చాలా భయపడ్డ.. నిద్రలేని రాత్రులు గడిపా!

హీరో పాత్రకి ఎన్ని సమస్యలున్నాయో… సినిమాకి కూడా అన్ని సమస్యలు ఎదురయ్యాయి. మొదట ‘ముద్ర’ అనే టైటిల్ విషయంలో సమస్య. పేరు మార్చాం తర్వాత రిలీజ్ ఆలస్య మైంది. నిర్మాతకి, థియేటర్స్‌‌కి మధ్య గల వ్యక్తుల వల్ల సమస్యలొచ్చాయి. మా సినిమాని మరొకరెవరో తాకట్టు పెడితే ఏమీ చేయలేకపోయాం.  ఒక వ్యక్తికి సంబంధించిన ఆర్థిక ఇబ్బందుల ప్రభావం మా సినిమాపై పడింది. అన్ని సమస్యలనూ ఎదుర్కొని బయటికొస్తోంది.  నిర్మాతని దృష్టిలో ఉంచుకుని సగం రెమ్యూనరేషనే తీసుకున్నా.

  • నేనింతవరకూ యూత్‌‌కి, ఫ్యామిలీకి కనెక్టయ్యే సినిమాలు చేశాను. ఇలాంటి సందేశాత్మక చిత్రంలో నటించలేదు. ఇది ఒక జర్నలిస్ట్ కథ. ఈ కథలో ఎంతో నిజాయితీ ఉంది.  ప్రీ రిలీజ్‌‌ ఫంక్షన్​లో చిరంజీవి గారు చెప్పినట్టు ఎడ్యుకేషన్ అండ్ ఎంటర్‌‌‌‌టైన్మెంట్ కలగలిసిన మూవీ.
  • ఫేక్ సర్టిఫికెట్స్ అనేది చిన్న పాయింట్ మాత్రమే. ప్రధాన కథ విద్యార్థుల సమస్యలపై ఉంటుంది. యేటా పదిహేను లక్షల మంది యూనివర్సిటీ నుండి బయటికొస్తున్నారు.  అందులో ఆరు లక్షల మందికి మాత్రమే ఉద్యోగాలు దొరుకుతున్నాయి. మిగతా వారికి ఎందుకు జాబ్స్ లభించట్లేదనే విషయాన్ని చర్చించాం.
  • ఇది తమిళంలో హిట్టయిన ‘కనిదన్’కి రీమేక్. ఆ సినిమా సీరియస్‌‌గా ఉంటుంది. ఇందులో ఎంటర్‌‌‌‌టైన్మెంట్ ఎక్కువ. మెయిన్​ పాయింట్ మాత్రమే తీసుకుని చాలా మార్పులు చేశాం. దర్శకుడు పని రాక్షసుడు. మనకి దెబ్బ తగిలినా పర్లేదు.. తనకు కావాల్సినట్టు షాట్ రావాలి. ఓ చెంపదెబ్బ సీన్ నాపై ముప్ఫై ఆరు సార్లు తీశాడు. అలాంటి దర్శకుల వల్లే యాక్టర్స్​ పెర్ఫార్మెన్స్ మెరుగుపడుతుంది.
  • రీమేక్స్‌‌లో క్యారెక్టర్ డ్రైవెన్, ప్లాట్ డ్రైవెన్ అని రెండు రకాలుంటాయి. క్యారెక్టర్ డ్రైవెన్ రీమేక్స్‌‌లో ఆ మూమెంట్స్‌‌ని రీ క్రియేట్ చేయడం చాలా కష్టం. హ్యాపీడేస్, బెంగళూర్ డేస్, కిరాక్ పార్టీ అలాంటి సినిమాలు. కానీ దృశ్యం, పోకిరి లాంటి  ప్లాట్ డ్రైవెన్ రీమేక్స్ ఎక్కడ తీసినా హిట్టవుతాయి. ఇది ప్లాట్ డ్రైవెన్ రీమేక్. ఇప్పటికీ చాలా రీమేక్ కథలు నా దగ్గరికొస్తున్నాయి. కానీ నా కెరీర్ లో ఇదే లాస్ట్ రీమేక్. ఇకపై చేయదలచుకోలేదు.
  • మే నెలలో విడుదల కావాల్సిన చిత్రం ఇన్ని నెలలు ఆలస్యమైందంటే మానసికంగా, శారీరకంగా  ఆ ప్రభావం తప్పకుండా ఉంటుంది. ఈ సినిమా విషయంలో ఏడ్చినంత పనైంది. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. నా కెరీర్‌‌‌‌లో చిత్రీకరణ ఆలస్యమైన సినిమాలున్నాయి తప్ప.. సినిమా రిలీజ్ కాకపోవచ్చేమో అనే భయాన్ని ఎదుర్కొన్నది మాత్రం ఈ సినిమాకే.
  • కార్తికేయ సీక్వెల్ డిసెంబర్ 28 నుండి సెట్స్‌‌కి వెళ్తోంది. పీపుల్స్ ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ నిర్మాత. చందు మొండేటి దర్శకుడు. మైథలాజికల్ జానర్‌‌‌‌. రామరాజ్యం కనిపించే ఆసక్తికరమైన కథ. నార్త్ ఇండియాతో పాటు వియెత్నాం, కాంబోడియాలోనూ తీస్తాం. ‘శ్వాస’ కథ నాకు చెప్పినప్పుడు ఒకలా ఉంది. కథా విస్తరణలో కంటెంట్ మారిపోయింది. దాంతో నాకు కరెక్ట్ కాదనిపించింది. అదే నిర్మాతతో రోబోటిక్స్ నేపథ్యంలో ‘హనుమాన్’ సినిమా చేస్తున్నాను.  ఇద్దరు దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఎవరు చేస్తారనేది త్వరలో ప్రకటిస్తాం. గీతా ఆర్ట్స్‌‌లో వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో ఓ ఫ్యాంటసీ మూవీ చేయబోతున్నాను. ఈ మూడూ గతంలో ఎప్పుడూ రాని కథలు. ఇప్పటివరకూ ఏడాదికో సినిమా చేశాను. కానీ వచ్చే ఏడాది మూడు సినిమాలు చేస్తున్నాను.

Latest Updates