భూములు పాయే..  ప్రాజెక్టు పాయే.. కొలువులు రాకపాయే..

నేదునూరు పవర్ ప్లాంట్ నిర్వాసితుల గోస

12 ఏండ్లుగా ఉపాధి లేక అల్లాడుతున్నామని ఆవేదన
ప్రాజెక్టు రాలేదు గనుక భూములు వెనక్కివ్వాలని డిమాండ్

కరీంనగర్,  వెలుగు: భూములు ఇయ్యండి.. ఇక్కడ పవర్ ప్రాజెక్టు కడతాం.. మీ పిల్లలకు ఇందులో ఉద్యోగాలు ఇస్తం.. మీకు పునరావాసం  కల్పిస్తం.. అని కట్టుకథలు చెప్పిండ్రు. సరిగ్గా 12 ఏండ్ల కిందట కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరు లో గ్యాస్ ఆధారిత పవర్ ప్రాజెక్టు నిర్మిస్తామని సుమారు 432 ఎకరాలు రైతుల నుంచి సేకరించారు. ఆ భూముల్లో అప్పటి సీఎం రోశయ్య ఓపెన్ చేసిన పైలాన్ తప్పా.. అదనంగా ఒక్క ఇటుక పెల్ల కూడా పేర్చలేదు. ప్రాజెక్టు ఎలాగు కట్టలేదు.. మా పిల్లలకు ఉద్యోగాలు రావు.. ఇతర శాఖల్లోనైనా  ఉద్యోగాలు ఇప్పించండి.. ప్రభుత్వం ఇచ్చిన పరిహారం చెల్లిస్తం.. మా భూములు మాకు అప్పగించండంటూ రైతులు డిమాండ్​చేస్తున్నారు.

12 ఏళ్లుగా అందరి నోళ్లలో నానుతున్న నేదునూర్ పవర్ ప్లాంటు ప్రాజెక్టు ఏర్పాటు ప్రశ్నార్థకంగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టును నేదునూర్‌లో ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు ఎల్‌ఎండీ రిజర్వాయర్ కింద భూములు కోల్పోయిన రైతుల వద్ద ప్రభుత్వం భూములను మరోసారి సేకరించింది. మార్కెట్ విలువ ఎకరానికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉండగా, ప్రభుత్వం రూ.2.80 లక్షలు చెల్లించింది.  తక్కువ ధరకే అడుగుతున్నారని భూ నిర్వాసితులు అప్పట్లో మూడు నెలలపాటు ఆందోళన చేశారు. నిర్వాసిత కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పడంతో పిల్లలకు భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు భూములను ఇచ్చారు. 2008 నాటికి మొత్తం 432 ఎకరాలు సేకరించారు. 2,100 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి లక్ష్యం కాగా మొదటి దశలో 700 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణానికి 2010 ఫిబ్రవరి 14న అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య శంకుస్థాపన చేశారు.  కేంద్రం నుంచి గ్యాస్ కేటాయింపునకు  నేటి వరకు అనుమతి లేకపోవడంతో నేదునూర్ ప్రాజెక్టు పరిస్థితి ప్రశ్నార్థకంగానే మిగిలింది. భూములు కోల్పోయిన రైతులకు పరిహారం అందినా నిత్యం అన్నం పెట్టే భూములు కోల్పోయామనే బాధ వెన్నాడుతోంది. ప్రాజెక్టు వస్తే తమకు ఉద్యోగాలు వస్తాయనే ఆశతో ఇన్నాళ్లు ఉన్నామని, ప్రాజెక్టు నిర్మించకపోవడంతో తమ భూములు తమకు అప్పగిస్తే సాగు చేసుకుంటామని అక్కడి రైతులు అంటున్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములను ఇటీవల ఫుడ్ ప్రాసెసింగ్ కోసం అధికారులు పరిశీలించడంతో రైతుల్లో గుబులు మొదలైంది.

థర్మల్ ప్రాజెక్టుకు నో..

గ్యాస్ కేటాయింపులు లేకపోవడంతో నేదునూర్‌లో గ్యాస్ ఆధారిత ప్లాంట్ నిర్మాణం ఇక సాగదని తేలిపోయింది. జిల్లాలో బొగ్గు లభ్యత ఉండడం, నేదునూర్ పక్కనే ఎల్‌ఎండీ రిజర్వాయర్ ఉండడంతో నీటి లభ్యత ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం థర్మల్ ప్రాజెక్టుపై దృష్టి పెట్టింది. ఇక్కడ బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని ఆలోచించింది. గతంలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ థర్మల్ ప్రాజెక్టు ఏర్పాటు విషయాన్ని సూచనప్రాయంగా వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనల తయారీకి సిద్ధమైంది. ఇందుకు ప్రస్తుతం సీఎం ప్రత్యేక అధికారుల బృందంతో సర్వే చేయించినట్లు సమాచారం. అదనంగా స్థల సేకరణ అవసర కానుండడం.. ఇక్కడ సమీప ప్రాంతంలో ఇండ్లు, పొలాలు ఉండడం..రైలుమార్గం లేకపోవడంతో బొగ్గు రవాణా కష్టమని గుర్తించినట్లు తెలిసింది. దీంతో ఇక్కడ థర్మల్ ప్రాజెక్టు నిర్మాణానికి కూడా అవకాశం లేకుండా పోయింది.

పరిహారం తిరిగిస్తం

12 ఏళ్లు గడిచినా తమ పిల్లలకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదని, వయస్సు మీరిపోతోందని నిర్వాసితులు ఆందోళనకు గురవుతున్నారు. ఇండ్లు ఉన్నందున తాము ఎక్కడికీ పోలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా భూములు తమకు ఇస్తే తాము డబ్బులు తిరిగి ఇస్తామని అంటున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నిర్మిస్తే తమకు అందులో ఎలాంటి ఉద్యోగాలు రావని.. వాటి నుంచి దుమ్ము, ధూళి మాత్రమే మిగులుతాయని రైతులు వాపోతున్నారు. తమ పిల్లలకు ఎక్కడైనా ఉద్యోగాలు ఇప్పించాలని, లేదంటే ఏ ప్రాజెక్టు వచ్చినా అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్యే రసమయికి సైతం తమ భూములు తమకు  అప్పగించాలని వినతిపత్రం అందించారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని.. లేదంటే భూములు అప్పగించాలని… పరిహారాన్ని వాయిదాల రూపంలో చెల్లించడానికైనా సిద్ధంగా ఉన్నామని రైతులు స్పష్టం చేస్తున్నారు.

మా భూములు మాకివ్వాలి

నా వద్ద 8 ఎకరాలు తీసుకున్నారు. ఎల్‌ఎండీ రిజర్వాయర్‌లో ముంపునకు గురైన నిర్వాసితులే వయో పరిమితి దాటి ఉద్యోగాలకు నోచుకోలేదు. నేదునూర్ ప్రాజెక్టుకు12 ఏళ్లయినా పునాది పడలేదు. పిల్లలకు ఉద్యోగాలు ఎప్పుడొస్తాయో తెలియదు. అందుకే తీసుకున్న డబ్బులు తిరిగిస్తాం.. మా భూములు మాక్వివాలి లేదంటే ఏదైనా శాఖలో కుటుంబానికో ఉద్యోగమైనా ఇవ్వాలి.

– చాడ సుధాకర్‌రెడ్డి,  నిర్వాసితుడు

చాలా నష్టపోయా

మా దగ్గరి నుంచి 2008లో జెన్కో పవర్ ప్లాంట్ కోసం  పద్నాలుగున్నర ఎకరాల భూమి తీసుకున్నారు. అధికారులు ఎన్నో హామీలను ఇచ్చినా ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. మాకు జీవనోపాధి లేక బతుకులు ఆగం అవుతున్నాయి. మళ్లీ ఇప్పుడు ఫుడ్ పరిశ్రమ ఏర్పాటు చేస్తే మాకు జీవనోపాధి లేక రోడ్డున పడాల్సి వస్తుంది. ప్రభుత్వం చెల్లించిన పరిహారం తిరిగి ఇచ్చేస్తాం. మా భూములు మాకు అప్పగించాలి.

– నీలం రాజిరెడ్డి, లక్ష్మీదేవిపల్లి

For More News..

క్లాసులు ఎప్పుడు చాల్ చేద్దాం..

నేడు కేసీఆర్ సమీక్ష సమావేశం

రూ. 170 కోసం దోస్తుల గొడవ.. ఒకరి మృతి

సర్పంచ్‌గా గెలిచి.. ఊరికి మంచి నీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నానంటూ..

Latest Updates