పటియాల హౌస్ కోర్టుకు నిర్భయ దోషులు

నిర్భయ దోషులకు త్వరగా డెత్ వారెంట్ జారీ చేసి ఉరిశిక్ష అమలు చేయాలని నిర్భయ పేరెంట్స్ వేసిన పిటిషన్‌పై ఈ రోజు పటియాల హౌస్ కోర్టు విచారణ చేపట్టనుంది. భద్రతా కారణాల దృష్ట్యా నలుగురు దోషులను తీహార్ జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరు పరచనున్నారు. నవంబర్ 29న అడిషనల్ సెషన్స్ జడ్జి సతీష్ కుమార్ అరోరా ప్రొడక్షన్ వారెంట్ జారీ చేసి ఇవాళ కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించారు. అయితే తీహార్ జైలు నుంచి దోషులను బయటకు తీసుకొచ్చే పరిస్థితి లేదని, ప్రజల్లో ఆగ్రహం ఉందన్న కారణంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరపనున్నారు. నిర్భయ పేరెంట్స్ తరపున సీమా కుశ్వాహా వాదనలు వినిపించనున్నారు. సుప్రీం కోర్టు ఇప్పటికే మరణశిక్ష విధించిందని, మెర్సీ పిటిషన్లు కూడా తిరస్కరించారని, ఆలస్యం లేకుండా ఉరి శిక్ష అమలు చేయాలని వాదించనున్నారు. సుప్రీం కోర్టు మరణశిక్ష విధించి రెండున్నరేళ్లయిందని నిర్భయ తల్లి అంటున్నారు. అమ్మాయిలు అత్యాచారాలకు గురైనప్పుడు ఏ హక్కులూ ఉండవని, అదే శిక్ష విధించే సమయం రాగానే.. అన్ని మానవ హక్కులు గుర్తొస్తాయని విమర్శించారు. నిర్భయ ఘటన జరిగి ఏడేళ్లైనా వ్యవస్థలో ఏమాత్రం మార్పు రాలేదని నిర్భయ తల్లి అంటున్నారు.

మరోవైపు తనకు విధించిన మరణ శిక్షపై రివ్యూ చేయాలని దోషుల్లో ఒకరైన అక్షయ్ కుమార్ సింగ్ మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై డిసెంబర్ 17న అత్యున్నత న్యాయస్థానం విచారించనుంది. త్రిసభ్య ధర్మాసనం అక్షయ్ సింగ్ పిటిషన్ పై రివ్యూ చేయనుంది. అదే రోజు సుప్రీం తన ఆదేశాలు వెలువరించే అవకాశం ఉంది. ఒకవేళ రివ్యూ చేసేది లేదని, గత తీర్పే ఫైనల్ అని చెబితే… మరణ శిక్షకు రూట్ క్లియర్ అవుతుంది. అప్పటికే నిర్భయ దోషులకు అన్ని ఆప్షన్లు పూర్తవుతాయి. తీహార్ జైలులోనే దోషులను ఉరి తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బక్సర్ జైలు నుంచి ఉరి తాళ్లు కూడా ఆర్డర్ చేశారు. ఈ తాళ్లతో ఇప్పటి వరకు కోల్‌కత్తా అలీపూర్ జైలులో రేపిస్టు ధనుంజయ్ ఛటర్జీని ఉరి తీశారు. అఫ్జల్ గురు, అజ్మల్ కసబ్‌నూ ఈ తాళ్లతోనే ఉరి తీశారు. అయితే తీహార్ జైలులో ఒకే సమయంలో ఇద్దరికి మాత్రమే ఉరి వేసేలా చాంబర్ ఉంది. దీన్ని 1950లో నిర్మించారు. అయితే ఇద్దరికి ఒకసారి, మరో ఇద్దరికి ఆ తర్వాత శిక్ష విధించడం సాధ్యం కాదు. ఎందుకంటే మరో ఇద్దరి బిహేవియర్ చేంజెస్ ఉంటాయని, స్పృహ తప్పి పడిపోయినా.. శిక్ష అమలు సాధ్యం కాదని అంటున్నారు. అందుకే నలుగురినీ ఒకేసారి ఉరి తీసేలా ఏర్పాట్లు వేగంగా చేస్తున్నట్లు తెలిసింది.

కొత్త జైలు నిబంధనల ప్రకారం.. క్షమాభిక్ష పిటిషన్లు తిరస్కరించిన 14 రోజుల తర్వాతే మరణశిక్ష విధించాల్సి ఉంటుంది. దోషుల కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉరి తీస్తున్నారో సమాచారం ఇవ్వాలి. ఈ గ్యాప్‌లో కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. తమ వస్తువులను కుటుంబ సభ్యులకు అందజేసే ఛాన్స్ ఉంది. ఉరి వేసే ఒకరోజు ముందు దోషులు కోరుకున్న ఆహారం అందించాలి. వారు కోరుకుంటే ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని కొత్త జైలు నిబంధనలు చెబుతున్నాయి.

Latest Updates