కాంగ్రెస్‌‌ పార్టీలో నాయకత్వ సంక్షోభం లేదు

న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాగట్బంధన్ కూటమి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. కూటమిలోని ఆర్జేడీ ఎక్కువ సీట్లు గెల్చుకున్నప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ మాత్రం తీవ్రంగా నిరాశపర్చింది. ఈ ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొంత స్తబ్ధత నెలకొంది. ఈ విషయంపై గాంధీ కుటుంబానికి సన్నిహితులైన సీనియర్ కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ స్పందించారు. కాంగ్రెస్‌‌లో నాయకత్వ సంక్షోభం లేదని ఆయన స్పష్టం చేశారు.

‘పార్టీ నాయకత్వం నా మాట వింటుంది. నా అభిప్రాయాలు చెప్పేందుకు నాకు అవకాశాలు వచ్చాయి. అలాగే ఇతర నేతలకూ అధిష్టానం అందుబాటులోనే ఉంది. కాంగ్రెస్ నాయకత్వం నేతల మాటలు వినదనే వదంతులు ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కావడం లేదు. పార్టీలో అన్ని విషయాలపై ఎప్పటికప్పడు విశ్లేషణలు జరుగుతూనే ఉంటాయి. విశ్లేషణలు జరగవనే మాటలు పూర్తిగా అబద్ధం. ఎక్కడ తప్పిదం జరుగుతుందనే విషయంపై పార్టీ నాయకత్వం లోతుగా విశ్లేషిస్తోంది. తప్పులను సరిదిద్దడంతోపాటు మెరుగ్గా అవ్వడంపై నిరంతరం దృష్టి పెడుతోంది. దీని గురించి మేం పబ్లిక్‌‌గా చర్చించాల్సిన అవసరం లేదు. పార్టీలో నాయకత్వ సంక్షోభం లేదు. మేం అందరం సంతోషంగా ఉన్నాం. సోనియా గాంధీ నాయకత్వంలో హ్యాపీగా ముందుకెళ్తున్నాం’ అని సల్మాన్ ఖుర్షీద్ పేర్కొన్నారు.

Latest Updates