నిర్భయ దోషులకు ఉరి అమలు

నిర్భయను 2012లో కిరాతకంగా అత్యాచారం చేసి.. ఆమె చావుకు కారణమైన నిర్భయ దోషులు వినయ్ శర్మ, పవన్ గుప్తా, అక్షయ్ థాకుర్, ముఖేష్ సింగ్‌లకు ఎట్టకేలకు శుక్రవారం ఉదయం 5 గంటల 30 నిమిషాలకు ఉరి శిక్ష అమలయింది. జైలు అధికారులు నలుగురినీ ఒకేసారి ఉరి తీశారు. తీహార్ జైలులోని రూం నెంబర్ 3లో నలుగురు దోషులకు శిక్షను అమలు చేశారు. ఆ సమయంలో ఉరి కంబం దగ్గర 48 గార్డులు విధి నిర్వహణలో ఉన్నారు. అంటే ఒక్కోక్క దోషికి 12 మంది గార్డులను ఏర్పాటు చేశారు. దోషులను ఉరి తీయడానికి ముందు డాక్టర్ల చేత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత ఉదయం 4 గంటలకు నలుగురికీ అల్పాహారం ఇచ్చారు. అయితే ఉరి తీసే ముందు దోషి వినయ్ శర్మ బోరున విలపించాడు. కాగా.. నలుగురు దోషులను ఒకేసారి ఉరితీయడం దేశ చరిత్రలోనే ఇదే మొదటిసారి. శిక్ష అమలు తర్వాత వైద్యులు దోషల మృతదేహాలను పరిశీలించి చనిపోయారని నిర్దారించారు. ఉదయం 8 గంటలకు వారి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఆ తర్వాత మృతదేహాలను వారి తల్లిదండ్రులకు అప్పగిస్తారు. నిర్భయ తల్లిదండ్రులు ఇన్నాళ్లకు తమకు న్యాయం జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. ఘటన జరిగిన 7 ఏళ్ల తర్వాత న్యాయం జరిగింది. తీహార్ జైలు బయట ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.

Latest Updates