బ్రీఫ్ కేస్ లేదు.. బ్రిటీష్ సంప్రదాయం తిరగరాసిన నిర్మల

బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి మహిళా ఆర్థిక శాఖ మంత్రిగా రికార్డుల కెక్కిన నిర్మల సీతారామన్ తనదైన మార్క్ చూపించారు. బ్రిటీష్ హయాం నుంచి వస్తున్న సంప్రదాయాన్ని ఆమె పక్కన పెట్టారు. భారతీయ సంప్రదాయం ప్రకారం కొత్త పద్ధతి ఫాలో అయ్యారు.

సాధారణంగా ఆర్థిక మంత్రి .. బడ్జెట్ పేపర్లను బ్రీఫ్ కేసులో తీసుకుని వస్తుంటారు. పార్లమెంట్ భవనం ముందు ఫొటోలకు పోజులిస్తుంటారు. ఐతే.. మంత్రి నిర్మల సీతారామన్ బ్రీఫ్ కేసు తీసుకురాలేదు. ఎరుపు రంగు కవర్ లో డాక్యుమెంట్లను ఫోల్డ్ చేసి తీసుకొచ్చారు. అధికారులతో కలిసి ఫొటోలు దిగారు.

నిర్మల చేతిలో బ్రీఫ్ కేసు లేకపోవడంపై ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారు కృష్ణమూర్తి సుబ్రహ్మణియన్ స్పందించారు. ఆమె చేతిలో బడ్జెట్ లేదని.. అది లెడ్జర్ అని అన్నారు. బ్రీఫ్ కేస్ అనేది బ్రిటీష్ సంప్రదాయమనీ.. భారత్ విముక్తిని తెలిపేలా, భారత సంప్రదాయమైన ఫోల్డర్ లో డాక్యుమెంట్లు తీసుకుని వచ్చారని చెప్పారు.

బడ్జెట్ ప్రసంగంలో ఏ శాఖకు ఎన్ని కేటాయింపులు జరిగాయన్నది కూడా ఈసారి వివరించలేదు నిర్మల సీతారామన్. తమ ప్రభుత్వ ప్రాధాన్యాలు, వడ్డీరేట్లు, పన్ను మినహాయింపులకు సంబంధించిన కీలకమైన కొన్ని ప్రకటనలు చేశారు. ఐతే.. బడ్జెట్ ప్రసంగం తర్వాత… శాఖల వారీగా కేటాయింపుల వివరాలు ప్రత్యేకంగా మీడియా, ప్రెస్ ప్రతినిధులకు అందించారు అధికారులు.

Latest Updates