ఆల్టర్నేట్​ రోడ్లు లేవు.. స్కైవే లేదు

కంటోన్మెంట్ ​ప్రజలను వేధిస్తున్న రోడ్ల సమస్య

ఎప్పుడు పడితే అప్పుడు బ్లాక్​ చేస్తున్న మిలటరీ

ప్రత్యామ్నాయ రోడ్లకు ఓకే చెప్పిన ఇరు వర్గాలు

స్కైవే ప్రతిపాదనలతో తెగని పంచాయితీ 

హైదరాబాద్​, వెలుగు: కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉంటున్న ప్రజలను ప్రతిరోజూ వేధించే సమస్య రోడ్​బ్లాక్​ చేయడం. ఆర్మీ ఏరియా కావడంతో పలు రూట్లలో వెహికల్స్​ రాకపోకలను ఎప్పుడూ ఆపేస్తుంటారు. దీంతో ఎటు నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా ఇబ్బందులు పడక తప్పదు. దీని నుంచి విముక్తి కల్పించడానికి ఆల్టర్నేట్ రూట్స్​ఏర్పాటు చేయాలనుకుంటున్నా అది ముందుకు సాగడం లేదు. మిలటరీ రోడ్లను అనుసరిస్తూ ప్రత్యామ్నాయంగా స్కైవే  నిర్మాణానికి జీహెచ్ఎంసీ, లోకల్​ మిలటరీ అథారిటీ(ఎల్ఎంఏ) మూడేండ్ల క్రితం చేపట్టిన సర్వే రిపోర్టు దుమ్ముకొట్టుకుపోతోంది. మిలటరీ అథారిటీ, సర్కారు మధ్య సఖ్యత లేని కారణంగా సమస్యకు పరిష్కారం లభించడం లేదు.

పరిష్కారమైనట్టే అయ్యి మొదటికి…

కంటోన్మెంట్​బోర్డు మిలటరీ ప్రాంతంలోని రోడ్లపై అలహాబాద్ గేట్, వెల్లింగ్టన్ రోడ్, గోఫ్ రోడ్​, ఆర్డినెన్స్ రోడ్ పేరుతో నాలుగు  ఏరియాల్లో గేట్లు ఏర్పాటు చేశారు. కంటోన్మెంట్​బోర్డు చుట్టూ ఉన్న కాలనీలు, బస్తీలైన యాప్రాల్​, మల్కాజిగిరి, నేరెడ్​మెట్, బొల్లారం, అల్వాల్​, సికింద్రాబాద్​ప్రాంతాలకు ఈ రూట్ల నుంచే వెళ్తుంటారు. ఏఓసీ రూట్​నుంచి ప్రతిరోజు సుమారు రెండున్నరలక్షల మంది ప్రయాణిస్తుంటారు. దేశంలో ఏదైనా సమస్య తలెత్తినపుడు లోకల్​మిలటరీ అధికారులు ఈ రోడ్లను టెంపరరీగా మూసివేసి సమస్య తీవ్రత తగ్గిన వెంటనే తిరిగి తెరుస్తారు. అయితే కొన్నేండ్లుగా చీటికీ మాటికీ ఈ రోడ్లను మూసేస్తుండడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. సమస్యకు పర్మినెంట్​ సొల్యూషన్​ చూపేందుకు  జీహెచ్ఎంసీ, లోకల్​ మిలటరీఅథారిటీ సంయుక్తంగా 2017లో  ఆల్డర్నేట్​ రోడ్లపై సర్వే నిర్వహించారు. దీంట్లో కంటోన్మెట్​ ఏరియాలో రోడ్లనిర్మాణానికి సుమారు 25 ఎకరాల మిలటరీ భూమి అవసరం ఉంటుందని నివేదిక  తయారు చేశారు. దీనికి అవసరమైన స్థలాన్ని ఇచ్చేందుకు కూడా మిలటరీ అథారిటీ రెడీ అయ్యింది.  అయితే దీనికి ప్రత్యమ్నాయంగా మరోచోట తమకు స్థలాన్ని కేటాయించాలని , లేకుంటే భూమికి నష్టపరిహారం చెల్లించాలని కోరింది. ఈ మేరకు ఇరు వర్గాల మధ్య అవగాహన కుదిరింది. మిలటరీ అథారిటీకి స్థలాన్ని ఇచ్చేందుకు రాష్ర్ట ప్రభుత్వం కూడా అంగీకరించింది. అయితే ఈ ప్రతిపాదనలు ఇలా కొనసాగుతుండగానే మరో వైపు అంతకు ముందే అలహాబాద్ గేట్, వెల్లింగ్టన్ రోడ్, గోఫ్ రోడ్​, ఆర్డినెన్స్ రోడ్ ప్రాంతాలలో నాలుగు స్కైవేలు నిర్మించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనలు తిరిగి తెరపైకిరావడంతో పాత ప్రతిపాదనలు పక్కదారి పట్టాయి. దీంతో ఈ సమస్య తిరిగి మొదటికి వచ్చింది

స్కైవేలతో సొల్యూషన్​

మిలటరీ ప్రాంతంలో స్కైవేలతో సమస్యకు పరిష్కారం లభిస్తుందని బోర్డు అధికారులు అభిప్రాయపడుతున్నారు.  అలహాబాద్ గేట్, వెల్లింగ్టన్ రోడ్, గోఫ్ రోడ్​, ఆర్డినెన్స్ రోడ్ ప్రాంతాలను కలుపుతూ  ఏఓసీ రూట్​ నుంచి వెళ్లేందుకు నిర్మించే స్కైవేలకు ఎలాంటి డిఫెన్స్​ ల్యాండ్​ అవసరం లేదని, అయితే ఈ ప్రాంతంలో స్కైవేలకు అవసరమైన ఎత్తయిన పిల్లర్ల నిర్మాణానికి మిలటరీ అథారిటి అనుమతిస్తే సరిపోతుందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా రాష్ట ప్రభుత్వం లోకల్​ మిలటరీ అథారితో చర్చలు జరిపి ఈ రూట్​ నుంచి స్కైవేలు నిర్మించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.

For More News..

వరంగల్​ వార్​కు పార్టీలు రెఢీ

కొండపోచమ్మ కట్టకు బుంగలు

Latest Updates