ధర్మ ప్రచారం : విదేశీయులకు ‘మహామండలేశ్వర్’ హోదా

వసంత పంచమి సందర్భంగా ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. ఆదివారం 2 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేస్తారని అంచనా. దేశం నలు మూలల నుంచి ప్రయాగ్ రాజ్ కు శనివారమే భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో రద్దీ విపరీతంగా పెరిగింది. కుంభమేళాలో మూడోది, చివరిదైన షాహీ స్నాన్ ను వసంతపంచమి రోజున చేసేందుకు భక్తులు క్యూ కట్టారు. భక్తుల రద్దీ పెరగడంతో యూపీ పోలీసులు, కేంద్ర రిజర్వ్ బలగాలు కుంభమేళా జరుగుతున్న ప్రాంతంలో మోహరించారు.

అర్ధ కుంభమేళాలో జనవరి 15న మకర సంక్రాంతి సందర్భంగా మొదటి పుణ్యస్నానం, ఫిబ్రవరి 4న మౌనీ అమావాస్య సందర్భంగా రెండో పుణ్యస్నానం, ఫిబ్రవరి 10న వసంత పంచమి సందర్భంగా చివరి పుణ్యస్నానం జరగనుంది. నదిలో మూడు మునకలు వేయడం ద్వారా.. గంగ, యమున, అంతర్వాహిని సరస్వతి నదుల్లో పుణ్యస్నానం చేసిన ఫలితం కలుగుతుందని భక్తుల విశ్వాసం.

9మంది విదేశీయులకు మహామండలేశ్వర్ హోదా

ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఒకేసారి 9 మంది విదేశీయులకు మహామండలేశ్వర్ హోదాను ప్రదానం చేసింది నిర్మోహి  అఖాడా. ఈ 9మంది వేర్వేరు దేశాలకు చెందినవారు. వీరిలో అమెరికా, జపాన్, ఇజ్రాయెల్ లకు చెందినవారున్నారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య మహామండలేశ్వర్ ప్రధానం జరిగింది. వీరంతా తమ జీవితం మొత్తాన్ని వైదిక ధర్మానికి అంకితం చేశారు. తమతమ దేశాలలో సనాతన ధర్మ ప్రచారం చేయనున్నారు.

Latest Updates