కమ్యూనిటీ స్ర్పెడ్ పై 3 జిల్లాల్లో ర్యాపిడ్ సర్వే

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: కరోనా కమ్యూనిటీ స్ర్పెడ్ అయిందా?  లేదా?  తెలుసుకునేందుకు రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో నేషనల్ ఇనిస్టిట్యూట్‌‌‌‌ ఆఫ్ న్యూట్రిషన్‌‌‌‌ (ఎన్‌‌‌‌ఐఎన్‌‌‌‌) శాస్త్రవేత్తలు సర్వే చేయనున్నారు. ఇందుకోసం జనగామ, నల్గొండ, కామారెడ్డి జిల్లాలను ఎంచుకున్నారు. ఈ మూడు జిల్లాల్లో సర్వే చేసేందుకు అనుమతినిస్తూ ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్‌‌‌‌ శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్‌‌‌‌ఐఎన్‌‌‌‌ చేస్తున్న సర్వేకు సహకరించాలని, అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆ మూడు జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇండియన్  కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్‌‌‌‌ సూచన మేరకు ఈ సర్వే చేస్తున్నట్టు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌‌‌‌ న్యూట్రిషన్‌‌‌‌ శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. దేశవ్యాప్తంగా ఐసీఎంఆర్‌‌‌‌‌‌‌‌ చేస్తున్న సర్వేలో ఇదీ ఒక భాగమని చెప్పారు. శుక్రవారం నుంచి సర్వే ప్రారంభించనున్నట్టు వెల్లడించారు.

సర్వే ఇలా చేస్తారు..

సర్వే ఎలా చేయాలన్నదానిపై ఐసీఎంఆర్‌‌‌‌‌‌‌‌ కొన్ని గైడ్‌‌‌‌లైన్స్  ఇచ్చింది. దీని ప్రకారం ర్యాండమ్‌‌‌‌గా ఒక్కో జిల్లాలో 400 మందికి టెస్టులు చేస్తారు. ఒకటి లేదా రెండ్రోజుల్లోనే ఈ సర్వే పూర్తి చేయాలి. ఆయా జిల్లాల్లో పట్టణ ప్రాంతాల్లో 200 మందికి, గ్రామీణ ప్రాంతాల్లో  200 మందికి టెస్టులు చేస్తారు. తొలుత ఒక్కో జిల్లాలో పది క్లస్టర్ల (గ్రామం లేదా వార్డు)ను ఎంపిక చేసి ప్రతి క్లస్టర్లో 40 మందికి టెస్ట్ చేస్తారు. క్లస్టర్‌‌‌‌‌‌‌‌లో ఒకే చోట టెస్టులు చేయకుండా, 4 వేర్వేరు ప్రాంతాల్ని ఎంచుకుంటారు. ఒక్కో ప్రాంతంలో ఇంటికొకరు చొప్పున పది మందికి టెస్ట్ చేస్తారు. ఇలా మొత్తం 10 క్లస్టర్లలో, 400 మందిని ఎంపిక చేసి టెస్ట్ చేస్తారు. వీళ్లలో ఆడాళ్లు, మగవాళ్లతోపాటు రకరకాల వృత్తుల వాళ్లు ఉండేలా చూసుకుంటారు.

ఎక్కడికక్కడే టెస్టులు

కరోనా నిర్దారణకు రాష్ట్రంలో ఇప్పటివరకూ ఆర్టీ పీసీఆర్‌‌‌‌‌‌‌‌ (రివర్స్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌స్క్రప్షన్‌‌‌‌ పాలిమరేజ్ చైన్ రియాక్షన్‌‌‌‌) టెస్టులు మాత్రమే చేస్తున్నారు. ఎన్‌‌‌‌ఐఎన్ సర్వేలో ర్యాపిడ్‌‌‌‌ డయాగ్నస్టిక్ టెస్టులు చేయాలని నిర్ణయించారు. దీన్నే సెరోలాజికల్ టెస్టు లేదా యాంటిబాడీ టెస్ట్‌‌‌‌ అంటారు. అందువల్ల ఈ సర్వేకు సెరో సర్వైలెన్స్‌‌‌‌గా పేరు పెట్టారు. ఎక్కడికక్కడే వ్యక్తుల రక్తాన్ని పరీక్షించి, పది నిమిషాల్లో ఫలితం తేలుస్తారు. ఈ పరీక్షలో ఆయా వ్యక్తుల రక్తంలో కరోనా యాండిబాడీస్‌‌‌‌ ఉన్నదీ, లేనిదీ తేలిపోతుంది. ఒకవేళ యాంటిబాడీస్ ఉంటే, ఆర్టీపీసీఆర్‌‌‌‌‌‌‌‌ టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తారు. సర్వేకు అవసరమైన 1500 యాంటిబాడీ టెస్ట్ కిట్లను ఎన్‌‌‌‌ఐఎన్‌‌‌‌కు ఐసీఎంఆర్ అందజేసింది. సర్వే చేయడానికి ఒక్కో జిల్లాలో 10 టీమ్‌‌‌‌లను ఏర్పాటు చేశారు. ఒక్కో టీమ్ 40 మందికి టెస్టులు చేయనుంది. టెస్టు రిజల్ట్‌‌‌‌ను ఎప్పటికప్పుడు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌ చేయనున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 25 రాష్ట్రాల్లోని 82 జిల్లాల్లో ఈ సర్వే చేస్తున్నారు. దేశంలో కరోనా కమ్యూనిటీ స్ర్పెడ్‌‌‌‌ అయిందా, లేదా తెలుసుకోవడమే ఈ సర్వే ఉద్దేశం.

 

Latest Updates