అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించిన నిర్భయ దోషులు

నిర్భయ రేప్, మర్డర్ కేసు దోషులు ఉరి శిక్ష అమలును ఆలస్యం చేయడానికి కొత్త కొత్త దారులు వెతుక్కుంటున్నారు. దోషులందరికీ ఉన్న అన్నీ లీగల్ ఆప్షన్ల ముగిసిపోయాయి. క్యూరేటివ్ పిటిషన్లు, క్షమాభిక్ష, దానిపైనా సుప్రీం రివ్యూలు సహా అన్ని రిజెక్ట్ అయ్యాయి. ఇప్పటికే లీగల్ ఆప్షన్లను వాడుకునే పేరుతో మూడు సార్లు ఉరి వాయిదా పడింది. అన్ని ఆప్షన్లు ఇటీవలే ముగియడంతో ఢిల్లీలోని పటియాలా కోర్టు.. మార్చి 4న తాజాగా దోషులకు డెత్ వారెంట్ జారీ చేసింది. ఈ నెల 20న తెల్లావారుజాము 5.30 గంటలకు ఉరి తీయాలని తీహార్ జైలు అధికారులకు ఆదేశించింది. క్షమాభిక్ష సహా అన్ని దారులకు తెరపడడంతో వారికి ఇక ఉరి తప్పదనుకుంటున్న ఈ తరుణంలో ఓ వింత పిటిషన్‌ వేశారు ముగ్గురు దోషులు. అంతర్జాతీయ వివాదాలను తీర్చే న్యాయస్థానమైన ది హేగ్‌లోని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ (ఐసీజే)కు వెళ్లారు. తమ ఉరిపై స్టే విధించాలని కోరుతూ వినయ్ శర్మ, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్,  పిటిషన్ దాఖలు చేశారు.

2013లోనే ఉరి శిక్ష వేస్తూ తీర్పు..

2012 డిసెంబరు 16న ఢిల్లీలో ఓ యువతి (నిర్భయ)ని కిడ్నాప్ చేసి రన్నింగ్ బస్సులో ఆరుగురు కలిసి దారుణంగా రేప్ చేశారు. అత్యాచారం చేస్తూ పైశాచికంగా హింసించి.. రోడ్డుపై పడేసి పరారయ్యారు. ఆమె చికిత్స పొందుతూ 2012 డిసెంబరు 29న మరణించింది. ఈ కేసులో ఆరుగురు నిందితులు రామ్ సింగ్(33), ముకేష్ సింగ్(24), , వినయ్ శర్మ(22), పవన్ గుప్తా(20) , అక్షయ్ ఠాకూర్(29), మరో మైనర్ (17సంవత్సరాల 6నెలలు)ను పోలీసులు అరెస్టు చేశారు.

దోషిగా తేలినప్పటికీ మైనర్ జువైనల్ చట్టం ప్రకారం మూడు సంవత్సరాల జైలుశిక్షతో బయటపడ్డాడు. ప్రధాన నిందితుడు రామ్ సింగ్ 2013మార్చ్ 11న తీహార్ జైల్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన నలుగురు నిందితులైన ముకేష్ సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్ లకు ఉరిశిక్షే సరైందని ట్రయల్ కోర్టు 2013 సెప్టెంబర్ 13న తీర్పు చెప్పింది. 2017 మే 5న ట్రయల్ కోర్టు తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

ఉరి అమలులో జాప్యం.. దోషుల తరఫు లాయర్ చాలెంజ్

సుప్రీం తీర్పు తర్వాత దాదాపు రెండున్నరేళ్ల పాటు ఉరి శిక్ష అమలు ప్రక్రియలో కదలిక కనిపించలేదు. గత ఏడాది చివరిలో హైదరాబాద్‌లో దిశ అత్యాచారం, హత్య ఘటన తర్వాత దేశ వ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. నిర్భయ ఘటన జరిగి ఏడేళ్ల గడుస్తున్నా శిక్ష పడకపోవడంపై ఆందోళనలు జరగడంతో ఉరి అమలు ప్రాసెస్‌లో కదలిక వచ్చింది. ఆ తర్వాత కూడా లీగల్ ఆప్షన్లు వాడుకునే హక్కు అంటూ చట్టంలోని లూప్ హోల్స్ అడ్డంపెట్టుకుని దోషులు సాగదీత కుట్రలు స్టార్ట్ చేశారు. కోర్టుల్లో రోజుకో రకమైన పిటిషన్‌తో  జనవరి, ఫిబ్రవరి, మార్చి అంటూ ఇలా మూడు సార్లు ఉరి వాయిదా పడింది. అయితే వాళ్ల పిటిషన్ల విచారణ సందర్భంగా నిర్భయ తల్లి కోర్టులో న్యాయమూర్తి ఎదుట తన ఆవేదన వ్యక్తం చేస్తూ పలుమార్లు కంటతడి పెట్టుకుంది. దోషులకేనా హక్కులు.. బాధితులకు ఉండవా అంటూ త్వరగా ఉరి అమలు చేయాలని ప్రాధేయపడింది. ఆ తల్లి వేదనను చూసిన దోషుల తరఫు లాయర్ ఏపీ సింగ్ కోర్టు హాలులోనే ఆమెతో చాలెంజ్ చేశారు. జీవితకాలం వాళ్లకు ఉరి అమలు కాకుండా చూస్తానని సవాలు విసిరారు.

Latest Updates