6 నెలలుగా చొరబాట్లు లేవ్.. కేంద్రం క్లారిటీ

న్యూఢిల్లీ: ఇండో-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. దౌత్యపరమైన, మిలటరీ లెవల్‌‌లో చర్చలు నిర్వహిస్తున్నా పరిస్థితి తీవ్రతలో ఎలాంటి మార్పు లేదని సమాచారం. ఈ విషయాన్ని అటుంచితే భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దీనిపై రాజ్య సభలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. గత ఆరు నెలల్లో మన భూభాగంలో చైనా చొరబడలేదని స్పష్టం చేసింది. ఈ విషయంపై హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

‘ఇండో-చైనా బార్డర్‌‌‌లో గత ఆరు నెలల్లో ఎలాంటి చొరబాట్లు జరగలేదు. సరిహద్దు అతిక్రమణ విషయంలో ప్రభుత్వం దీర్ఘకాలిక విధానాన్ని ఎంచుకుంది. దీంట్లో ఇంటర్నేషనల్ బార్డర్ గుండా బహుళ శ్రేణిలో విస్తరించడం, మెరుగైన మేధస్సు, కార్యాచరణ సమన్వయం, సరిహద్దుల వద్ద ఫెన్సింగ్, టెక్నికల్ సమస్యలను పరిష్కరించడం, చొరబాటుదారులపై చురుకైన చర్యలు తీసుకోవడం భాగంగా ఉన్నాయి’ అని రాయ్ తెలిపారు. చైనా బార్డర్‌‌తోపాటు ఇండో-పాక్ సరిహద్దుల్లో చొరబాట్లపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాయ్ ఈ జవాబు చెప్పారు. ఈ సమాధానంలో గత ఫిబ్రవరి నుంచి జూన్ వరకు జరిగిన అతిక్రమణలు, చొరబాటు యత్నాలను చేర్చారు. ముఖ్యంగా ఏప్రిల్‌‌లో చాలా చొరబాట్లు జరిగాయని పేర్కొన్నారు.

Latest Updates