అసిస్టెంట్​ ప్రొఫెసర్​గా జాబ్​ చేశాడు. ఎస్టీ కులంలో పుట్టిన రంజిత్​ తన చదువుల కోసం ఎన్నడూ రిజర్వేషన్​ వాడుకోలేదు. మరొకరికి ఆ రిజర్వేషన్​ వాడుకునే అవకాశం కల్పిస్తూ కష్టపడిన రంజిత్​​ విజయం  పేద విద్యార్థులకు ఒక పాఠం.