తిరుమలను వదలని కరోనా

కరోనాతో తిరుమలలో తగ్గిన రద్దీ

తిరుమల, వెలుగు: కరోనా వైరస్ కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మంగళవారం నుంచి టీటీడీ టైం స్లాట్ విధానాన్ని అమలు చేసింది. క్యూలైన్లలో వేచి ఉండకుండా భక్తులు నేరుగా శ్రీవారిని దర్శించుకునే వెసులుబాటు కల్పించింది. కేవలం రెండు గంటల్లోనే భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ముందస్తుగా బుకింగ్​ చేసుకున్న రూ.300 టికెట్లు, టైం స్లాట్​ సర్వదర్శనం టికెట్లు, వీఐపీ దర్శన టికెట్లు కలిగిన భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించారు. టైమ్ స్లాట్లు టోకెన్లు ఇవ్వడానికి తిరుమలలో సీఆర్‌‌వో వ‌‌ద్ద – 7 కౌంట‌‌ర్లు, ఆర్టీసీ బస్టాండులో – 7 కౌంటర్లు ఏర్పాటు చేశారు.  తిరుపతిలోని విష్ణునివాసం,  శ్రీనివాసం,  రైల్వేస్టేషన్‌‌ వెనుకవైపు గల గోవిందరాజస్వామి 2, 3 సత్రాలు, ఆర్టీసీ బస్టాండ్‌‌, అలిపిరి దగ్గరలోని భూదేవి కాంప్లెక్స్‌‌లో టోకెన్లు జారీ ఇస్తున్నారు. కాలినడక భక్తులకు అలిపిరి మార్గంలోని నామాల గాలి గోపురం, శ్రీ‌‌వారి మెట్టు దగ్గర టోకెన్లు జారీ చేశారు.

దుర్గమ్మ దర్శనం వాయిదా వేసుకోండి: ఈవో

విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులు ప్రయాణాలను 3 వారాలు వాయిదా వేసుకోవాలని ఆలయ ఈవో సురేశ్ బాబు కోరారు. కరోనా వైరస్ ప్రభావంతో ఆలయానికి భక్తల రాక తగ్గిందన్నారు. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రతి రెండు గంటలకు ఒకసారి శానిటైజ్ చేస్తున్నట్లు చెప్పారు.

శ్రీశైలం భక్తులకు స్క్రీనింగ్

శ్రీశైలం మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులకు కరోనా టెస్టులు నిర్వహిస్తున్నట్లు కర్నూలు జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ చెప్పారు. ఉగాది సందర్భంగా మహారాష్ట్ర, కర్నాటక నుంచి భక్తులు పాదయాత్రగా వస్తున్నారని, వారందరికీ తెలంగాణ, కర్నాటక సరిహద్దులో టెస్టులు చేసేందుకు మెడికల్ క్యాంపులు పెట్టినట్లు ప్రకటనలో తెలిపారు.

సింహాచలంలో మాస్కుల పంపిణీ

సింహాద్రి అప్పన్న ఆలయంలో భక్తులకు మాస్కులు పంపిణీ చేశారు. ఇండియన్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరోనాపై వర్క్‌ షాప్ నిర్వహించారు. భక్తులు గుంపులుగా ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఈవో తెలిపారు.

For More News..

మూడు రోజులుగా ఇంట్లోనే మృతదేహం.. పీక్కుతిన్న చీమలు

నేటి నుంచి కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లు బంద్

నిజామాబాద్ ఎమ్మెల్సీ బరిలోకి కవిత

కరోనా సోకిన వ్యక్తి బయట తిరిగితే 12 ఏండ్ల జైలు

Latest Updates