డ్రైవర్లకు,కండక్టర్లకు డ్యూటీలు ఇస్తలేరు

  • పనులులేకబస్‌ పాయింట్లలో డ్యూటీలు
  • లీవ్ లు పెట్టుకోవాలంటున్నఅధికారులు
  • సెలవులైపోయి లాస్‌ ఆఫ్‌ పే

హైదరాబాద్‌, వెలుగు: ఆర్టీసీలో చాలా మంది డ్రైవర్లు, కండక్టర్లకు డ్యూటీలు  దొరకడంలేదు. డ్యూటీలు వేయలేమని, లీవులు తీసుకోవాలని అధికారులే చెప్తుండడంతో రోజుల తరబడి ఖాళీగా ఉండాల్సివస్తోంది.  కొంత మందికి బస్‌పాయింట్ల వద్ద ట్రాఫిక్‌ డ్యూటీకి పంపుతున్నారు. ప్రగతిభవన్‌లో జరిగిన మీటింగ్‌లో అవసరంలేని చోట బస్సు ట్రిప్పులను రద్దు చేయాలని, కాలం చెల్లిన బస్సులను బయటకు తీయొద్దని సీఎం  ఆదేశించడంతో ఈ పరిస్థితి నెలకొంది. హైదరాబాద్‌లో 500 బస్సులను రద్దు చేయాలని కేసీఆర్‌ సూచించగా, అధికారులు మొదట వెయ్యి బస్సులను తగ్గించారు. ప్రయాణికులు ఇబ్బందులు పడుతుండడంతో   200 బస్సులను తిరిగి ప్రారంభించారు. సిటీలో 800 బస్సులు తగ్గడంతో సుమారు నాలుగువేల మంది కండక్టర్లు, డ్రైవర్లకు పనిలేకుండా పోయింది. జిల్లాల్లోనూ చాలా రూట్లలో డబుల్​ ట్రిప్పుల స్థానంలో సింగిల్​ ట్రిప్పులు నడుపుతున్నారు.  దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఐదువందల నుంచి ఆరు వందల మంది ఉద్యోగులు పనికి దూరమవుతున్నారు.

ట్రాఫిక్​లో అవస్థలు

ట్రిప్పులు తగ్గడంతో డిపోలకు వచ్చిన వారందరికీ అధికారులు  డ్యూటీలు వేయలేకపోతున్నారు. గంటలపాటు వెయిట్​ చేసిన తర్వాత పనిలేదు.. లీవ్​ పెట్టుకుని వెళ్లిపొమ్మంటున్నారు. రోజుల తరబడి సెలవులు పెట్టుకోవాల్సివస్తోంది. సెలవులు అయిపోయి జీతాల్లో కోత పడుతుందని డ్రైవర్లు, కండక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  కొందరిని బస్‌ పాయింట్ల వద్ద నియమిస్తున్నారు. వీరు  ప్రయాణికులకు సూచనలు చేయడం, బస్సుల రాకపోకలను నియంత్రించడం లాంటి పనులు చేయాలి.  సీనియర్లకు కండక్టర్‌, డ్రైవర్‌ డ్యూటీలు వేయాలి. అవసరమైతే జూనియర్లకు ఇతర డ్యూటీలు వేయాలి. కానీ అధికారులు జూనియర్లకు డ్యూటీలు వేసి..  సీనియర్లను  పాయింట్ల దగ్గరకు పంపుతున్నారు. దీనివల్ల   వయస్సుఎక్కువున్న కొంత మంది ట్రాఫిక్​లో డ్యూటీ చేయలేక అవస్థలు పడుతున్నారు.

డ్యూటీలు వేస్తలేరు..

మహిళలకు డ్యూటీలు ఇచ్చిన తర్వాతే మిగతా వాళ్లకు ఇస్తున్నారు.  కొందరిని బస్‌ పాయింట్స్ వద్దకు పంపుతున్నరు. ఎంత లేట్ అయిన డ్యూటీ చేయాల్సిందేనంటున్నారు.  ట్రాఫిక్ జామ్ వల్ల ట్రిప్​ లేట్ అయితే తరువాతి రోజు డ్యూటీ ఇవ్వటం లేదు.

– హైదరాబాద్‌కు చెందిన ఓ కండక్టర్

పది రోజుల్లో సెట్‌ చేస్తం..

హైదరాబాద్‌లో బస్సులను తగ్గించడంతో  ఉద్యోగులు ఖాళీగా ఉన్న మాట వాస్తవమే. కొందరిని బస్‌పాయింట్లు దగ్గరికి పంపుతున్నం. త్వరలోనే పరిస్థితిని సరిదిద్దుతాం. ఎక్కువగా ఉన్న ఉద్యోగులను  ట్రాన్స్‌ఫర్‌ చేస్తం. కొందరు ఇప్పటికే ఇతర డిపోలకు వెళ్తామని దరఖాస్తు చేసుకున్నరు. వారం, పది రోజుల్లోపూర్తిగా సెట్‌ చేస్తం.

– ఆర్టీసీలోని ఓ ఉన్నతాధికారి

Latest Updates