ఏ పార్టీలో చేరను: ఈఎస్‌‌ఎల్‌‌  నరసింహన్‌‌

  • కామన్‌‌ మ్యాన్‌‌లా బతికేస్తా
  • పంచె కట్టుకుని ఇడ్లి, దోశ తింటూ స్వేచ్ఛను ఆస్వాదిస్తా
  • గుళ్లకు వెళ్లడంపై విమర్శలు బాగా హర్ట్‌‌ చేశాయి
  • తెలంగాణ ఉద్యమంలో ఎక్కడా తూటా పేలలేదు
  • నేను ఏ వర్గానికి, ఏ పార్టీకి సపోర్ట్‌‌ చేయలేదు
  • సహకరించిన అందరికీ థ్యాంక్స్​
  • రాష్ట్ర గవర్నర్‌‌ ఈఎస్‌‌ఎల్‌‌  నరసింహన్‌‌

తొమ్మిదిన్నరేళ్ల గవర్నర్‌‌ పదవి తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని, ఇక మీదట తాను పంచె కట్టుకుని, ఇడ్లీదోశ తింటూ చెన్నైలో కామన్‌‌ మ్యాన్‌‌లా స్వేచ్ఛను ఆస్వాదిస్తానని రాష్ట్ర గవర్నర్‌‌ ఈఎస్‌‌ఎల్‌‌  నరసింహన్‌‌ అన్నారు. భవిష్యత్‌‌లో తాను ఏ పార్టీలో చేరబోనని, రాజకీయాలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. రాజ్​ భవన్‌‌లో మంగళవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల ఆత్మీయ సమ్మేళనంలో నరసింహన్​ మాట్లాడారు.  గవర్నర్‌‌గా తాను సక్సెస్‌‌ అయ్యింది.. లేనిది చరిత్ర నిర్ణయిస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమం శాంతియుతంగా సాగిందని, ఎన్ని ఆందోళనలు జరిగినా ఎక్కడా తుపాకీ తూటా పేల్చలేదని, ఈ ఘనత సంయమనంతో పనిచేసిన పోలీసులదేనని ప్రశంసించారు.  తొమ్మిదిన్నరేళ్లలో ఇక్కడ చాలా నేర్చుకున్నానన్నారు. రాజకీయ పక్షాలు కూడా తనకు చాలా సహకరించాయని వెల్లడించారు. గవర్నర్‌‌గా తాను ఎక్కడా బాధ్యతను మరువలేదని, ఏ వర్గానికి, ఏ పార్టీకీ అనుకూలంగా వ్యవహరించలేదన్నారు. తాను చాలా సంతోషంగా వెళుతున్నానని, పై వాడి నిర్ణయం మేరకు తన డ్యూటీ చేశానని చెప్పారు.

టెంపుల్స్​కు వెళితే తప్పేంటి?

శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ డిసెంబర్ 31 న వచ్చినప్పుడు.. ‘రేపేంటి ? అని ఓ రిపోర్టర్ తనను అడిగారని, తాను జనవరి ఒకటి అని చెప్పడంతో తనను తెలంగాణ వ్యతిరేకిగా పేర్కొంటూ వార్తలు రాసేశారని గుర్తు చేశారు. అయినా చాలా సందర్భాల్లో మీడియా చాలా సహకరించిందని తెలిపారు. రాష్ట్ర విభజనకు ముందు  గవర్నర్‌‌గా మూడు నెలలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌ పాలనా వ్యవహారాలు చూసిన సమయంలో ఇంటర్‌‌ ఎగ్జామ్‌‌ పేపర్‌‌ లీకేజీ, పెట్రోల్‌‌ బంక్‌‌ల సమ్మె, రాష్ట్రంలో తాగునీటి ఎద్దడిలాంటి సమస్యలను పరిష్కరించానని గుర్తు చేశారు. ఎప్పుడూ గుడుల చుట్టూ తిరుగుతాడని మీడియాలో విమర్శలు రావడం తనను బాగా హర్ట్‌‌ చేసిందని చెప్పారు. తాను తిరుపతి, యాదగిరిగుట్ట, భద్రాచలం టెంపుల్స్‌‌కే ఎక్కువగా వెళ్లానని, అది తన పర్సనల్‌‌ లైఫ్‌‌ అని, గుడికి వెళితే తప్పేంటన్నారు. తాను గవర్నర్‌‌గా వెళ్లిపోతున్నందుకు ఎవరైనా సంబురాలు చేసుకుని, దేవుళ్లకు కొబ్బరికాయలు కొడితే కూడా తనకు మంచిదేనన్నారు.

నేను బుక్​ రాస్తే.. ఫ్రీగా ఇవ్వాల్సిందే

గవర్నర్‌‌గా ఉన్న సుదీర్ఘ అనుభవంపై ఏదైనా పుస్తకం రాసే ఆలోచన ఉందా అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ తాను కూడా బుక్‌‌ రాద్దామనుకున్నానని, కానీ అది చదివే వాళ్లెవరని, పైగా ఆ పుస్తకాలను ఫ్రీగా ఇవ్వాల్సిందే తప్ప, రాయల్టీ కూడా రాదని మా వాళ్లంటే ఊరకున్నానని నవ్వుతూ చెప్పారు. పుస్తకం రాసే ఆలోచనేది తనకు లేదన్నారు.

అవి ఔట్‌‌ ఆఫ్‌‌ సిలబస్‌‌..

యూపీఏ, ఎన్డీఏ పాలనలో గవర్నర్‌‌గా కొనసాగిన అనుభవం ఉన్న మీరు గవర్నర్‌‌ పోస్టుల్లో పొలిటికల్‌‌ అపాయింట్‌‌మెంట్లపై ఎలా స్పందిస్తారని అడగ్గా ఔట్‌‌ ఆఫ్‌‌ సిలబస్‌‌ అంటూ సమాధానం దాటవేశారు. తెలంగాణ ప్రభుత్వానికి అడ్వయిజర్​గా ఉంటానంటూ వచ్చిన వార్తలు తనకు తెలియదన్నారు.

పేపర్లు చించినవారితోనే మంత్రులుగా ప్రమాణం చేయించాను

2011 బడ్జెట్‌‌ సమావేశాల్లో టీఆర్‌‌ఎస్‌‌ ఎమ్మెల్యేలు కొందరు బడ్జెట్‌‌ ప్రసంగ పాఠం పేపర్లు లాక్కొని విసిరిన ఘటనపై అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ తాను స్పీచ్‌‌ కాపీలు చాలా తీసుకొచ్చానని, అందుకే పూర్తిగా చదివానని, జాతీయగీతం కూడా పాడి వెళ్లిపోయినట్లు చెప్పారు. ఆ ఘటనను తాను ఆ రోజే మరిచిపోయానని అన్నారు. గవర్నర్ స్పీచ్‌‌ను చించినవారితో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించినప్పుడు సంతోషించానని ఓ పశ్నకు సమాధానంగా చెప్పారు. తనకు అన్ని పార్టీల నాయకులతో పర్సనల్‌‌ రిలేషన్‌‌షిప్​ఉందని, వారే గేట్‌‌ బయటికి వెళ్లి గవర్నర్‌‌ గో బ్యాక్‌‌ అని అన్నారని చెప్పారు. పర్సనల్‌‌, పొలిటికల్, అఫీషియల్‌‌ రిలేషన్స్‌‌ వేర్వేరన్నారు. ఎవరైనా విమర్శలు చేయొచ్చని, కానీ అవి నిర్మాణాత్మకంగా ఉండాలని సూచించారు. తెలంగాణ భవిష్యత్ ఎంతో  బాగుంటుందన్నారు. తన ముఖానికి హీరో మహేష్‌‌బాబు బాడీతో  మార్ఫింగ్‌‌ చేసి ‘సర్వాధికారి’ అని వార్త ఇస్తే తాను నవ్వుకున్నానని గుర్తు చేశారు. అందరూ సీఎంలు మంచివారేనని, భార్యాభర్తల మధ్య ఉన్నట్లే చిన్నచిన్న డిఫరెన్స్‌‌లు అప్పడప్పుడు వచ్చేవన్నారు. తొమ్మిదన్నరేళ్లలో తనకు సహకరించిన పార్టీల నేతలు, తెలంగాణ, ఏపీ ప్రజలకు ఈ సందర్భంగా గవర్నర్‌‌ కృతజ్ఞతలు తెలిపారు.

Latest Updates