మంత్రిగా నిరంజన్ రెడ్డి.. వనపర్తి ప్రజల్లో ఆశలు

మంత్రిగా ప్రమాణం చేశారు నిరంజన్ రెడ్డి. వృత్తి రీత్యా న్యాయవాది. టీడీపీలో ఉన్న సమయంలో పోలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేసారు. తెలంగాణ ఆకాంక్షతో టీడీపీకి రాజీనామా చేసి కేసీఆర్ తో భుజం కలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలో టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీ పటిష్ఠత కోసం పనిచేశారు.

2009లో మహాకూటమి పొత్తులో భాగంగా కేసీఆర్ మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ కోసం.. వనపర్తి టికెట్ ను టీడీపీకి త్యాగం చేశారు. 2014లో మొదటిసారి శాసనసభకు పోటీచేసి ఓడిపోయారు. 2014 ఎన్నికలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన నిరంజన్ రెడ్డి.. సమర్ధతను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయనకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవిని ఇచ్చారు. 2018 ఎన్నికల్లో వనపర్తి నుంచి రికార్డు మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఉద్యమంలో వెంట నడిచిన నిరంజన్ రెడ్డికి మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించారు ముఖ్యమంత్రి.

నిరంజన్ రెడ్డికి మంత్రి పదవి దక్కడంతో.. గద్వాల మాచర్ల రైల్వే లైన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల విస్తరణ , మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, బైపాస్ రోడ్ లాంటి పలు అంశాలు వనపర్తి ప్రజల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి.

Latest Updates