నిపా మహా డేంజర్‌‌: కేరళను వణికిస్తున్న వైరస్

nipa-too-danger-virus-outbreak-kerala

నిపా.. కేరళను వణికిస్తున్న డేంజర్ ​వైరస్​ ఇది. ప్రస్తుతం దీని చికిత్సకు మందులేదు. ఈ వైరస్​బారిన పడితే పడితే బతికి బట్టకట్టడం కష్టమే. గతేడాది కేరళలోనే  ఏకంగా 17 మంది ఈ వైరస్​ బారిన పడి చనిపోయారు. జంతువుల నుంచి మనుషులకు సోకే ఈ వైరస్.. ఒకరి నుంచి మరొకరికి కూడా వ్యాపిస్తుంది. తాజాగా కేరళలో నిపా వైరస్​ఉనికి బయటపడడంతో కేంద్రం అలర్ట్​అయ్యింది. వైరస్​వ్యాప్తిని అడ్డుకోవడానికి ఆరుగురు సభ్యుల ఎక్స్​పర్ట్​టీమ్​ను రాష్ట్రానికి పంపించింది. ఈ వైరస్​బాధితులను గుర్తించేందుకు కంట్రోల్​రూం ఏర్పాటు చేసింది. అనుమానితులను ప్రత్యేకంగా పరీక్షించేందుకు ఏర్పాట్లు చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ కేరళ ఆరోగ్య మంత్రి కేకే శైలజకు ఫోన్ చేసి తాజా పరిస్థితిని తెలుసుకున్నారు. కేంద్రం నుంచి అవసరమైన సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. వైరస్​వ్యాప్తి విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం గతేడాది ఈ వైరస్​తో 17 మంది చనిపోయారు. తాజాగా 23 ఏళ్ల ఓ కాలేజ్​స్టూడెంట్​కు నిపా వైరస్​సోకిందని డాక్టర్లు నిర్ధారించారు. మరో 311 మంది అనుమానితులను విడిగా ఉంచి పరీక్షిస్తున్నట్లు మంత్రి శైలజ చెప్పారు. వైరస్​సోకిన స్టూడెంట్​కు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని చెప్పారు. పూణెకు చెందిన నేషనల్​ఇనిస్టిట్యూట్​ఆఫ్​వైరాలజీకి చెందిన నిపుణుల బృందం స్టూడెంట్​ను పరీక్షిస్తోందన్నారు.

ఏమిటీ నిపా వైరస్​?..

గబ్బిలాల నుంచి కుక్క, పంది, గుర్రం వంటి జంతువులకు సోకే ప్రమాదకరమైన వైరస్​ఇది. జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. అరుదుగా కలుషిత ఆహారంతో, ఒకరి నుంచి ఇంకొకరికి కూడా వైరస్​వ్యాపించవచ్చు. వైరస్​సోకితే తీవ్రమైన అనారోగ్యం వచ్చి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.1998‌‌‌‌–99లో మలేషియాలోని సుంగై నిపా అనే ఊళ్లో ఈ వైరస్​ను మొదట గుర్తించడంతో దీనికా పేరు వచ్చింది.

వైరస్​ లక్షణాలు…

బ్రెయిన్​ఫీవర్, జ్వరంతో పాటు దగ్గు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. శ్వాసకోశ వ్యాధులు, తలనొప్పి, కండరాల నొప్పులు, వాంతులు, గొంతు నొప్పి, కళ్లు తిరగడం, నిద్ర మత్తు లాంటి లక్షణాలు కనిపిస్తాయి.కొన్ని కేసుల్లో వైరస్​బాధితులు న్యుమోనియాతో ఇబ్బంది పడడం గుర్తించినట్లు వరల్డ్​హెల్త్​ఆర్గనైజేషన్​వెల్లడించింది.

ఈ వైరస్​కు చికిత్స ఉందా?…

నిపా వైరస్​చికిత్సకంటూ ప్రత్యేకంగా ఎలాంటి మందులుకానీ, వైరస్​సోకకుండా ఎలాంటి వ్యాక్సిన్​కానీ లేవని వరల్డ్​హెల్త్​ఆర్గనైజేషన్​ప్రకటించింది. వ్యాధి తీవ్రత దృష్టిలో పెట్టుకొని చికిత్సకు మందును కనుగొనేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. లేబరేటరీలో జరిపిన పరీక్షల్లో రిబావిరిన్​అనే మందు దీనిపై ప్రభావం చూపిస్తుందని తేలినా.. మనుషులపై ప్రయోగాత్మకంగా ఇప్పటి వరకూ పరీక్షించి చూడలేదని సైంటిస్టులు చెబుతున్నారు.

ఇండియాలో..

మన దేశంలో 2001లో సిలిగురిలో ఈ వైరస్​తొలి సారిగా బయటపడింది. 66 మంది వైరస్​బారిన పడితే అందులో 45 మంది చనిపోయారు. మలేషియా, సింగపూర్, బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్, కేరళలో వైరస్​వ్యాపిస్తోంది. మిగతా ప్రాంతాల్లోనూ వైరస్​విస్తరించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాంబోడియా, చైనా, ఇండోనేషియా, మడగాస్కర్, తైవాన్, థాయ్​లాండ్​దేశాలకూ వైరస్​ముప్పు ఉందని వార్నింగ్​ఇచ్చారు.

వైరస్​ బారిన పడకుండా ఉండాలంటే..?

వైరస్​బాధితులను తాకితే చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. ఖర్జూరం, ఈత పళ్లను నేరుగా తీసుకోవద్దు. మిగతా పండ్లను కూడా శుభ్రంగా కడిగాకే తినాలి. ఈత కల్లుకు దూరంగా ఉండాలి.

Latest Updates