హురియత్ లీడర్లలో క్రమశిక్షణ లేదు: జిలానీ

  • కాశ్మీర్ వేర్పాటు రాజకీయాల్లో సంచలనం
  • హురియత్ లీడర్లలో క్రమశిక్షణ లేదంటూ ఆరోపణలు

 

కాశ్మీర్ వేర్పాటు వాద రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. హురియత్ కాన్ఫరెన్స్ లైఫ్ టైమ్ చైర్మన్, వేర్పాటు వాద సీనియర్ నేత సయ్యద్ అలీ షా జిలానీ ఆ సంస్థకు కటీఫ్ చెప్పారు. ఇందుకు సంబంధించి ఆయన సోమవారం ఆడియో మేస్సేజ్ కూడా రిలీజ్ చేశారు. తాను ఈ నిర్ణయం తీసుకోవటానికి గల కారణాలను ఇప్పటికే హురియత్ కు పంపించారని ఆయన తరఫున ప్రతినిధి మీడియాకు చెప్పారు. 90 ఏళ జిలానీ కాశ్మీర్ అటానమీ కోసం ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. 1990 నుంచి కాశ్మీర్ లోయలో వేర్పాటు వాద ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలో హురియత్ కాన్ఫరెన్స్ నేతలతో కలిసి పనిచేస్తున్నారు. 2003 నుంచి హురియత్ కాన్ఫరెన్స్ కు జీవితకాల చైర్మన్ గా ఉన్నారు. ఈమధ్యనే హురియత్ కాన్ఫరెన్స్ లో జరుగుతున్న పరిణామాల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు జిలానీ. సంస్థలో క్రమశిక్షణ లోపించిందని, ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయని, చాలా మంది పీఓకే లోని ప్రభుత్వంలో చేరాలని ప్రయత్నిస్తున్నారని, తనపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని హురియత్ లోని పలు డిపార్ట్మెంట్లకు రాసిన లెటర్లో జిలానీ ఆరోపించారు . ” ఇప్పటికే పలుమార్లు నా అసంతృప్తిని తెలిపాను. తదుపరి ఎలాంటి కార్యక్రమాలు చేయాలన్న దానిపై జరిగిన ప్రయత్నాలు సక్సెస్ కాలేదు. సంస్థలో ఆర్థిక, ఇతర అవకతవకలపై మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది ” అని హురియత్ లీడర్లను ఉద్దేశించి లెటర్ లో రాశారు.

నన్ను టార్గెట్ చేస్తున్నారు

హురియత్ సహా అనుబంధ సంస్థలు తనను అనవసరంగా టార్గెట్ చేస్తున్నాయని జిలానీ ఆరోపించారు. తనపై అబద్ధాలను ప్రచారం చేస్తూ కుట్రలు పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని హురియత్ సమావేశాలకు పిలిచి వారికి మద్దతుగా నిలుస్తున్నారంటూ సంస్థ పెద్దలపై జిలానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమశిక్షణ లోపించిన సంస్థను గాడిలో పెట్టేందుకు చేసే ప్రయత్నాలకు భాగస్వామ్య పక్షాలు అనుమతించటం లేదన్నారు. ముఖ్యంగా మోడీ ప్రభుత్వం 370 ఆర్టికర్టిల్ ని రద్దు చేయటం, కాశ్మీర్ లోయలో మారిన పరిస్థితులపై హురియత్ తో పాటు అనుబంధ సంస్థలు మౌనంగా ఉన్నాయని జిలానీ అసంతృప్తితో ఉన్నారు. పీఓకే లోని ప్రభుత్వంలో చేరేందుకే చాలా మంది ప్రయత్నిస్తున్నారని హురియత్ నేతలను విమర్శించారు. అటు పాక్ కూడా హురియత్ కాన్ఫరెన్స్ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. కాశ్మీర్లో మోడీ ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ధీటుగా నిరసనలు తెలుపటం లేదని పాక్ భావిస్తోంది. ఈ క్రమంలోనే జిలానీ హురియత్ తో తన బంధాన్నితెంచుకున్నారు.

 కాశ్మీర్ లో కల్లోలానికి ఆయనే బాధ్యుడు: రాంమాధవ్

హురియత్ కాన్ఫరెన్స్ ‌ను వీడుతున్నట్లు జిలానీ ప్రకటించటంపై బీజేపీ సీనియర్ నేత రాంమాధవ్ రియాక్ట్ అయ్యారు. ఇన్నాళ్లు పాకిస్తాన్ కు సపోర్ట్ గా కాశ్మీర్ లో టెర్రరిజాన్ని, హింసను రెచ్చగొట్టింది జిలానీయేనని ఆరోపించారు. ఎంతో మంది కాశ్మీరీ యువకులు, వారి కుటుంబాల జీవితాలు నాశనం కావటానికి ఆయన బాధ్యుడని చెప్పారు. హురియత్ నుంచి వైదొలిగితే గతంలో ఆయన చేసిన పాపాలన్నీ సమసిపోయినట్లా అని ట్వీట్ చేశారు. ” కాశ్మీర్ లోయలో టెర్రరిజం, హింసకు జిలానీ ఒక్కడిదే బాధ్యత. ఎంతో మంది కాశ్మీరీ యువకుల ప్రాణాలు పోవటానికి వారి కుటుంబాలు చిన్నా భిన్నమవటానికి జిలానీయే కారణం. ఇప్పుడు ఏ రీజన్ చెప్పకుండా హురియత్ కాన్ఫరెన్స్ నుంచి వైదొలిగితే గతంలో చేసిన పాపాలన్నీ మాఫీ అవుతాయా ? ” అంటూ రాంమాధవ్ ట్విట్టర్ లో ప్రశ్నించారు.

Latest Updates