నిజాం పేట, కొంపల్లిలో మున్సిపల్ పాలన షురూ

వెలుగు: కొత్తగా ఏర్పడిన నిజాంపేట, కొంపల్లి మున్సిపాలిటీలకు ప్రభుత్వం కమిషనర్లను నియమించడంతో ఆదివారం సెలవు దినమైనప్పటికీ బాధ్యతలు స్వీకరించారు. నిజాంపేట మున్సిపాలిటీకి ఇషాక్ అబ్ ఖాన్, కొంపల్లి మున్సిపల్ కమిషనర్ గా జ్యోతి చార్జ్ తీసుకున్నారు. గ్రామ పంచాయతీల రికార్డులను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. సోమవారం నుంచి పూర్తిస్థాయి విధులు నిర్వర్తిస్తున్నారు. నిజాం పేట కమిషనర్ బాచుపల్లి మున్సిపల్ వార్డు కార్యాలయానికి చేరుకుని పరిశీలించారు. బాచుపల్లి మాజీపంచాయితీ కార్యవర్గం నూతన కమిషనర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రెండు రోజుల్లోఎవరికి ఏ బాధ్యత అప్పగించాలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తర్వాత ప్రగతినగర్ మున్సిపల్ వార్డు కార్యాలయాన్ని సందర్శించారు. ఎంపీటీసీ దయాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ శాంతికుమారి తదితరులు కమిషనర్ కు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కొంపల్లి కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన జ్యోతి దూలపల్లిలోని వార్డు కార్యాలయంలో కొంపల్లి, దూలపల్లి సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. విధుల్లో అలసత్వాన్ని సహించబోనని హెచ్చరించారు. అందరి సహకారంతో కొంపల్లిని అభివృద్ధి చేస్తామని తెలిపారు.

Latest Updates