సర్కార్​కు అప్పు పుడ్తలేదు!

ఇప్పటికే రూ.92,128 కోట్ల

ఈ ఏడాది ఇంకో రూ.22 వేల కోట్లు తేవాలని టార్గెట్‌‌‌‌

ఇచ్చేందుకు ముందుకు రాని ఫైనాన్స్​ సంస్థలు

టార్గెట్​ను తగ్గించుకున్నా కనిపించని ఫలితం

ఈ సారి ఇరిగేషన్​కు బడ్జెట్‌‌‌‌ కేటాయింపులు రూ. 12వేల కోట్ల లోపే?

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఇరిగేషన్‌‌‌‌ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు రాష్ట్ర సర్కార్​కు అప్పు పుడుతలేదు. వీటి కోసం ఇప్పటికే రూ. 92 వేల కోట్లకు పైగా అప్పు తెచ్చిన ప్రభుత్వం.. వచ్చే ఫైనాన్స్‌‌‌‌ ఇయర్‌‌‌‌లో ఇంకో రూ. 22 వేల కోట్ల అప్పు తెచ్చేందుకు ప్రపోజల్స్‌‌‌‌ రెడీ చేసింది. ఆ స్థాయిలో లోన్లు ఇచ్చేందుకు సంస్థ లేవీ ముందుకు రాకపోవడంతో ఈ ఏడాదికి బడ్జెట్‌‌‌‌ కేటాయింపులతోనే సరిపెట్టాలని నిర్ణయించింది. ఇదే ముచ్చట ఉన్నతాధికారులకు చెప్పింది. ఇచ్చిన నిధులతోనే సరిపెట్టుకోవాలని, ఈ ఏడాదికి ఇంతేనని క్లారిటీ ఇచ్చింది. అయితే.. బడ్జెట్​ కేటాయింపులు పెద్దగా ఉండే చాన్స్ లేకపోవడంతో ప్రాజెక్టులు పూర్తిచేసుడెలా  అని ఇంజనీర్లు ఆందోళన చెందుతున్నారు.

ఇప్పటికే రూ. 92 వేల కోట్ల అప్పులు

రాష్ట్రంలో 30 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ, కంతనపల్లి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటికి నిధుల కొరత తలెత్తకుండా 2016లో కాళేశ్వరం ఇరిగేషన్‌‌‌‌ ప్రాజెక్టు కార్పొరేషన్‌‌‌‌తో పాటు తెలంగాణ స్టేట్‌‌‌‌ వాటర్‌‌‌‌ రీసోర్సెస్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ను ఏర్పాటు చేసింది. కాళేశ్వరంతోపాటు పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును కాళేశ్వరం కార్పొరేషన్‌‌‌‌లో ఇంక్లూడ్‌‌‌‌ చేసింది. సీతారామ, దేవాదుల, కంతనపల్లి, ఫ్లడ్‌‌‌‌ ఫ్లో కెనాల్‌‌‌‌ను వాటర్‌‌‌‌ రీసోర్సెస్‌‌‌‌ డెవలప్​మెంట్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌లో చేర్చింది. కాళేశ్వరం కార్పొరేషన్‌‌‌‌.. బ్యాంకులు, వివిధ ఆర్థిక సంస్థల నుంచి పెద్ద ఎత్తున అప్పులు తెచ్చింది. 2016 నుంచి 2019 వరకు ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు కోసమే రూ. 65,128.80 కోట్ల అప్పు తీసుకుంది. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు కోసం ఇంకో రూ. 10 వేల కోట్ల లోన్​ను కాళేశ్వరం కార్పొరేషన్​ తీసుకువచ్చింది. ఇక, పవర్‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ వరుసగా మూడేండ్లలో రూ. 17 వేల కోట్ల లోన్లు తీసుకువచ్చింది. కాళేశ్వరం, దేవాదుల, కంతనపల్లి, వరద కాలువ, సీతారామ ప్రాజెక్టులకు చేసిన చెల్లింపుల్లో అత్యధిక పేమెంట్లు లోన్‌‌‌‌ల ద్వారా సమకూరిన డబ్బుతో చేసినవే. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు పది వేల కోట్ల రూపాయల అప్పు తెచ్చినా ఇప్పటి వరకు రూ. 600 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అందులో రూ. 580 కోట్లకు పైగా పేమెంట్‌‌‌‌ చేశారు. మొత్తంగా ఇప్పటి వరకు రెండు కార్పొరేషన్లు రూ. 92,128.80 కోట్ల అప్పు చేశాయి.

తొలుత ప్రతిపాదన రూ. 43 వేల కోట్లు

2020–-21 ఫైనాన్స్‌‌‌‌ ఇయర్‌‌‌‌లో రూ. 43 వేల కోట్లతో ఇరిగేషన్‌‌‌‌ పద్దును ప్రతిపాదించారు. ఇందులో ప్రాజెక్టుల ఆపరేషన్స్‌‌‌‌ అండ్​ మెయింటనెన్స్‌‌‌‌, లిఫ్ట్‌‌‌‌ స్కీముల కరెంట్‌‌‌‌ బిల్లు రూ. 6 వేల కోట్లు, నిర్వహణ పద్దు రూ. 1,500 కోట్లు పక్కన పెట్టి మిగతా రూ. 36 వేల కోట్లతో ప్రాజెక్టుల పనులు చేపట్టాలని ప్రపోజల్స్‌‌‌‌ రెడీ చేశారు. ఈ మొత్తంలో రాష్ట్ర బడ్జెట్‌‌‌‌ నుంచి రూ. 21 వేల కోట్లు కేటాయించాలని, కార్పొరేషన్ల నుంచి రూ. 22 వేల కోట్ల లోన్లు తీసుకునేందుకు పర్మిషన్‌‌‌‌ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.  ఇరిగేషన్‌‌‌‌  డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ రూ. 21 వేల కోట్లతో ఇచ్చిన బడ్జెట్‌‌‌‌ ప్రపోజల్స్‌‌‌‌ను (కార్పొరేషన్​ లోన్లు కాకుండా) సవరించి పంపాలని ఫైనాన్స్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ కోరడంతో మొత్తం ప్రపోజల్స్‌‌‌‌ను సగానికి కుదించి మళ్లీ పంపించారు. మిగతా ప్రాజెక్టులకు సింగిల్‌‌‌‌, డబుల్‌‌‌‌ డిజిట్లలోనే కేటాయింపులు ఉండే అవకాశముంది. పాలమూరు – రంగారెడ్డి, సీతారామ లిఫ్ట్‌‌‌‌ స్కీములకు రూ. 2 వేల కోట్ల చొప్పున, కాళేశ్వరానికి రూ. 1,500 కోట్లు, దేవాదులకు రూ. 600 కోట్లు, తుపాలకులగూడెంకు రూ. 300 కోట్లు, చెక్‌‌‌‌డ్యాంలు, మైనర్‌‌‌‌ ఇరిగేషన్‌‌‌‌కు రూ. 600 కోట్ల వరకు నిధులు ఇచ్చే చాన్స్​ ఉన్నట్లు తెలుస్తోంది. లిఫ్టుల కరెంట్‌‌‌‌ బిల్లులు, ఓ అండ్‌‌‌‌ ఎం కేటాయింపులు రూ. 3 వేల కోట్ల వరకు ఉండవచ్చని సమాచారం. మొత్తంగా ఇరిగేషన్​కు ఈ బడ్జెట్‌‌‌‌లో కేటాయింపులు రూ. 10 వేల కోట్ల నుంచి రూ.12 వేల కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది.

ఎందుకీ పరిస్థితి?

రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక సంస్థల వద్ద ఎంతో ప్యతార ఉందని సీఎం ఎప్పుడూ చెప్తుంటారు. నాలుగేండ్లలో ఇరిగేషన్​  ప్రాజెక్టుల కోసమే రూ.92 వేల కోట్ల అప్పు తెచ్చామంటే రీపేమెంట్‌‌‌‌ కెపాసిటీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలని ప్రభుత్వ వర్గాలు చెప్తుంటాయి. కానీ ఈ ఏడాది రూ. 22 వేల కోట్ల అప్పులు తేవాలని మొదట నిర్ణయించి.. ఆ తర్వాత వాటిలో రూ.7 వేల కోట్ల మేర కోత పెడుతూ ప్రపోజల్స్‌‌‌‌ సవరించారు. ప్రతిపాదించిన రూ. 15 వేల కోట్ల అప్పు అయినా వస్తుందో రాదో అన్న అనుమానం అధికారుల్లో బలంగా ఉంది. ప్రభుత్వం నేరుగా చేసిన అప్పులతో పాటు వివిధ కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పుల కిస్తీలను నెలానెలా రీ పేమెంట్‌‌‌‌ చేయాల్సి వస్తోంది. ఇప్పటి వరకు రీ పేమెంట్లు పర్‌‌‌‌ఫెక్ట్‌‌‌‌గా చేస్తున్నా, ఆర్థిక సంస్థల్లో ఎందుకో రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం సడలుతున్నట్టు చర్చ జరుగుతోంది. డైరెక్ట్‌‌‌‌ అప్పులు ఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌బీఎం పరిమితులకు దరిదాపుల్లో ఉండటం, కార్పొరేషన్ల లోన్లకు లెక్కేసుకుంటే ఆ పరిమితికి మించి చాలా ఎక్కువ కావడంతోనే ఆర్థిక సంస్థలు లోన్లు ఇవ్వడానికి ఇంతకు ముందులా ముందుకు రావడం లేదని సమాచారం. ఈ విషయంలో క్లారిటీ రావడంతోనే  లోన్ల ప్రపోజల్స్‌‌‌‌ను కుదించుకోవాలని చెప్పినట్టు తెలిసింది.

పవర్‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ నుంచి హయ్యెస్ట్‌‌‌‌ లోన్‌‌‌‌

కాళేశ్వరం కార్పొరేషన్‌‌‌‌ తెచ్చిన రూ. 75,128.80 కోట్ల అప్పులో 45 శాతానికి పైగా ఒక్క పవర్‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌ కార్పొరేషన్​ సంస్థే ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఈ సంస్థ రూ. 23,927.42 కోట్లు, పాలమూరు– రంగారెడ్డి కోసం రూ. 10 వేల కోట్ల అప్పు ఇచ్చింది. ఆ తర్వాత రూరల్‌‌‌‌ ఎలక్ట్రిఫికేషన్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ సంస్థ రూ. 18,751 కోట్లు, పంజాబ్‌‌‌‌ నేషనల్‌‌‌‌ బ్యాంకు ఆధ్వర్యంలో 11 బ్యాంకుల కన్సార్షియం రూ.11,400 కోట్లు, ఆంధ్రాబ్యాంకు నేతృత్వంలోని 9 బ్యాంకుల కన్సార్షియం రూ.7,400 కోట్లు, విజయ బ్యాంకు రూ.2,150 కోట్లు, నాబార్డు రూ.1,500 కోట్ల అప్పులు ఇచ్చాయి.

Latest Updates