గురుకులంలో వసతుల్లేవ్

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: గురుకుల డిగ్రీ కాలేజీలో సౌకర్యాలు లేకపోవడంతో  ఇబ్బందులు తట్టుకోలేక వంద మంది స్టూడెంట్లు ఇంటికి వెళ్లిపోయారు. ఈ సంఘటన మహబూబ్ నగర్ పట్టణ శివారులోని తిరుమలహిల్స్ తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కాలేజీలో చోటుచేసుకుంది. కాలేజీలో మొత్తం 310 మంది స్టూడెంట్లు చదువుకుంటున్నారు. గురుకులంలో నీరు, మరుగుదొడ్లు, ఫ్యాన్లు తదితర సౌకర్యాలు లేక నిత్యం వారంతా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంలో గురుకుల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ ఎవరూ పట్టించుకోవడం లేదని స్టూడెంట్లు వాపోతున్నారు. గురుకులంలో మంచినీటి సౌకర్యం లేదని గతంలో  స్టూడెంట్లు మహబూబ్ నగర్, జడ్చర్ల రహదారిపై ఆందోళన చేశారు. అయినా స్పందించకపోవడంతో కొన్ని నెలల తర్వాత గురుకులం నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు పాదయాత్రగా వెళ్లి కలెక్టరేట్ ముట్టడించారు. జిల్లా కలెక్టర్ ను కలిసి వినతిపత్రాలను అందజేశారు.  కాలేజీ పరువు తీశారంటూ అప్పట్నుంచి స్టూడెంట్లను ప్రిన్సిపల్ తో పాటు వైస్ ప్రిన్సిపల్  ఇబ్బందులకు గురి చేస్తున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు.

మొత్తం కాలేజీకే సెలవులు

గురుకులంలో అసౌకర్యాలతో తాము అనారోగ్యానికి గురవుతున్నామని, ఇంటికి వెళ్లిపోతామని సెమిస్టర్ పరీక్షల తర్వాత పలువురు స్టూడెంట్లు ప్రిన్సిపల్, లెక్చరర్లకు చెప్పినా పట్టించుకోలేదు. స్టూడెంట్లు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు అక్కడకు చేరుకుని పిల్లలను ఇంటికి తీసుకెళ్తామని చెప్పినా వినిపించుకోలేదు. ఇక్కడి బాధలు భరించలేక గత గురువారం వంద మంది స్టూడెంట్లు గురుకులం నుంచి వెళ్లిపోయారు. విషయం పై అధికారులకు తెలుస్తుందని మొత్తం కాలేజీకే సెలవు ప్రకటించారు. పరీక్షలు ఉండడంతో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్​ను మాత్రమే అక్కడ ఉంచారు.

Latest Updates