ఇండిగో ఓకే.. ఎయిరిండియా వద్దు: ఖతర్‌‌ ఎయిర్‌‌వేస్‌‌

ఎయిరిండియాలో మొత్తం వాటా అమ్మకానికి పెట్టినప్పటికీ దానిపై ఆసక్తి లేదని, ఇండిగోలో ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ చేసే ప్రతిపాదనను మాత్రం పరిశీలిస్తామని ఖతర్‌‌ ఎయిర్‌‌వేస్‌‌ గ్రూప్‌‌ సీఈఓ అక్బర్‌‌ అల్‌‌ బకర్‌‌ వెల్లడించారు. ఇంటర్‌‌గ్లోబ్‌‌ ఏవియేషన్‌‌ నడిపే ఇండిగోలో వాటా కొనేందుకు ఎంతో ఆసక్తితో ఉన్నప్పటికీ, కొంతకాలం ఎదురుచూస్తామని చెప్పారు. ఇప్పటికప్పుడు ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ చేయడం సరైంది కాదని అన్నారు. ఢిల్లీలో గురువారం ఖతర్‌‌ ఎయిర్‌‌వేస్‌‌, ఇండిగో మధ్య కోడ్‌‌షేర్‌‌ ఒప్పందం కుదిరిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కోడ్‌‌ షేరింగ్‌‌ వల్ల ఇండిగో మరిన్ని దేశాలకు సేవలు అందించగలుగుతుంది. ట్రాఫిక్‌‌నూ పెంచుకోగలుగుతుంది. ఒప్పందంలో భాగంగా ఖతర్‌‌ ఎయిర్‌‌వేస్‌‌ తన కోడ్‌‌ను ఇండిగో దోహా–ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌‌ ఫ్లైట్లకు ఇస్తుంది. ఈ విమానాలన్నీ గురువారమే మొదలయ్యాయి. ఈ అగ్రిమెంట్‌‌ గురించి ప్రకటించగానే ఇంటర్‌‌గ్లోబ్‌‌ ఏవియేషన్‌‌ షేర్లు రూ.26 పెరిగి రూ.1,495లకు చేరుకున్నాయి. ఇంటర్నేషనల్‌‌ మార్కెట్లపై పట్టు సంపాదించుకోవడానికి ఇండిగో.. కోడ్‌‌ షేర్‌‌ అగ్రిమెంట్‌‌ చేసుకోవడం ఇది రెండోసారి. ఈ ఒప్పందం వల్ల తమ కంపెనీ ఇంటర్నేషనల్‌‌ సర్వీసులు పెరగడమేగాక, ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడతాయని ఇండిగో సీఈఓ రణజయ్‌‌ దత్తా అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌‌లో జెట్‌‌ ఎయిర్‌‌వేస్‌‌ ఆర్థిక సమస్యల వల్ల మూతబడడంతో ఇండిగో మార్కెట్‌‌షేరు 47 శాతంనుంచి 48.2 శాతానికి పెరిగింది. ఇక ఖతర్ ఎయిర్‌‌వేస్ మనదేశంలోని 13 నగరాలకు సేవలు అందిస్తోంది.

Latest Updates