
- ఏఏఐపై సస్పెన్షన్‌తో గందరగోళంలో ఆర్చర్లు
- కష్టకాలంలోనూ రాణించిన ప్లేయర్లు
- టోక్యో ఒలింపిక్స్ బరిలో నలుగురు
‘‘గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం.. తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం’’.. ఎప్పుడో 1982లో వచ్చిన ఓ తెలుగు సినిమాలోని పాట పల్లవి ఇది. ప్రస్తుతం ఇండియా ఆర్చర్ల పరిస్థితికి ఇది సరిగ్గా సరిపోతుంది. ఓ పక్క ఒలింపిక్స్ సమీపిస్తుంటే ఇప్పటికీ సరైన ప్లానింగ్ లేదు. ఈ రోజు పాఠాలు చెప్పిన కోచ్ రేపు వస్తాడో రాడో తెలియదు. సరిగ్గా చెప్పాలంటే తర్వాత తాము ఆడబోయే టోర్నీపై కూడా వాళ్లకి అవగాహన లేదు. పాలనపరమైన లోపాల వల్ల 2019లో ఇండియన్ ఆర్చరీ పూర్తిగా దిగజారింది. అంతర్గత రాజకీయాలు, కుట్రల కారణంగా ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఏఏఐ)పై.. వరల్డ్ ఆర్చరీ ఫెడరేషన్(డబ్ల్యూఏఎఫ్) నిషేధం విధించింది. బోర్డు పెద్దల స్వార్థం ఆర్చర్లకు దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని దూరం చేసింది. సరైన అండ లేకున్నా.. న్యూట్రల్ ప్లేయర్లుగా బరిలోకి దిగాల్సి వచ్చినా ఇండియా ఆర్చర్లు మాత్రం తమ కష్టాన్ని గుండెల్లోనే దాచుకున్నారు. ఎనలేని ఆత్మవిశ్వాసంతో, భవిష్యత్తుపై నమ్మకం ఉంచి తమ సత్తా చూపెట్టారు. ఆసియా చాంపియన్‌షిప్స్, వరల్డ్ కప్, వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించారు. టోక్యో ఒలింపిక్స్‌లో నాలుగు కోటాలు సాధించి శభాష్ అనిపించారు. అసోసియేషన్ వివాదం సద్దుమణిగితే టోక్యోలో మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించాలని పట్టుదలగా ఉన్నారు.
కొంపముంచిన వివాదం..
ఇంటర్నేషనల్ బాడీ నిబంధనలకు విరుద్ధంగా నేషనల్ బోర్డులోని రెండు వర్గాలు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించడం వివాదాన్ని రేపింది. వీకే మల్హోత్ర, బీవీ పాపారావు రావు నేతృత్వంలోని వర్గాలు ఈ ఏడాది జూన్‌లో ఢిల్లీ, చండీగఢ్‌లో వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించుకున్నాయి. ఇదే ఏఏఐని క్రీడా ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టింది. దీంతో 15 మంది సభ్యులతో కూడిన డబ్ల్యూఏఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు ఏఏఐపై సస్పెన్షన్ ప్రతిపాదించింది. అయితే సమస్య పరిష్కరించుకోవాలని గడువిచ్చినా.. పరిస్థితి మారకపోవడంతో ఆగస్టులో సస్పెన్షన్ అమలులోకి వచ్చింది. దీంతో వరల్డ్ ఆర్చరీ ఆధ్వర్యంలో జరిగే ఈవెంట్ల్లో ఇండియా ఆర్చర్లు దేశానికి ప్రాతినిధ్యం వహించే చాన్స్ కోల్పోయారు. న్యూట్రల్ అథ్లెట్లుగా బరిలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది. ఏఏఐ ఎన్నికల వ్యవహారం ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో ఉండగా ఒలింపిక్స్‌లో ఇండియన్ ఆర్చర్ల ప్రాతినిధ్యంపై సస్పెన్స్ కొనసాగుతోంది.
సస్పెన్షన్ ఎఫెక్ట్..
సస్పెన్షన్ ఫలితంగా బ్యాంకాక్‌లో జరిగిన ఏషియన్ చాంపియన్‌షిప్‌లో మనోళ్లు సాధించిన 1 గోల్డ్, 2 సిల్వర్, 4 బ్రాంజ్ మెడల్స్‌కు తగిన గుర్తింపు లేకుండా పోయింది. మరో సందర్భంలో కాంపౌండ్ మిక్స్డ్ పెయిర్ ఈవెంట్లో ఏషియాలో సెకండ్ బెస్ట్‌గా నిలిచిన వెన్నం జ్యోతి సురేఖ, అభిషేక్ వర్మ జోడీని పోడియం వద్ద ఒలింపిక్ అథ్లెట్స్‌గా పరిచయం చేశారు. అంతేనా సౌత్ ఏషియన్ గేమ్స్‌లో బరిలోకి దిగే చాన్స్ కోల్పోయాం. 2016 ఎడిషన్‌లో మెడల్స్ క్లీన్‌స్వీప్ చేసిన ఇండియా ఆర్చర్లు లేకపోవడంతో ఈసారి బంగ్లాదేశ్ పదికి పది ఖాతాలో వేసుకుంది.
ఫస్ట్ టోక్యో టికెట్..
బోర్డు పరిస్థితి ఎలా ఉన్నా.. ఇండియాకు టోక్యో ఒలింపిక్స్‌లో తొలి బెర్త్ తెచ్చిపెట్టింది మాత్రం ఆర్చర్లే. మొత్తం నలుగురు ఆర్చర్లు టోక్యో టికెట్ సాధించారు. రియో ఒలింపిక్ టికెట్ దక్కించుకోలేకపోయిన తరుణ్‌దీప్ రాయ్, అటాను దాస్, ప్రవీణ్ జాదవ్ త్రయం వరల్డ్ చాంపియన్‌షిప్‌లో సత్తా చాటి అందరికంటే ముందు టోక్యోకు అర్హత సాధించింది. మహిళల స్టార్ ఆర్చర్ దీపికా కుమారి నాలుగో బెర్త్ సాధించి పెట్టింది. బ్యాంకాక్‌లో జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్‌లో సిల్వర్ మెడల్‌తో సత్తా చాటిన దీపిక టోక్యో టికెట్ దక్కించుకుంది. ఇవే కాక ఇతర టోర్నీల్లోనూ ఆర్చర్లు పతకాలు సాధించి తామేంటో
నిరూపించుకున్నారు.
సురేఖ సూపర్
కాంపౌండ్ విభాగంలో కొన్నేళ్లుగా నిలకడగా రాణిస్తున్న తెలుగు ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ ఈ సీజన్లోనూ సత్తా చాటింది. ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో స్వర్ణం నెగ్గిన ఆమె టీమ్ ఈవెంట్లో రజతం సాధించింది. ఇక, వరల్డ్ చాంపియన్‌షిప్‌లో రెండు కాంస్యాలతో మెరిసింది.
ఏడాది ప్రారంభం నుంచే..
నిజానికి ఈ ఏడాదిని ఏఏఐ వివాదాలతోనే మొదలుపెట్టింది. విజయ్ కుమార్ మల్హోత్ర 40 ఏళ్ల పాలనకు తెరదించుతూ రిటైర్ట్ ఐఏఎస్ అధికారి పాపారావు 2018 డిసెంబర్లో వివాదాస్పద రీతిలో ప్రెసిడెంట్ పదవి చేపట్టారు. అయితే సుప్రీం కోర్టు నియమిత కమిటీ చేసిన రాజ్యాంగ సవరణ ఫలితంగా ఐదు నెలల్లోనే పదవికి రాజీనామా చేశారు. రావు నేతృత్వంలోని ఏఏఐ పలుమార్లు విమర్శలపాలైంది. విమానం ఆలస్యం కావడంతో ఏప్రిల్‌లో మెడ్లిన్ వేదికగా జరిగిన వరల్డ్‌కప్‌కు ఇండియా ఆర్చర్లు దూరమయ్యారు. ఈ విషయంలో ఏఏఐ, స్పోర్ట్స్ మినిస్ట్రీ, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ మధ్య మాటల యుద్ధం నడిచింది. అంతేకాక డోపింగ్ ఆరోపణలున్న ఆర్చర్‌ను వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయడంతోపాటు కోచ్‌ల ఎంపిక విషయంలోను విమర్శలు ఎదుర్కొంది.