ఇందిరమ్మ తర్వాత నిర్మలమ్మే

కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళ

న్యూఢిల్లీ: పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన రెండో మహిళగా నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించారు. 1970–71లో ప్రధాని హోదాలో ఇందిరా గాంధీ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ మొరార్జీ దేశాయ్ రాజీనామా చేయడంతో ఆమె బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 50 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ అవకాశం నిర్మలా సీతారామన్ కే దక్కింది. అంతకుముందు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేబినెట్ బడ్జెట్ ను ఆమోదించింది. బడ్జెట్ ప్రసంగానికి ముందు యూనియన్ బడ్జెట్ కాపీని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఆమె అందజేశారు. 1991లో ఆర్థిక సంస్కరణకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన 29వ బడ్జెట్ ఇది. అంతకుముందు ఆరుగురు ఆర్థిక మంత్రులు మన్మోహన్ సింగ్ (1991–1996), యశ్వంత్ సిన్హా (1998–2003), జశ్వంత్ సింగ్ (2003–2004), పి. చిదంబరం (1996–1998, 2004–2009, 2013–2014), ప్రణబ్ ముఖర్జీ (2009–2013), అరుణ్ జైట్లీ 2014–2019)  మొత్తం 28 బడ్జెట్ లను ప్రవేశపెట్టారు. వీరిలో చిదంబరం ఏకంగా ఎనిమిది బడ్జెట్ లను ప్రవేశపెట్టారు. మన్మోహన్ సింగ్, యశ్వంత్ సిన్హా, అరుణ్ జైట్లీ ఐదేసి చొప్పున ప్రవేశపెట్టారు.  ప్రణబ్ ముఖర్జీ నాలుగు బడ్జెట్ లను ప్రవేశపెట్టారు. జశ్వంత్ సింగ్ కు ఒకే ఒకసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం దొరికింది. నరేంద్ర మోడీ ప్రభుత్వ తొలి టర్మ్ లో మొత్తం ఐదు బడ్జెట్ లను అరుణ్ జైట్లీనే ప్రవేశపెట్టారు. అయితే  అనారోగ్యం కారణంగా ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టలేకపోయారు. ఆయన స్థానంలో పీయూష్  గోయల్ ప్రవేశపెట్టారు.

Latest Updates