స్కూళ్లలో కంప్యూటర్లున్నయ్‌.. నేర్పేటోళ్లు లేరు

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలోని సర్కారీ స్కూళ్లలో చదువుతున్న పేద పిల్లలకు కంప్యూటర్​ ఎడ్యుకేషన్​ అందకుండా పోయింది. ప్రైవేటుకు దీటుగా సర్కారు స్కూళ్లను తీర్చిదిద్దడం, పేద పిల్లలకు సాంకేతిక విద్య అందించడం కోసమని ఏర్పాటు చేసిన కంప్యూటర్లు, ఇతర పరికరాలు దుమ్ముపట్టి పోతున్నాయి. కంప్యూటర్​ క్లాసులు చెప్పే ఫ్యాకల్టీ లేక మూలకుపెట్టడంతో కోట్ల విలువైన పరికరాలు పాడైపోయాయి. స్కూళ్లలో కంప్యూటర్​ ల్యాబ్​లన్నీ స్టోర్​ రూములుగా మారిపోయాయి. స్కూళ్లలో డిజిటల్​ తరగతులు చెప్తున్నామంటున్న సర్కారు.. ఇప్పటికే ఉన్న కంప్యూటర్లను బాగుచేయించడం, ఫ్యాకల్టీని పెట్టి స్టూడెంట్లకు క్లాసులు చెప్పించడంపై మాత్రం స్పందించడం లేదు. కంప్యూటర్​ ఎడ్యుకేషన్​ను పునరుద్ధరించేందుకు రెండేళ్ల కింద అధికారులు ప్రతిపాదన చేసినా సర్కారు పట్టించుకోలేదు.

ఏడున్నర వేల స్కూళ్లలో..

సర్కారు బడుల్లో చదివే పేద విద్యార్థులకు కంప్యూటర్‌‌ విద్య అందించాలనే లక్ష్యంతో 2002లో ఉమ్మడి ఏపీ సర్కారు ‘వెయ్యి స్కూళ్ల కంప్యూటరీకరణ’ప్రాజెక్టు చేపట్టింది. అది మంచి ఫలితాలు ఇవ్వడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 2008లో మరో 5,000 స్కూళ్లలో (ఇందులో 2,280 తెలంగాణ స్కూళ్లు), 2010లో ఇంకో 1,300 స్కూళ్లలో కంప్యూటర్​ ఎడ్యుకేషన్​ను ప్రారంభించాయి. ఒక్కో బడిలో ప్రత్యేకంగా ల్యాబ్​ ఏర్పాటు చేశారు. పదకొండు కంప్యూటర్లు, స్పీకర్లు, యూపీఎస్​లు, ప్రింటర్, జనరేటర్, కుర్చీలు, ఫ్యాన్లు ఇచ్చారు. స్టూడెంట్లకు ఎంఎస్‌‌ డాస్‌‌, విండోస్‌‌, పెయింట్‌‌, వర్డ్‌‌, ఎక్సెల్‌‌, పవర్‌‌ పాయింట్‌‌, యాక్సెస్‌‌, హెచ్‌‌టీఎంఎల్‌‌ లాంగ్వేజ్‌‌లను బోధించారు. ఇలా కంప్యూటర్​ ఎడ్యుకేషన్​ ప్రారంభించిన స్కూళ్లకు ఫుల్లుగా డిమాండ్​ పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లోనైతే ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్న స్టూడెంట్లు కూడా సర్కారు బడులకు మళ్లారు.

ఏజెన్సీల ద్వారా..

స్కూళ్లలో కంప్యూటర్​ ఎడ్యుకేషన్​కు అయ్యే ఖర్చులో కేంద్రం 75 శాతం, రాష్ట్రం 25 శాతం భరించాయి. నిట్‌‌, ఏఈజీ, ఎడ్యు క్యాంప్‌‌, ఎవరెన్‌‌, ఈసీఐఎల్‌‌, టెరా సాఫ్ట్‌‌, సోషల్‌‌ కంప్యూటర్‌‌ తదితర ఏజెన్సీల ద్వారా ప్రాజెక్టులను నిర్వహించారు. స్కూల్​కు ఇద్దరు ఫ్యాకల్టీని పెట్టి క్లాసులు చెప్పించారు. 2013–14 వరకు కొనసాగిన ఈప్రాజెక్టుల ద్వారా ఏటా 20 లక్షల మందికిపైగా స్టూడెంట్లకు కంప్యూటర్‌‌ ఎడ్యుకేషన్​ అందింది. ప్రాజెక్టు గడువు ముగియడంతో ఏజెన్సీలు స్కూళ్లను వదిలేశాయి. స్కూళ్లలో కంప్యూటర్​ ఎడ్యుకేషన్​ కొనసాగించేందుకు ప్రభుత్వం టీచర్లకు శిక్షణ ఇచ్చింది. కానీ ఆ శిక్షణ తూతూమంత్రంగా సాగడం, టీచర్ల కొరత కారణంగా క్లాసులు చెప్పే పరిస్థితి లేకపోవడంతో కంప్యూటర్​ ఎడ్యుకేషన్​ ఆగిపోయింది.

నిరుపయోగంగా ల్యాబ్స్‌‌..

అటు ఏజెన్సీల పని అయిపోవడం, ఇటు టీచర్లు బోధించకపోవడంతో కంప్యూటర్లన్నీ మూలకుపడ్డాయి. మెల్లగా పర్యవేక్షణ దెబ్బతిని పాడైపోయాయి. దీనికితోడు కంప్యూటర్​ ల్యాబ్​లు వర్షానికి నీళ్లుకారడం, షార్ట్​ సర్క్యూట్, బిల్లులు కట్టక కరెంటు కట్​ చేయడం, పరికరాలను దొంగలెత్తుకుపోవడం వంటివాటితో మరింత నష్టం జరిగింది. కొన్నిచోట్ల మాత్రం టీచర్లు అప్పుడప్పుడూ క్లాసులు తీసుకుంటుండటం, కంప్యూటర్లను భద్రంగా చూసుకుంటుండటంతో ల్యాబ్​లు పనిచేస్తున్నాయి. ప్రతి పనికి కంప్యూటర్​ తప్పనిసరి అయిపోయిన ప్రస్తుత కాలంలో.. సర్కారు స్కూళ్లలో కంప్యూటర్​ ఎడ్యుకేషన్​ను పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇది ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేయడమేనని స్టూడెంట్లు, పేరెంట్స్​ మండిపడుతున్నారు.

స్టోర్​రూమ్​ కాదు..  కంప్యూటర్​ ల్యాబ్

ఉమ్మడి కరీంనగర్​ జిల్లా చొప్పదండి గర్ల్స్ హైస్కూల్లో స్టోర్​ రూమ్​లా మారిపోయిన కంప్యూటర్​ ల్యాబ్​ ఇది. 2013లో కంప్యూటర్​ ఎడ్యుకేషన్​ ప్రాజెక్టు ముగిసినప్పటి నుంచి జిల్లావ్యాప్తంగా స్కూళ్లలో ల్యాబ్​ మెయింటెనెన్స్​ మూలన పడింది. క్లాసులు చెప్పేవాళ్లు లేక తాళాలు వేసేశారు. దాంతో కంప్యూటర్లు, యూపీఎస్​లు, జనరేటర్లు చాలా వరకు పాడైపోయాయి. టేబుళ్లు చెదలుపట్టి విరిగిపోయాయి. ఊర్లకు దూరంగా ఉన్న స్కూళ్లలో దొంగలుపడి కంప్యూటర్లు ఎత్తుకెళ్లిపోయారు.

కంప్యూటర్లుంటే స్టూడెంట్స్​ పెరిగేవారు

ఆరేళ్ల నుంచి వాడకపోవడంతో  లక్షల విలువైన కంప్యూటర్లు, ప్రింటర్​ పాడయ్యాయి. బిల్లు కట్టక కరెంటు కట్​ చేశారు. కంప్యూటర్లు ఉన్నా క్లాసులు చెప్పే వారు లేక స్టూడెంట్లకు కంప్యూటర్ ఎడ్యుకేషన్‌  అందడం లేదు. ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్లకు కంప్యూటర్ శిక్షణ కొనసాగిస్తే.. స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉండేది. సర్కారు ఆ దిశగా చర్యలు చేపడితే బాగుంటుంది. శ్రీనివాసరావు, చొప్పదండి జెడ్పీ హైస్కూల్​ హెచ్ఎం

నిధులు లేకనే..

బడుల్లో కంప్యూటర్‌‌ విద్యను త్వరలోనే తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం నిధుల సమస్య కారణంగా ప్రత్యేకంగా కంప్యూటర్​ టీచర్లను నియమించలేదు. గతంలో నిర్వహణ బాధ్యతలు చూసిన ప్రైవేటు సంస్థలకు కొన్ని బకాయిలు చెల్లించాల్సి ఉంది. వాటినీ త్వరలోనే చెల్లిస్తాం. విజయ్‌‌కుమార్‌‌, పాఠశాల విద్య కమిషనర్‌‌

ఇదీ లెక్క..

ఐసీటీ @ 5,000

ఐదు వేల స్కూళ్లలో కంప్యూటర్ల ఏర్పాటు

2008–09లో ప్రారంభం,

2012–13లో ముగింపు.

ఏటా 18 లక్షల మంది స్టూడెంట్స్‌‌కు కంప్యూటర్‌‌ విద్య

రూ.457.91 కోట్ల ఖర్చు

 

ఐసీటీ @ 1,300

2010–11లో ప్రారంభం,
2014–15లో ముగింపు

ఏటా 5,80,403 మందికి
కంప్యూటర్‌‌ విద్య  రూ. 117.62 కోట్ల వ్యయం

Latest Updates