మాకు వీడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటీ లేదు: క్యాట్

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉన్నందున కేసుల విచారణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్) పేర్కొంది. తమ సిబ్బందితోపాటు లాయర్లు కూడా కేసుల విచారణకు హాజరు కావడం సాధ్యం కావట్లేదని చెప్పింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసుల విచారణ చేపట్టడానికి సరైన వసతులు లేవంది. లాక్ డౌన్ ఉన్నందున ఇప్పుడు వాటిని సమకూర్చుకోవడం సాధ్యం కావట్లేదని చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన కేసులను విచారించే క్యాట్ కు ఢిల్లీలో ప్రిన్సిపల్ బెంచ్ తోపాటు దేశవ్యాప్తంగా బెంచ్ లు ఉన్నాయి. ప్రిన్సిపల్ బెంచ్ కు ఈ నెల 2 నుంచి 12 వరకు మినీ వెకేషన్ ఉండగా, లాక్ డౌన్ పై కేంద్రం తీసుకునే నిర్ణయం ఆధారంగా తాము చర్యలు తీసుకుంటామని చెప్పింది. ఏ చిన్న అవకాశం ఉన్నా.. తప్పకుండా కేసుల విచారణ చేపడతామని క్యాట్ పేర్కొంది.

Latest Updates